ETV Bharat / politics

సికింద్రాబాద్​ లోక్​సభ స్థానం ఎవరిది? - నువ్వానేనా అన్నట్లు తలపడుతున్న ప్రధాన పార్టీలు - Secunderabad Lok Sabha Constituency

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 26, 2024, 10:06 AM IST

Secunderabad Lok Sabha Constituency
Secunderabad Lok Sabha Constituency

Secunderabad Lok Sabha Constituency : 'ఆ పార్లమెంటు పరిధిలో అన్ని శాసనసభ నియోజకవర్గాలు గెలిచాం. అది మాత్రం కైవసం చేసుకోలేకపోయామని' ఒక పార్టీ. 'లోక్​సభ స్థానం గెలిచాం, ఒక్క అసెంబ్లీ స్థానం గెలవలేకపోయామని' మరో పార్టీ. 'రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం కానీ ఆ లోక్​సభ పరిధిలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయామని' మరో పార్టీ. సికింద్రాబాద్​ పార్లమెంటు స్థానంపై మూడు ప్రధాన పార్టీల మాటలు ఇలా ఉన్నాయి. ఈసారి ఎలాగైనా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ, కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో? ఎవరు సికింద్రాబాద్​ స్థానాన్ని గెలుస్తారో ఓసారి చూద్దాం?

Secunderabad Lok Sabha Constituency : రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారింది. గ్రేటర్​ పరిధిలో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ముఖ్యంగా అన్ని ప్రధాన పార్టీలు సికింద్రాబాద్​ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్నాయి. మరోవైపు ఓటర్లు మాత్రం ఇప్పటివరకు ఒక ఎత్తు, ఇకపై ఒకెత్తు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. సిట్టింగ్​ సీటును కాపాడుకోవాలని బీజేపీ, ఒక్కసారైన గులాబీ జెండా సికింద్రాబాద్​లో ఎగురవేయాలని బీఆర్​ఎస్​, ఈసారి కచ్చితంగా సీటును హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్​ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నాయి.

విభిన్న మతాలు, వర్గాలకు వేదికైన సికింద్రాబాద్​ పార్లమెంటు నియోజకవర్గాన్ని మినీ భారతదేశంగా పిలుస్తారు. ఎందుకంటే బీసీలు, మైనార్టీలు, క్రిస్టియన్లు, ఎస్సీలతో పాటు ఉత్తరాదికి చెందిన భారతీయ ఓటర్లు అధిక సంఖ్యలో ఇక్కడ నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో దక్షిణ మధ్య రైల్వే జోన్​ ఉండడం ఇక్కడ ప్రధానమైన సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​, లాలాగూడ వర్క్​ షాపు, రైల్వే క్వార్టర్లు ఉండడంతో ఎక్కువ మంది రైల్వే ఉద్యోగులు, సిబ్బంది ఈ నియోజకవర్గంలో నివసిస్తున్నారు. దీంతో రైల్వే ఓటర్లు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది.

ప్రచారంలో దూసుకుపోతున్న ప్రధాన పార్టీలు : కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుందని, మోదీ హ్యాట్రిక్​ ప్రధాని అవుతారని బీజేపీ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఆ పార్టీని గెలిపిస్తే కేంద్ర నిధులతో నియోజకవర్గాలన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెబుతోంది. మరోపక్క కాంగ్రెస్​ పార్టీ నేతలు ఇండియా కూటమే అధికారంలోకి రాబోతుందని వారితోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుబాటులోకి వస్తాయని ప్రచారం చేస్తున్నారు. బీఆర్​ఎస్​ హయాంలో చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని గులాబీ పార్టీ ప్రచారం చేస్తోంది. విభజన హామీలపై పోరాడిన ఏకైక పార్టీ బీఆర్​ఎస్​నే అంటూ ప్రచారంతో హోరెత్తిస్తుంది. కానీ ఓటర్లు మాత్రం మౌనం వహిస్తున్నారు. మరి ఈసారి సైలెంట్​ ఓటింగ్​ ఎవరికి మేలు చేస్తుందని ప్రధాన పార్టీలు ఆలోచనలో పడ్డాయి.

సికింద్రాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గంలో గెలుపు బీఆర్​ఎస్​దే : ​పద్మారావు గౌడ్

సికింద్రాబాద్​ ఎన్నికల పర్వం : 1957లో ఏర్పాటైన సికింద్రాబాద్​ పార్లమెంటు నియోజకవర్గానికి ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో 10 సార్లు కాంగ్రెస్​ గెలవగా, ఐదుసార్లు బీజేపీ, ఒకసారి బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) మాత్రమే విజయం సాధించింది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి కిషన్​రెడ్డి గెలుపొందారు. ఈసారి మళ్లీ గెలిచి తన సీటు సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో కిషన్​రెడ్డి పాదయాత్ర, ఒక విడత ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు రెండోసారి ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమాలు మోదీ హవా పనిచేస్తుందని కిషన్​రెడ్డి భావిస్తున్నారు.

మరోవైపు సికింద్రాబాద్​ లోక్​సభ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరింటిని కైవసం చేసుకున్న బీఆర్​ఎస్​, ఈసారి పార్లమెంటు స్థానం కూడా కైవసం చేసుకుంటామనే ధీమాతో ఉంది. బీఆర్​ఎస్​ అభ్యర్థి పద్మారావు సిటింగ్​ ఎమ్మెల్యే, పైగా డిప్యూటీ స్పీకర్​గా పని చేశారు. గతంలో కూడా ఎక్సైజ్​ శాఖ మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. దీంతో ఎన్నికల్లో కారు దూసుకుపోవడం ఖాయమని అంతా భావిస్తున్నారు. మరోపక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఇతర పార్టీల నేతలు భారీగా కాంగ్రెస్​ పార్టీలోకి వలస వెళ్తున్నారు. ప్రస్తుత ఖైరతాబాద్​ సిట్టింగ్​ ఎమ్మెల్యే దానం నాగేందర్​ బీఆర్​ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరారు. ఆ పార్టీ నుంచి సికింద్రాబాద్​ ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డారు. కాంగ్రెస్​ ఇక్కడ కచ్చితంగా గెలుస్తుందని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి.

అభ్యర్థులను కలవరపెడుతున్న పోలింగ్​ : మరోవైపు సికింద్రాబాద్​ పార్లమెంటు నియోజకవర్గంలో పోలింగ్​ శాతం మాత్రం అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తుంది. ప్రతి ఏడాది ఇక్కడ పోలింగ్ శాతం అనేది తగ్గిపోతూ వస్తుంది. గత మూడు ఎన్నికలను చూసుకుంటే 2009లో 55 శాతం, 2014లో 53 శాతం, 2019లో మరి తగ్గి 48.9 శాతానికి పడిపోయింది. ఈ తగ్గిపోతున్న పోలింగ్​తో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పుడు ఈ వేసవి పోలింగ్​పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో యువ ఓటర్ల హవానే ఎక్కువ. 18 నుంచి 19 ఏళ్ల మధ్య యువకులు 31,763 మంది ఉండగా, 20 నుంచి 29 ఏళ్లు మధ్య యువకులు 3,31,590 మంది, 30 నుంచి 39 ఏళ్లు మధ్య వారు 6,07,091 మంది ఉన్నారు. ఈ స్థానంలో 18 నుంచి 39 ఏళ్లు మధ్య సుమారు 10 లక్షల ఓటర్లు ఉండటంతో వీరి ఓటింగ్​పైనే ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ముఖ్యంగా ఈ నియోజకవర్గ ప్రజలను సతమతం చేస్తున్న చాలా సమస్యలున్నాయి. వాటి అన్నింటిని ఈ ఎన్నికల తర్వాత పరిష్కరిస్తామంటూ మూడు ప్రధాన పార్టీలు హామీలు కురిపిస్తున్నాయి.

'సికింద్రాబాద్​ టికెట్​ను బీఆర్​ఎస్​ బీజేపీకి తాకట్టు పెట్టింది - కేసీఆర్​ను నమ్ముకుంటే పద్మారావు మునిగినట్లే'

సికింద్రాబాద్​లో త్రిముఖ పోరు - అభ్యర్థులను కలవరపెడుతున్న పోలింగ్​ శాతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.