ETV Bharat / politics

ఖమ్మం కాంగ్రెస్​ అభ్యర్థిపై వీడని ఉత్కంఠ - బెంగళూరుకు చేరిన పంచాయితీ - Khammam Congress MP Candidate Issue

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 22, 2024, 9:18 AM IST

Updated : Apr 22, 2024, 12:16 PM IST

Khammam MP Ticket 2024
Khammam MP Ticket 2024

Bhatti and Ponguleti Meet Kharge in Bengaluru : ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎంపిక రాజకీయ కాక పుట్టిస్తోంది. అత్యంత హాట్‌ సీటుగా ఉన్న ఈ స్థానం నుంచి బరిలో దిగేందుకు హేమాహేమీలు పోటీ పడుతున్నారు. తాజాగా ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు రాయల నాగేశ్వరరావు పేరును కొందరు ప్రతిపాదించినట్లు తెలిసింది. మరోవైపు తమ కుటుంబ సభ్యులకే టికెట్ కేటాయించాలని కోరుతూ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో వేర్వేరుగా మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమావేశమయ్యారు.

Khammam Congress Lok Sabha Ticket 2024 : శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి జోష్‌ మీదున్న కాంగ్రెస్‌, లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే తెలగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించింది. మరోవైపు బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తూ జనంలోకి వెళ్తోంది. ప్రజలకు ఆరు హామీలను వివరిస్తూ బీఆర్​ఎస్​, బీజేపీలపై విమర్శలు చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ 17 స్థానాలకు గాను 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, మరో మూడింటిని పెండింగ్‌లో ఉంచింది.

Lok Sabha Elections 2024 : ఈ క్రమంలోనే ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్‌కు పెనుసవాల్‌గా మారింది. తమ వారికి సీటు కోసం ముఖ్య నాయకులు ఢీ కొడుతుండటం రాజకీయ అంతర్యుద్ధానికి దారితీస్తోంది. దీంతో ఇటు రాష్ట్ర స్క్రీనింగ్‌ కమిటీ, అటు కేంద్ర ఎన్నికల కమిటీ మల్లగుల్లాలు పడుతుండటంతో వాయిదాల పర్వం సాగుతోంది. రోజుకో పేరు తెరపైకి వస్తుండటం ఆశావహులకు చెమటలు పట్టిస్తుండగా పార్టీ కార్యకర్తలకు మాత్రం నిరీక్షణ తప్పడం లేదు.

ఖమ్మం కాంగ్రెస్​ అభ్యర్థిపై తెగని పంచాయితీ - ఏకాభిప్రాయం రాకపోతే బరిలోకి ప్రియాంక గాంధీ! - Khammam Congress MP Candidate Issue

Congress Election Campaign in Telangana 2024 : ఇప్పటికే కాంగ్రెస్‌ తరఫున ఖమ్మం లోక్‌సభ స్థానానికి రఘురామిరెడ్డి, మండవ వెంకటేశ్వరరావుల పేర్లు ఇప్పటికే తెరపైకి రాగా తాజాగా ఇదే జిల్లాకు చెందిన రాయల నాగేశ్వరరావు పేరును కొందరు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌గా నియమించింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడం వల్ల రాయల నాగేశ్వరరావు ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. ఈ స్థానానికి తీవ్ర పోటీ నెలకొని పేరు ప్రకటించడంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా కొందరు ఆ పేరును తెరపైకి తెచ్చినట్లు తెలిసింది.

గతంలో రాయల నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హస్తం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. రెండు రోజులుగా ఖమ్మం అభ్యర్థిపై కాంగ్రెస్‌ ముఖ్య నేతల మధ్య తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీల నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఖరారు కోసం మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బెంగళూరుకు వెళ్లారు. అక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో వారు వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ టికెట్‌ తమ కుటుంబసభ్యులకే కేటాయించాలని ఖర్గేను కోరారు. దీంతో ఖమ్మం బరిలో ఎవరికి అవకాశం దక్కుతుందన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

ఈరోజు లేదా రేపు అభ్యర్థుల ప్రకటన : అలాగే హైదరాబాద్‌, కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ నెల 25తో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. కాబట్టి ఈరోజు లేదా మంగళవారం నాడు ఈ మూడు నియోజకవర్గాలకు హస్తం పార్టీ అభ్యర్థులను ప్రకటించవచ్చని నాయకులు భావిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి వచ్చే నెల 11 వరకు గడువు ఉంది.

Bhatti and Ponguleti Meet Kharge in Bengaluru :

అగ్రనేతలొస్తే ఓకే లేదంటే మాకే - ఖమ్మం ఎంపీ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ

ఖమ్మం గుమ్మంలో రాజకీయ కాక - లోక్‌సభ సమరానికి పార్టీల సన్నద్ధం

Last Updated :Apr 22, 2024, 12:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.