ETV Bharat / politics

'ఏప్రిల్​లో తుక్కుగూడలో కాంగ్రెస్‌ జాతీయస్థాయి సభ - అక్కడి నుంచే దేశ రాజకీయాలకు శంఖారావం' - Congress National Level Meeting

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 26, 2024, 3:15 PM IST

CM Revanth Reddy on Parliament Elections 2024 : రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడలో ఏప్రిల్ 6 లేదా 7న కాంగ్రెస్‌ జాతీయ స్థాయి సభ ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. ఆ సభకు ఖర్గే, రాహుల్ గాంధీ హాజరు కానున్నట్లు వెల్లడించారు. కర్ణాటక, తెలంగాణ విజయాల స్ఫూర్తితో జాతీయ స్థాయిలో గ్యారెంటీల ప్రకటన చేస్తామన్న సీఎం, తుక్కుగూడ నుంచే దేశ రాజకీయాలకు శంఖారావం పూరిస్తామని స్పష్టం చేశారు.

CM Revanth Reddy
CM Revanth Reddy on Parliament Elections 2024

CM Revanth Reddy on Parliament Elections 2024 : రంగారెడ్డి జిల్లా నుంచే దేశ రాజకీయాలకు ప్రచార శంఖారావాన్ని పూరించబోతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తుక్కుగూడ రాజీవ్‌ గాంధీ ప్రాంగణంలో ఏప్రిల్ 6 లేదా 7న జరిగే జన జాతర సభకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరవుతారని తెలిపారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చేవేళ్ల లోక్‌సభ అభ్యర్థి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో పాటు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల్లో 14 స్థానాలు గెలవాలనే పట్టుదలతో ఉన్నామని తెలిపారు. క్షేత్ర స్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేల ఆధారంగానే పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఎంపిక చేస్తోందని రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాలకు ఒకదానికొకటి సంబంధం ఉందన్న ఆయన, అన్ని రకాలుగా ఆలోచించే చేవెళ్లలో రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్​ బరిలో దానం నాగేందర్​ను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు, ప్రభుత్వ 100 రోజుల పరిపాలనకు రెఫరెండమన్న ఆయన, తెలంగాణలో 14 స్థానాలు గెలిచి సోనియమ్మకు కృతజ్ఞత చెబుదామని స్పష్టం చేశారు.

'14 ఎంపీ సీట్లే లక్ష్యంగా గెలిచి తీరాలి' - నేతలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం

పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వాలన్నట్లుంది : పదేళ్లు మోదీ ప్రధానిగా ఉండి రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించిన రేవంత్​ రెడ్డి, బుల్లెట్ ట్రైన్ గుజరాత్​కు తీసుకెళ్లిన మోదీ, వికారాబాద్​కు కనీసం ఎంఎంటీఎస్ రైలు తీసుకురాలేదని మండిపడ్డారు. గుజరాత్​లో సబర్మతి రివర్ ఫ్రంట్​ను అభివృద్ధి చేసుకున్న ఆయన, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి మాత్రం నిధులు ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే రీజినల్ రింగ్ రోడ్డు రాకుండా బీజేపీ ఎందుకు మోకాలడ్డుతోందని ప్రశ్నించారు. ఏం చూసి మూడోసారి మోదీకి ఓటు వేయాలని బీజేపీ నేతలు అడుగుతున్నారని నిలదీశారు. బీజేపీ నేతల వ్యవహారం పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వాలన్నట్లుందని ఎద్దేవా చేశారు.

కవిత అరెస్టుతో పెద్దడ్రామాకు తెరలేపారు : సీఎం రేవంత్​రెడ్డి

'తెలంగాణను అభివృద్ధి చేసుకునేందుకు ఇది చక్కని అవకాశం. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి. కార్యకర్తలకు అండగా నిలబడేందుకు, దేశాన్ని కాపాడుకునేందుకు రాహుల్ గాంధీ వేల కిలోమీటర్లు నడిచారు. పార్టీకి అండగా నిలబడి, సోనియమ్మ నాయకత్వాన్ని బలపరచాల్సిన బాధ్యత అందరిపై ఉంది. తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో అసెంబ్లీ ఎన్నికలకు ఆరు గ్యారంటీలను ప్రకటించుకున్నాం. మళ్లీ అక్కడే ఏప్రిల్ 6 లేదా 7న జాతీయస్థాయి గ్యారేంటీలను ప్రకటించుకోబోతున్నాం. రంగారెడ్డి జిల్లా నుంచే దేశ రాజకీయాలకు శంఖారావం పూరించబోతున్నాం. ఈ జన జాతర సభకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరవుతారు.' అని రేవంత్​ స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ ఖేల్​ ఖతమ్ - నెక్స్ట్ బీజేపీకి అదే గతి : సీఎం రేవంత్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.