ETV Bharat / politics

రేపు రైతుల హక్కులు, హామీల సాధన కోసం బీఆర్​ఎస్ రాష్ట్రవ్యాప్త నిరసన - KCR on Telangana State Wide Protest

author img

By ETV Bharat Telangana Team

Published : May 15, 2024, 8:54 PM IST

KCR Calls for Telangana State Wide Protest : రైతుల హక్కులు, హామీల సాధన కోసం రాష్ట్రవ్యాప్త నిరసన చేస్తామని బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలియజేసేందుకు బీఆర్ఎస్​ నాయకులకు, శ్రేణులకు పిలుపునిచ్చారు. నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు చేయాలని పేర్కొన్నారు. రైతుల హక్కులు కాపాడేందుకు తమ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.

KCR on Farmers Problems
KCR Calls for Telangana State Wide Protest (ETV Bharat)

KCR Calls for Telangana State Wide Protest : కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా, అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు తెలియజేశారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించడమేనని కేసీఆర్ ఆక్షేపించారు. ఇది రైతులను మోసం చేయడం, దగా చేయడమేనని దుయ్యబట్టారు.

KCR on Farmers Problems in Telangana : కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను మాజీ సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారని, ఈ విషయం తెలిసి కూడా ప్రభుత్వం ఎలా ప్రకటిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం ద్వారా తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోమారు వంచించిందని మండిపడ్డారు. డబ్బాలో ఓట్లు పడగానే కాంగ్రెస్​కు రైతుల అవసరం తీరిందని ఎద్దేవా చేశారు. అందుకే నాలిక మల్లేసి ఎప్పటిలాగే నయ వంచనకు పూనుకున్నారని కేసీఆర్ ఆరోపించారు. సన్నవడ్లకు మాత్రమే బోనస్ అన్న మాట ఎన్నికలకు ముందే చెప్పి ఉంటే హస్తం పార్టీని రైతులు తుక్కు తుక్కు చేసే వారని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్​ ఐదు నెలల పాలనలోనే రాష్ట్రం ఆగమాగం అయింది : కేసీఆర్​ - KCR Bus Yatra in Medak

BRS Protest Telangana State Wide : ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ఆగ్రహంతోనే ఉన్నారని కేసీఆర్​ తెలిపారు. రైతుబంధు, రైతుభరోసా ఇవ్వకుండా రైతాంగాన్ని అన్ని రకాలుగా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనడానికి నిర్లక్ష్యం వహిస్తూ కర్షకులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏడిపిస్తూ గోస పుచ్చుకుంటోందని బీఆర్ఎస్​ ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగ హక్కులను హామీలను సాధించేందుకే తమ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడతామని కేసీఆర్ స్పష్టం చేశారు.

పార్టీ కార్యకర్తలు రైతుల పక్షాన నిలబడి కొట్లాడాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర రైతాంగానికి భరోసా కల్పించే దిశగా నిరసన కార్యక్రమాలతో పాటు ప్రతిరోజూ వడ్ల కల్లాల వద్దకు పార్టీ శ్రేణులు వెళ్లాలని సూచించారు. అన్నదాతలకు అండగా నిలవాలని చెప్పారు. రైతుల హక్కులు కాపాడేందుకు వారికి అండగా నిలిచేందుకు బీఆర్​ఎస్​ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు.

ఆరు గ్యారంటీలంటూ కాంగ్రెస్‌ అరచేతిలో వైకుంఠం చూపెట్టింది : కేసీఆర్ - KCR ELECTION CAMPAIGN IN MEDAK

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.