ETV Bharat / politics

'సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌- క్విట్‌ జగన్‌'! 'ఓడిపోవడానికే సిద్ధం అంటున్నారు': చంద్రబాబు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 2, 2024, 5:45 PM IST

Chandrababu_Ra_kadali_Ra_Meeting
Chandrababu_Ra_kadali_Ra_Meeting

Chandrababu Raa Kadali Ra Meeting: సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ - క్విట్‌ జగన్‌ నినాదాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్‌ ఓడిపోవడానికే సిద్ధం అంటున్నారా అని ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ నిర్వహిస్తోన్న 'రా కదలిరా ' బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. బాబు నెల్లూరు జిల్లా పర్యటనలో వైసీపీ కీలక నేత వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు, సర్పంచులు టీడీపీలో చేరడం టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.

Chandrababu Raa Kadali Ra Meeting: నెల్లూరు జిల్లాలో వైసీపీ కీలక నేత వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకొన్నారు. జనానికి మరింత సేవ చేసేందుకే తెలుగుదేశంలో చేరినట్లు వేమిరెడ్డి తెలిపారు. ప్రజా సమస్యలను పార్లమెంటులో లేవనెత్తి పరిష్కరించేందుకు కృషి చేస్తానని వేమిరెడ్డి హామీ ఇచ్చారు.

ఇటీవల వైసీపీకి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (Vemireddy Prabhakar Reddy) రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రభాకర్‌రెడ్డితో పాటు నెల్లూరుకు చెందిన పలువురు కార్పొరేటర్లు, సర్పంచులు తెలుగుదేశం పార్టీలో చేరారు. నెల్లూరు పీవీఆర్‌ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి భారీగా టీడీపీ-జనసేన కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు.

వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అజాత శత్రువు అని, ప్రజా సేవకు మారుపేరు అని చంద్రబాబు కొనియాడారు. యుద్ధానికి సై అంటూ అంతా ముందుకొస్తున్నారని, వేమిరెడ్డి రాకతో సునాయాసంగా గెలవబోతున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలకు సేవే ఏకైక ఉద్దేశంతో వేమిరెడ్డి వచ్చారన్న చంద్రబాబు, నెల్లూరు కార్పొరేషన్‌ మొత్తం ఖాళీ అయిపోతోందని తెలిపారు. పార్టీలోకి వస్తున్న ప్రతిఒక్కరికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నామని, న్యాయం కోసం పోరాడిన సమర్థ నాయకుడు వేమిరెడ్డి అన్నారు.

టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు - గవర్నర్‌కు చంద్రబాబు లేఖ

రాష్ట్ర ప్రజానీకం కోసం అందరూ ఆలోచించాలి: రాజకీయాలకు గౌరవం తెచ్చే వ్యక్తులకు పార్టీలోకి స్వాగతిస్తున్నానని, ప్రశ్నించిన వారిని వేధించడమే జగన్‌ (CM YS Jagan Mohan Reddy) పని అని చంద్రబాబు మండిపడ్డారు. అహంకారంతో రాష్ట్రాన్ని జగన్‌ విధ్వంసం చేశారన్న చంద్రబాబు, రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసిన వ్యక్తిని ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. జగన్‌ విధానాలు నచ్చక తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారని, ఐదుకోట్ల రాష్ట్ర ప్రజానీకం కోసం అందరూ ఆలోచించాలని కోరారు. ప్రజాసేవకు అంకితమైన ఎవరినైనా పార్టీలోకి ఆహ్వానిస్తామని తెలిపారు.

విశాఖను దోచేసిన వ్యక్తి నెల్లూరుకు: రాబోయేది తెలుగుదేశం-జనసేన ప్రభుత్వమేనని, విశాఖను దోచేసిన వ్యక్తిని వైసీపీ నెల్లూరుకు పంపుతోందని పేర్కొన్నారు. జగన్‌ ఓడిపోవడానికే సిద్ధం అంటున్నారా అని ఎద్దేవా చేశారు. ఒకాయన బుల్లెట్‌ దిగిందా అంటుండే వారని, ఆయన్ను జగన్‌ బదిలీ చేశారని తెలిపారు. పల్నాడులో ఆయనకు కరెక్ట్‌గా బుల్లెట్‌ దిగితే ఇటు రాడని, నేరుగా చెన్నైకే వెళ్లిపోతాడని అన్నారు. ఇప్పటివరకు ఆరుగురు ఎంపీలు, పదిమంది ఎమ్మెల్యేలు వైసీపీని వదిలేశారని పేర్కొన్నారు.

కందుకూరు సీటు ఇప్పటికి మూడుసార్లు మార్చారని, కనిగిరిలో చెత్త అయితే కందుకూరులో బంగారం అవుతుందా అని ప్రశ్నించారు. జీడీ నెల్లూరులో కూడా మూడుసార్లు మార్చేశారన్న చంద్రబాబు, ఫ్లెక్సీలు మార్చినంత సులభంగా అభ్యర్థులను మార్చేస్తున్నారని అన్నారు. డ్వాక్రా సంఘాలు, అంగన్వాడీలను భయపెట్టి మీటింగ్‌లకు తరలిస్తున్నారని విమర్శించారు.

విభేదాలు పక్కనపెట్టి విజయానికి కృషి చేయండి- కష్టపడే ప్రతి ఒక్కరికీ అవకాశం: చంద్రబాబు

సమాధానం చెబుతావా జగన్‌: తెలుగుదేశం పార్టీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందన్న చంద్రబాబు, రాజకీయ రౌడీలను నిమిషంలోపే అణచివేసే శక్తి టీడీపీకి ఉందని స్పష్టం చేశారు. హు కిల్డ్‌ బాబాయ్‌ అని జగన్ సోదరి అడుగుతోందని, దానికి జవాబు చెప్పాలని అన్నారు. వివేకా హత్యకేసు ఎందుకు తేలలేదని సునీత ప్రశ్నించిందన్న చంద్రబాబు, బాబాయ్‌ హత్యపై సమాధానం చెబుతావా జగన్‌ అంటూ ప్రశ్నించారు. వివేకా హత్య కేసు దోషుల అరెస్టుకు ఎందుకు సిద్ధంగా లేరని, ధైర్యంగా మాట్లాడితే ఆమెపైనా కేసులు పెట్టి వేధిస్తారా అని మండిపడ్డారు.

టిష్యూ పేపర్‌ మాదిరిగా వాడుకుని వదిలేశారు: ఇంకో చెల్లెలు షర్మిల పరిస్థితి చూస్తూనే ఉన్నారని, ఆస్తిలో వాటా కూడా ఇవ్వకుండా మోసం చేశారని చంద్రబాబు ఆరోపించారు. అన్నపై కోపంతో తమను కూడా విమర్శిస్తోందని, అయితే ఆ విషయంతో తమకేమీ బాధ లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సమాధానం చెప్పే సమర్థత తమకుందని ఆమె గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. సొంత చెల్లెల్ని ఎన్నికల ముందు ఊరూరా పాదయాత్రగా తిప్పి, టిష్యూ పేపర్‌ మాదిరిగా వాడుకుని వదిలేశారని విమర్శించారు.

తల్లికి అవమానం కాదా: కుటుంబాల్లో తగాదాలు వస్తాయని, దానిని తాను తప్పుపట్టనన్న చంద్రబాబు, సోషల్‌ మీడియాలో ఆమె పుట్టుకపైనే నీచంగా మాట్లాడతారా అంటూ మండిపడ్డారు. సొంత చెల్లి పుట్టుకను కూడా నీచంగా చిత్రీకరిస్తే తల్లికి అవమానం కాదా అని ప్రశ్నించారు. నేర స్వభావం ఉన్న వ్యక్తులు ఎలాంటి నీచానికైనా దిగజారుతారని ధ్వజమెత్తారు.

ఉత్తరాంధ్రపై కాదు - ఇక్కడి భూములపైనే జగన్‌కు ప్రేమ: చంద్రబాబు

వైసీపీకి నిద్రపట్టట్లేదు: ఒక్క పల్నాడులోనే 30 మంది కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారన్న చంద్రబాబు, నీళ్లు అడిగిన పాపానికి మహిళను ట్రాక్టర్‌ పెట్టి తొక్కించారని మండిపడ్డారు. మాస్కు అడిగిన వ్యక్తిని సస్పెండ్‌ చేసి పిచ్చివాణ్ని చేసి వేధించారని, డ్రైవర్‌ సుబ్రమణ్యాన్ని చంపి కారులో డోర్‌ డెలివరీ చేశారని ఆరోపించారు. జనసేన-టీడీపీ పొత్తు పెట్టుకుంటే వైసీపీకి నిద్రపట్టట్లేదన్న చంద్రబాబు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పోరాడాలనుకుంటే వాళ్లకు బాధేంటో అని ప్రశ్నించారు.

కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకునే రకం వాళ్లని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారన్న చంద్రబాబు, ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చి అందర్నీ వేధించారని మండిపడ్డారు. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ - క్విట్‌ జగన్‌ నినాదాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

'సమాధానం చెప్పేందుకు సిద్ధమా? లేకుంటే సభలోనే సమాధానం చెబుతావా?' : జగన్​కు చంద్రబాబు సవాల్

'సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ - క్విట్‌ జగన్‌' - 'ఓడిపోవడానికే సిద్ధం అంటున్నారు': చంద్రబాబు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.