ETV Bharat / politics

విజయసంకల్ప యాత్రలతో రాష్ట్రాన్ని చుట్టేసేలా బీజేపీ కార్యాచరణ - బీఆర్​ఎస్​తో పొత్తు ఉండబోదని స్పష్టం

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 20, 2024, 10:33 PM IST

BJP Vijaya Sankalpa Yatra in Telangana : పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్​ఎస్​తో పొత్తు ఎట్టి పరిస్థితుల్లో ఉండబోదని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విజయ సంకల్ప యాత్రలను చేపట్టిన కమళదళం నాలుగు చోట్ల రథయాత్రలను ప్రారంభించింది. నారాయణపేట కృష్ణాలో శంఖారావం పూరించిన కిషన్‌రెడ్డి, నరేంద్ర మోదీని మూడోసారి ప్రధాన మంత్రిగా చేయడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అయిదు క్లస్టర్లలో యాత్ర చేపట్టనున్న బీజేపీ, 114 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 5వేల 500ల కిలోమీటర్లు చుట్టేయనున్నారు.

BJP MP Election Campaign in Telangana
BJP Vijaya Sankalpa Yatra in Telangana

BJP Vijaya Sankalpa Yatra in Telangana : పార్లమెంట్‌ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ సమర శంఖారావం పూరించింది. 17 లోక్‌సభ నియోజకవర్గాలను చుట్టేసేలా విజయ సంకల్ప యాత్రలను చేపట్టింది. మొత్తం ఐదు క్లస్టర్లుగా విభజించిన కమలదళం, నాలుగు క్లస్టర్లలో యాత్రలను ఇవాళ ప్రారంభించి. నారాయణపేట కృష్ణాలో కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల ప్రారంభించగా, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్‌రెడ్డి శంఖారావం పూరించారు. కుమురం భీం క్లస్టర్‌లోని బాసరలో అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, రాజరాజేశ్వర క్లస్టర్‌లోని తాండూరులో కేంద్రమంత్రి బీఎల్​ వర్మ, బండి సంజయ్‌ ఆరంభించారు.

భాగ్యలక్ష్మీ క్లస్టర్‌లో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌(Pramod Sawant)ఆరంభించారు. మేడారం జాతర నేపథ్యంలో రెండు రోజుల తర్వాత కాకతీయ భద్రకాళి క్లస్టర్‌లో యాత్రను మొదలు పెట్టనున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ నేతలు ఇక్కడి సంపదను దోచి దిల్లీకి పంపుతున్నారని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు. నారాయణపేట జిల్లా కృష్ణాలో యాత్రను ప్రారంభించిన కిషన్‌రెడ్డి కాంగ్రెస్‌, బీఆర్​ఎస్​ రెండు కుటుంబ పార్టీలేనని ధ్వజమెత్తారు. కాయా, పీయా, చల్‌దీయా అనే రీతిలో బీఆర్​ఎస్​(BRS) సర్కార్‌ పనిచేసిందని ఎద్దేవా చేశారు. పేదల సమస్యల పరిష్కారం సహా చంద్రయాన్‌ వరకు మోదీ ప్రభుత్వం ఎన్నో ఘనతలు సాధించిందని కొనియాడారు.

కేంద్రంలో అవినీతి రహిత పాలన అందిస్తున్న మోదీని, మరోసారి ప్రధానమంత్రిని చేసేందుకు దేశప్రజలంతా సిద్ధంగా ఉన్నారని కిషన్​రెడ్డి వ్యాఖ్యానించారు. అబద్ధాలు చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఒక్కటి తప్ప గ్యారంటీలు అమలు చేయట్లేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ మండిపడ్డారు. నిర్మల్ జిల్లా భైంసాలో విజయ సంకల్ప యాత్రను బిశ్వశర్మ ప్రారంభించగా ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్, రామారావు, మహేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ(MLC) లక్ష్మణ్‌ పాల్గొన్నారు. మోదీ సర్కార్‌ నిర్మించిన హైవేలపైనే రాహుల్‌గాంధీ యాత్రలు చేపడుతున్నారని విమర్శించిన హిమంత, జోడో యాత్ర తర్వాత మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఓడిపోయిందని ఎద్దేవా చేశారు.

BJP MP Election Campaign in Telangana : రాష్ట్రంలో బీజేపీకు ఓటింగ్‌ పెరిగిందని, అత్యధిక ఎంపీ(MP) సీట్లు సాధిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్టికల్‌ 370 రద్దు చేసినట్లుగానే బీజేపీ 370 సీట్లు సాధిస్తుందని బండి సంజయ్‌ వెల్లడించారు. బీఆర్​ఎస్​తో, బీజేపీ పొత్తు ఎట్టి పరిస్థితుల్లో ఉండబోదని స్పష్టం చేశారు. అయోధ్యలో రామాలయం, ట్రిపుల్‌ తలాక్‌ రద్దు సహా అనేక చరిత్రాత్మక నిర్ణయాలను బీజేపీ సర్కార్ తీసుకుందని వెల్లడించారు. బీజేపీ వెనక రాముడు, మోదీ ఉంటే, కాంగ్రెస్‌ వెనక రాహుల్‌గాంధీ, రాక్షసుడు ఉన్నారని విమర్శించారు. బీజేపీ విజయసంకల్ప యాత్రలో భాగంగా 106 సమావేశాలు, 102 రోడ్‌షోలు నిర్వహించనుంది. మార్చి 2న ముగింపు సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.

'ఇవాళ తెలంగాణలో కూడా యువతను మోసం చేసే పార్టీలే. మాటకారి పార్టీలే. ఈ రెండు పార్టీలు కూడా ప్రజలను మభ్యపెట్టే పార్టీలే. కాబట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీ రావాలి. ప్రజలు మూడోసారి మోదీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు'- కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

విజయసంకల్ప యాత్రలతో రాష్ట్రాన్ని చుట్టేసేలా బీజేపీ కార్యాచరణ - బీఆర్​ఎస్​తో పొత్తు ఉండబోదని స్పష్టం

లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు గెలవడం ఖాయం : బండి సంజయ్​

17 పార్లమెంట్‌ నియోజకవర్గాలు - 5,500 కిలోమీటర్లు - 12 రోజులు - బీజేపీ రథయాత్ర నేడే ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.