ETV Bharat / politics

కొలిక్కిరాని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ - ఆరు సీట్లపై ఏకాభిప్రాయం

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 20, 2024, 11:46 AM IST

Lok Sabha elections 2024
Telangana Congress MP Candidates List 2024

Telangana Congress MP Candidates List 2024 : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రంగంలోకి దింపే అభ్యర్థులపై కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ (సీఈసీ) కసరత్తు చేసింది. తెలంగాణలో ప్రకటించాల్సిన 13 స్థానాల్లో ఏడింటిపై చర్చ జరగ్గా ఆరు స్థానాలకు సంబంధించి దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. భువనగిరి నియోజకవర్గ అభ్యర్థి ఎంపికపై ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది.

Telangana Congress MP Candidates List 2024 : రాష్ట్రంలో కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇంకా కొలిక్కిరానట్టు సమాచారం. మంగళవారం రోజున దిల్లీలో జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో 6 లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై మాత్రమే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ప్రధానంగా 13 నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ఆరు నియోజకవర్గాలు మాత్రమే చర్చకు రావడం, అందులో భువనగిరి నియోజకవర్గ అభ్యర్థి ఎంపికపై ఏకాభిప్రాయం కుదరలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.

లోక్​సభ పోరుకు కాంగ్రెస్ రెడీ - రేపు ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్న ఏఐసీసీ

Telangana Lok Sabha Elections 2024 : నాగర్‌కర్నూల్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి, ఆదిలాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాల అభ్యర్థులపై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. నాగర్‌కర్నూల్ అభ్యర్థిగా మల్లు రవి, చేవెళ్ల అభ్యర్థిగా రంజిత్ రెడ్డి, మల్కాజ్‌గిరి అభ్యర్థిగా సునీతా మహేందర్ రెడ్డి, ఆదిలాబాద్ అభ్యర్థిగా ప్రొఫెసర్ కె. సుమలత, పెద్దపల్లి అభ్యర్థిగా గడ్డం వంశీ పేర్లను ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అభ్యర్థుల ఎంపికపై పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ఏఐసీసీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Congress CEC Meeting : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సునాయాసంగా నెగ్గిన జిల్లాల్లో సైతం అభ్యర్థులను ఖరారు చేయడంలో జాప్యం జరుగుతుండటంపై సీఈసీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో 12 నుంచి 14 లోక్‌సభ స్థానాలను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నా కొన్ని స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో ఇంకా ఎందుకు జాప్యం జరుగుతోందని చర్చించినట్లు సమాచారం. పార్టీ గెలుస్తుందని ఎక్కువమంది నేతలు పోటీపడుతున్నందున రాష్ట్ర స్థాయి స్క్రీనింగ్‌ కమిటీ ఒక్కో స్థానానికి ఒక్కో అభ్యర్థిని ఎంపిక చేయలేకపోయినట్లు సీఈసీకి నేతలు వివరించినట్లు తెలుస్తోంది.

21న మళ్లీ సీఈసీ సమావేశం : దేశవ్యాప్తంగా తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం, ఛత్తీస్‌గఢ్‌, అండమాన్‌ నికోబార్‌ దీవులు, పుదుచ్చేరి, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, రాజస్థాన్‌లలోని 80 స్థానాలకు గాను 5 చోట్ల మినహా మిగిలిన అన్నింటిపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఒకటి రెండురోజుల్లో మూడో జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మళ్లీ 21వతేదీన సీఈసీ సమావేశం దిల్లీలో జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడం కాంగ్రెస్​కు సాధ్యమేనా? హస్తం​ పార్టీకి ఉన్న బలాబలాలేంటి?

నేడు కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా! - ఆశావహుల్లో ఉత్కంఠ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.