ETV Bharat / politics

3 పార్టీల కన్ను మెదక్ సీటు పైనే - బీఆర్​ఎస్​ కంచుకోటలో ఈసారి గెలుపెవరిదో? - Medak MP Seat

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 21, 2024, 7:33 PM IST

Major Parties Focus on Medak MP Seat : కొద్ది రోజుల్లో రానున్న పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ఆయా ప్రధాన పార్టీలు కొన్ని ప్రాంతాల్లో ఉన్న స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశాయి. కానీ రాష్ట్రంలోనే బీఆర్​ఎస్​కు కంచుకోటగా ఉన్న మెదక్‌ ఎంపీ స్థానానికి బీజేపీ మినహా మిగతా 2 ప్రధాన పార్టీలు అభ్యర్థిని ఖరారు చేయకపోవడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే అధికారాన్ని కోల్పోయిన భారత రాష్ట్ర సమితి, తమ కంచుకోటకు బీటలు వారకూడదనే ఉద్దేశంతో అభ్యర్థి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. కాంగ్రెస్​ పార్టీ సైతం బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది.

loksabha polls 2024
Major Parties Focus on Medak MP Seat

Major Parties Focus on Medak MP Seat : ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మెదక్‌, జహీరాబాద్‌ 2 పార్లమెంట్‌ స్థానాలున్నాయి. వీటి పరిధిలో ఒక్కో పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌ నుంచి, మాజీ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట నుంచి ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గాలు మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలో ఉన్నాయి. దీంతో మెదక్‌ స్థానం బీఆర్​ఎస్​కు అత్యంత కీలకంగా పార్టీ భావిస్తోంది. తప్పనిసరిగా ఇక్కడ గెలిచే దిశగా అభ్యర్థి ఎంపిక దగ్గరి నుంచి విజయం వరకు వ్యూహాలు రచిస్తోంది ఆ పార్టీ. తొలి నాళ్లలో అనేక మంది ఆశావహుల పేర్లు వినిపించినా, ప్రస్తుతం వంటేరు ప్రతాప్‌ రెడ్డి పేరు తెరపైకి వస్తుంది.

ఉమ్మడి మెదక్‌ ఉన్న సమయంలో గజ్వేల్‌ నుంచే కేసీఆర్‌పై పలుమార్లు పోటీ చేసి ఓటమి పాలై, చివరికి బీఆర్​ఎస్​లోనే చేరారు ప్రతాప్‌రెడ్డి. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆయనకు మంచి పేరు ఉందని, గతంలో కేసీఆర్‌ ప్రతాప్‌ రెడ్డికి ఎంపీ సీటు ఇస్తానని హమీ ఇచ్చినట్లు కూడా తెలిసింది. దీంతో వంటేరు ఎన్నికలకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. మరో పక్క ప్రతిష్టాత్మకమైన సీటు కావడంతో ఆఖరి నిమిషంలో కేసీఆర్‌ బరిలో దిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

'అతికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్​ ప్రభుత్వంపై వ్యతిరేకత - కరీంనగర్​లో బీఆర్​ఎస్ ​- బీజేపీ మధ్యే పోటీ'

పోటీకి మైనంపల్లి విముఖత : ఇక మిగిలిన రెండు పార్టీల్లో బీజేపీ దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్​ రావుకు సీటు కేటాయించగా, బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్​ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. కాంగ్రెస్‌ తరఫున మైనంపల్లి హన్మంతరావు పేరు వినిపించినా, ఆయన మల్కాజిగిరి ఎమ్మెల్యే స్థానంలోనే ఓటమి పాలవడం, మళ్లీ ఎంపీ టికెట్‌ ఇస్తే ఆ ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మైనంపల్లి సైతం అంతగా ఆసక్తి చూపడం లేదని, ఏదైనా నామినేటెడ్‌ పదవి ఇస్తే చాలన్నట్లు భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రజాదరణ కలిగిన అభ్యర్థులకే ఎంపీ సీటు - ఆశావహుల బలాబలాలపై కాంగ్రెస్​ ప్రత్యేక సర్వే!

పటాన్‌చెరు నుంచి బీఎస్పీ తరఫున పోటీ చేసి ఓటమి పాలై, ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన నీలం మధు పేరు బాగా ప్రచారం జరుగుతోంది. పైగా ఉమ్మడి మెదక్‌ పరిధిలో ముదిరాజ్‌ సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఉంది. దీంతో సామాజికవర్గాన్ని ప్రభావితం చేయగలిగితే, గెలుపు తమదేనంటూ కాంగ్రెస్​ భావిస్తోంది. పైగా పార్టీ అధికారంలో ఉండటం బలం చేకూరుస్తోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ అంచనాల ప్రకారం నీలం మధుకు ఎంపీ టికెట్‌ వస్తుందని, ఇప్పటికే ఆయన ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

బీఆర్​ఎస్​ అభ్యర్థిగా గాలి! : ఇప్పటికే జహీరాబాద్‌ స్థానంలో బీజేపీ నుంచి బీబీపాటిల్‌, కాంగ్రెస్‌ నుంచి సురేశ్​ షెట్కార్‌ను ఆయా పార్టీలు బరిలో దించాయి. ఇక ఇక్కడ కూడా బీఆర్​ఎస్​కు సరైన అభ్యర్థి దొరక్కపోవడంతో ఆ వెతుకులాటలో ఉన్నట్లు సమాచారం. గాలి అనిల్‌కుమార్‌ను అక్కడ నిలబెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ గాలి మెదక్‌ టికెట్‌ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. జహీరాబాద్‌ నుంచి టికెట్‌ ఇచ్చినా, తాను గెలవలేనని అధిష్ఠానానికి చెప్పినట్లు సమాచారం. మెుత్తంగా మెదక్ ఎంపీ సీటు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఏ పార్టీ నుంచి ఎవరి పేరు వస్తుందా అని ఆయా పార్టీల కార్యకర్తలు సైతం ఎదురు చూస్తున్నారు.

జహీరాబాద్​ బీఆర్​ఎస్​ లోక్​సభ అభ్యర్థిగా గాలి అనిల్​ కుమార్​! - ఖరారు చేసిన కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.