ETV Bharat / politics

మోదీ, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ల దూకుడు - ఎప్పుడు కలిసినా విజయ కేతనమే - TDP BJP JANASENA ALLIANCE IN AP

author img

By ETV Bharat Telangana Team

Published : May 9, 2024, 12:51 PM IST

TDP Janasena Bjp Alliance in AP : తెలుగుదేశం, జనసేన, బీజేపీల మైత్రీబంధం ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. ఈ మూడు పార్టీల కలయిక సూపర్‌ హిట్టయింది. అగ్రనేతలు మొదలు క్షేత్రస్థాయిలో కార్యకర్తల వరకు ఒకే మాట, ఒకే బాటగా సాగుతున్నారు. ఎన్డీయే అభ్యర్థులకు ప్రజల నుంచి అసాధారణ మద్దతు లభిస్తోంది. తమ జీవితాల్లో మార్పుకోసం ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజలకు కూటమి ఆశాకిరణమైంది. ఎన్డీయే ధాటికి వైఎస్సార్సీపీ కూకటివేళ్లతో పెకలించుకుపోతుందని, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూటమి అధికారంలోకి రావడం ఖాయమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

TDP Janasena Bjp Friendship in AP
TDP Janasena Bjp Alliance Speed up in Campaign (ETV Bharat)

మోదీ చంద్రబాబు పవన్‌ కల్యాణ్‌ల దూకుడు ఎప్పుడు కలిసినా విజయ కేతనమే (ETV Bharat)

TDP Janasena Bjp Alliance Speed up in Campaign : వైఎస్సార్సీపీ అరాచక పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించడమే లక్ష్యంగా చేతులు కలిపి, ఎన్నికల సమరాంగణంలో త్రిమూర్తుల్లా విజృంభిస్తున్న నరేంద్రమోదీ, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ల ధాటికి వైఎస్సార్సీపీ కకావికలమవుతోంది. పోలింగ్‌ తేదీ దగ్గరపడే కొద్దీ మూడు పార్టీల అగ్రనేతలూ దూకుడు పెంచారు. ఐదేళ్లలో జగన్‌ ప్రభుత్వం చేసిన అరాచకాల్ని ప్రచారంలో కూటమి అగ్రనేతలు చీల్చి చెండాడుతున్నారు.

మోదీ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ విడివిడిగా, కలసికట్టుగా రాష్ట్రం నలుమూలలా పర్యటిస్తున్నారు. ఏపీలో బీజేపీ 10 శాసనసభ, ఆరు లోక్‌సభ స్థానాలకు మాత్రమే పోటీ చేస్తున్నప్పటికీ ప్రధాని నరేంద్రమోదీ అసాధారణ రీతిలో ఐదు చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సహా ఆ పార్టీ అగ్రనేతలూ రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తించారు.

వాజపేయీ హయాం నుంచీ: 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసికట్టుగా సాధించిన విజయాన్ని పదేళ్ల తర్వాత పునరావృతం చేయబోతున్నాయి. బీజేపీ, టీడీపీ మైత్రీబంధం ఇప్పటిది కాదు. వాజపేయీ హయాం నుంచీ రెండు పార్టీలూ కలసి పనిచేశాయి. 2014 ఎన్నికల్లో మోదీ, చంద్రబాబు మైత్రీబంధం మరింత బలోపేతమైంది. అగ్నికి వాయువులా వారిద్దరికీ ఆ ఎన్నికల్లో పవన్‌కల్యాణ్‌ తోడవడంతో ఎదురు లేకుండా పోయింది. 2017-18కి వచ్చేసరికి కొన్ని కారణాల వల్ల మూడు పార్టీల మధ్య దూరం పెరిగింది. 2019లో విడివిడిగా పోటీ చేసినప్పటికీ, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మళ్లీ చేతులు కలపడం చారిత్రక అవసరంగా మూడు పక్షాలూ గుర్తించాయి.

వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి కౌంట్​డౌన్​ మొదలైంది- అన్ని మాఫియాలకు ట్రీట్​మెంట్​ తప్పదు : మోదీ - PM MODI FIRE on ysrcp

భేషజాలు లేకుండా: ఎలాంటి భేషజాలు లేకుండా పొత్తును పటిష్ఠం చేయడంలో చంద్రబాబు, పవన్‌ తమ వంతు కృషి చేశారు. పవన్‌ కల్యాణ్‌పై చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబసభ్యులూ ఆదరాభిమానాలు చూపిస్తున్నారు. ఆయన గురించి లోకేశ్‌ ఏ సందర్భంలో మాట్లాడాల్సి వచ్చినా ‘అన్న’ అని ఆత్మీయంగా సంబోధిస్తున్నారు. గన్నవరం, గుడివాడ వైఎస్సార్సీపీ అభ్యర్థులు చంద్రబాబుపై ఇష్టానుసారం మాట్లాడటం, చివరకు ఆయన సతీమణిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ శ్రేణులు తీవ్రంగా రగిలిపోయారు.

ఆ రెండు చోట్లా వైఎస్సార్సీపీ అభ్యర్థుల తీరును ఎండగడుతూ పవన్‌కల్యాణ్‌ చెలరేగిపోవడం, భువనేశ్వరిని సోదరిగా సంభోదిస్తూ ఆమెకు జరిగిన అవమానం తనకు, తన కుటుంబసభ్యులకు జరిగినట్లుగా భావిస్తున్నానని చెప్పడం టీడీపీ శ్రేణుల మనసులకు హత్తుకుంది. రెండు పార్టీల శ్రేణుల మధ్య టికెట్‌ల పంపిణీ సందర్భంగా చిన్నపాటి భేదాభిప్రాయాలు తలెత్తినా వాటిని పక్కనపెట్టి విస్తృత లక్ష్యం కోసం ముందుకు వెళుతున్నారు.

విజయవాడలో ప్రధాని రోడ్ షో- బ్రహ్మరథం పట్టిన ప్రజలు - PM Modi Road show

అన్ని అంశాల్లోనూ సమన్వయంతో దూసుకెళ్తూ: టీడీపీ, జనసేనలతో బీజేపీ పొత్తు పెట్టుకోకుండా చేసేందుకు వైఎస్సార్సీపీ శక్తివంచన లేకుండా ప్రయత్నించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ అరాచకాలపై పూర్తి స్పష్టత ఉన్న బీజేపీ అగ్రనేతలు టీడీపీ, జనసేనలతో పొత్తుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టో, ఉమ్మడి ఎన్నికల ప్రచారం మొదలు అన్ని అంశాల్లోనూ మూడు పార్టీలూ సమన్వయంతో దూసుకెళ్తున్నాయి.

మేనిఫెస్టోలో బీజేపీ భాగస్వామి కాకపోవడంపై అపోహలు సృష్టించేందుకు వైఎస్సార్సీపీ ప్రయత్నించినా బీజేపీ సహ ఇన్‌ఛార్జి సిద్ధార్థనాథ్‌సింగ్‌ తిప్పికొట్టారు. ‘కేంద్రంలో ఎన్డీయే మ్యానిఫెస్టో విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలతో కలిసి పోటీ చేస్తున్న రాష్ట్రాల మ్యానిఫెస్టోల్లో బీజేపీ భాగస్వామి కావడం లేదు’ అని వివరంగా చెప్పారు. టీడీపీ-జనసేన మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

మూడు పార్టీల అగ్రనాయకులూ తమ పార్టీ తరఫున అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారా? లేదా? అన్న విషయాన్ని పక్కనపెట్టి, ఎన్డీయే విజయమే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. చిలకలూరిపేటతో పాటు, రాజమహేంద్రవరం, అనకాపల్లి, కలికిరిల్లో జరిగిన సభలు, విజయవాడ రోడ్డుషోలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. జగన్‌ ప్రభుత్వ అవినీతి, ఇసుక, మద్యం దందాలు, భూముల దోపిడీ వంటి అంశాలపై ఘాటైన విమర్శలు చేశారు. నరసరావుపేట లోక్‌సభ స్థానం పరిధిలో బీజేపీ అభ్యర్థులెవరూ పోటీలో లేనప్పటికీ, చిలకలూరిపేటలో జరిగిన ఎన్డీయే సభకు ప్రధాని హాజరయ్యారు.

జగన్‌ వైరస్‌కు ఓటే వ్యాక్సిన్‌ - విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు: చంద్రబాబు - Chandrababu Naidu Interview

శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం సభకు అమిత్‌షా హాజరై వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధ్వంసక విధానాల్ని తూర్పారబట్టారు. అగ్రనేతలైన నితిన్‌ గడ్కరీ, రాజ్‌నాథ్‌సింగ్‌లూ ప్రచారంలో పాల్గొన్నారు. రేపల్లె, పొన్నూరు వంటి చోట్ల తమ పార్టీ అభ్యర్థులు పోటీలో లేకపోయినా, పవన్‌కల్యాణ్‌ అక్కడ ప్రచారం చేశారు. తిరుపతి లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ బరిలో లేకున్నా పవన్‌ కల్యాణ్‌తో కలిసి చంద్రబాబు ప్రచారంలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం, రైల్వేకోడూరులో ఎన్నికల ప్రచారానికి ఇద్దరూ కలిసే వెళ్లారు. బీజేపీ మద్దతుతో పోటీ చేస్తున్నప్పటికీ, రాష్ట్రంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల అమలు, మసీదుల నిర్మాణానికి అవసరమైన సహకారం వంటి అంశాలకు కట్టుబడి ఉన్నామని టీడీపీ తన విధానాన్ని విస్పష్టంగా ప్రకటించింది.

కృష్ణార్జునుల్లా సమరశంఖం పూరించారు: రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, విధ్వంసకాండపై మొదట చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కృష్ణార్జునుల్లా సమరశంఖం పూరించారు. రెండు పార్టీల పొత్తు రాత్రికి రాత్రే సాధ్యమవలేదు. అనేక విస్తృత సమావేశాల తర్వాత వారు ఒక నిర్ణయానికి వచ్చారు. జగన్‌ను ఎదుర్కోవాలంటే కలిసి పోరాడాల్సిందేనని స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనే గుర్తించారు. ఆ ఎన్నికల్లో కొన్ని చోట్ల టీడీపీ, జనసేన నేతలు క్షేత్రస్థాయిలో అవగాహనతో పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో రెండు పార్టీల మధ్య విస్తృత అవగాహన దిశగా అడుగులు పడ్డాయి. పవన్‌కల్యాణ్‌ను విశాఖ పర్యటనలో పోలీసులు తీవ్రస్థాయిలో ఇబ్బంది పెట్టి, నగరంలో తిరగకుండా ఆయనను అడ్డుకుని, దాష్టీకానికి పాల్పడ్డారు.

'చంద్రబాబుతో అమిత్​షా ఏమన్నారంటే!'- 'నెటిజన్ల స్పందన ఇదీ' - Hello AP Bye Bye YCP

ఆ తర్వాత విజయవాడలో పవన్‌ బసచేసిన హోటల్‌కు చంద్రబాబు స్వయంగా వెళ్లి సంఘీభావం ప్రకటించారు. అనంతరం నేతలిద్దరి మధ్య రెండు మూడు సమావేశాలు జరిగాయి. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేసినప్పుడు పవన్‌కల్యాణ్‌ స్నేహహస్తం అందించడం రెండు పార్టీల మైత్రిలో కీలక మలుపు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి వెళ్లి చంద్రబాబును కలిసి మద్దతు ప్రకటించిన పవన్‌, బయటకు వస్తూనే ఎన్నికల్లో రెండు పార్టీలూ కలసి పోటీ చేస్తాయని ప్రకటించారు. అప్పటికే బీజేపీకి జనసేన మిత్రపక్షంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా టీడీపీతో కలిసి నడవాలని ఆయన నిర్ణయించారు. బీజేపీ కూడా తమతో కలిసి వచ్చేలా పవన్‌ విశేష కృషిచేశారు.

జగన్‌ ఫొటో ఉన్న పాసుపుస్తకాన్ని చించిపారేసిన చంద్రబాబు - CHANDRABABU PRAJA GALAM MEETING

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.