ETV Bharat / politics

4 వివాదరహిత స్థానాలకు ఎంపీ అభ్యర్థుల ప్రకటన - మిగిలిన సీట్లపై కాంగ్రెస్ కసరత్తు

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 9, 2024, 8:26 AM IST

Telangana Congress Lok Sabha Candidates First List 2024: లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రంలో 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌ మిగిలిన వాటిపై కసరత్తు చేస్తోంది. తొలిజాబితాలోని నాలుగింటిలో 2 స్థానాలు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినవి కాగా మరో రెండింటిలో ఒకటి AICC కోటా, మరొకటి సీనియర్‌ నేత కుమారుడికి టికెట్‌ కేటాయించారు. పలు నియోజకవర్గాల్లో తీవ్రమైన పోటీ దృష్ట్యా లోతైన అధ్యయనం, సర్వే నివేదికల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.

Telangana Congress  Lok Sabha Candidates First List
Telangana Congress Lok Sabha Candidates First List

4 వివాదరహిత స్థానాలకు ఎంపీ అభ్యర్థుల ప్రకటన - మిగిలిన సీట్లపై కాంగ్రెస్ కసరత్తు

Telangana Congress Lok Sabha Candidates First List 2024 : రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్‌లో లోక్‌సభ ఎన్నికల కోసం తీవ్ర పోటీ నెలకొంది. చాలా నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవటంతో కేంద్ర ఎన్నికల కమిటీ ఏకపక్షంగా ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో 39 మందితో కూడిన తొలిజాబితా ద్వారా రాష్ట్రంలో వివాదరహిత 4 లోక్‌సభ స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో మహబూబ్‌నగర్‌ నుంచి ఏఐసీసీ కార్యదర్శి, సీడబ్ల్యూసీ ఆహ్వానితుడు వంశీచంద్‌ రెడ్డి, జహీరాబాద్‌ నుంచి మాజీ ఎంపీ సురేష్‌ షెట్కర్‌, నల్గొండ నుంచి కుందూరు రఘువీర్‌రెడ్డి, మహబూబాబాద్‌ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌లను ఎంపిక చేస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం జాబితా ప్రకటించింది.

వంశీచంద్ రెడ్డి రాజకీయ నేపథ్యం ఇదే
పాలమూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న చల్లా వంశీచంద్‌రెడ్డి ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా పరిధిలోని చారకొండ మండలం శేరిఅప్పిరెడ్డిపల్లివాసి. ఎంబీబీఎస్ చదివిన వంశీచంద్‌ విద్యార్ధి దశ నుంచి ఎన్​ఎస్​యూఐలో పని చేస్తూ కాంగ్రెస్‌లో అంచెలంచెలుగా ఎదిగారు. 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 2019లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఏఐసీసీ కార్యదర్శిగా, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్న వంశీచంద్‌ను కాంగ్రెస్‌ అధిష్ఠానం మరోసారి మహబూబ్‌నగర్‌ నుంచి బరిలోకి దించింది.

Telangana Congress MP Candidates 2024 : నల్గొండ లోక్‌సభ(LOK Sabha) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కుందూరు జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డిని పార్టీ అధిష్ఠానం బరిలోకి దించింది. 2014 నుంచి పీసీసీ సభ్యుడుగా, 2021 నుంచి పీసీసీ ప్రధాన కార్యదర్శిగా రఘువీర్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు కేంద్ర మాజీ మంత్రి పొరిక బలరాంనాయక్‌కు కాంగ్రెస్‌ అధిష్ఠానం మరోసారి అవకాశం కల్పించింది. ములుగు జిల్లా మదనపల్లి గ్రామానికి చెందిన ఆయన 2009లో ఎంపీగా గెలుపొంది 2013 వరకు కేంద్ర మంత్రిగా పని చేశారు. అదేవిధంగా జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీచేయనున్న సురేష్‌ షెట్కర్‌ యువజన కాంగ్రెస్‌, మెదక్‌ డీసీసీ అధ్యక్షుడిగా, జహీరాబాద్‌ ఎంపీగా పనిచేశారు.

Lok Sabha polls 2024 : రాష్ట్రంలో మరో 13 లోక్‌సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వరంగల్‌ ఎస్సీ రిజర్వుడ్‌ స్థానం నుంచి దొమ్మాటి సాంబయ్య, ఇందిరతో పాటు అద్దంకి దయాకర్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌ టికెట్‌ తనకే వస్తుందని మాజీ ఎంపీ మల్లు రవి ధీమాతో ఉండగా మరింత అధ్యయనం చేశాకే, సీఈసీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఖమ్మం నుంచి ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల కుటుంబ సభ్యులు టికెట్లు ఆశిస్తుండగా ఇక్కడ అభ్యర్థి ఎంపికపై అధిష్ఠానం తీవ్ర కసరత్తులు చేయాల్సి వస్తోంది. ఖమ్మం నుంచి పోటీ చేయాలనుకున్న వీహెచ్​ పోటీ తీవ్రంగా ఉన్నందున తప్పుకున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్‌ నుంచి ఏఐసీసీ హామీ మేరకు ప్రవీణ్‌రెడ్డికి టికెట్ ఇవ్వాల్సి ఉంది. ఇక్కడి నుంచి వెలిచల రాజేంద్రరావు తనకు టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు. పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ తనయుడు వంశీ ఆశిస్తుండగా ఆయనకు ఇవ్వొద్దంటూ నలుగురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఈ పరిస్థితుల్లో అధిష్ఠానం ఆచితూచి అడుగులేస్తోంది.

అశావహుల్లో తీవ్రపోటీ
నిజామాబాద్‌ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి టికెట్‌ ఆశిస్తుండగా తమకు అవకాశం కల్పించాలని మాజీ ఎమ్మెల్యే ఇరావత్రి అనిల్‌, ఆరంజ్‌ ట్రావెల్స్‌ యజమాని సునీల్‌రెడ్డి పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. సర్వే నివేదిక ఆధారంగానే ఇక్కడ అభ్యర్థిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మెదక్‌ నుంచి నీలం మధుకు టికెట్ ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మల్కాజిగిరి నుంచి తనకు టికెట్‌ ఇస్తారని పార్టీ సీనియర్‌ నేత హరివర్ధన్‌ రెడ్డి భావిస్తుండగా ఇటీవల పార్టీలో చేరిన అల్లు అర్జున్‌ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి సైతం టికెట్‌ ఆశిస్తున్నారు.

సికింద్రాబాద్‌ టికెట్‌ బొంతు రామ్మోహన్‌ కుటుంబానికి ఇచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి మస్కతి డెయిరీ యజమానిని బరిలో దించాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది. ఆదిలాబాద్‌ నుంచి పోటీ చేసేందుకు సరైన అభ్యర్ధి లేకపోగా బలమైన నాయకుడి కోసం వేట సాగిస్తున్నారు. భువనగిరి నుంచి బరిలో దిగేందుకు PCC ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌రెడ్డి కొన్నాళ్లుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. కానీ ఇక్కడ చామలకు టికెట్‌ ఇవ్వొద్దంటూ కొందరు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ నుంచి టికెట్‌ ఆశిస్తున్న కోమటిరెడ్డి సోదరుడి కుమారుడు సూర్య పవన్‌రెడ్డి పేరునూ పరిశీలిస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికలు 2024 - నాలుగు ఎంపీ స్థానాలు ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ

కేసీఆర్‌ కుటుంబసభ్యుల ఉద్యోగాలు ఊడిన తర్వాతే యువతకు జాబ్‌లు వస్తున్నాయి : సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.