ETV Bharat / opinion

కాంగ్రెస్ చరిత్రలో ఇదే తొలిసారి- తక్కువ స్థానాల్లో పోటీ- 100 సీట్లల్లో మిత్రపక్షాలతోనే ఢీ! - Lok Sabha Elections 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 20, 2024, 12:18 PM IST

Congress Contest Lok Sabha Polls
Congress Contest Lok Sabha Polls

Congress Contest Lok Sabha Polls : దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా తక్కువ స్థానాల్లో పోటీ చేస్తుంది. 1996లో 529 స్థానాల్లో పోటీచేసిన హస్తం పార్టీ, ప్రస్తుత ఎన్నికల్లో 329కే పరిమితమైంది. దీనికి ఇండియా కూటమిలో పార్టీలు పెరగడమే. మరోవైపు ఎన్​డీఏకి నేతృత్వం వహిస్తున్న బీజేపీ మాత్రం ఎక్కడా పరస్పర పోటీ లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 446 స్థానాల్లో పోటీ చేస్తుంది.

Congress Contest Lok Sabha Polls : దేశంలో కాంగ్రెస్‌ పోటీ చేసే లోక్‌సభ స్థానాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. 1996లో 529 స్థానాల్లో పోటీచేసిన హస్తం పార్టీ, ప్రస్తుత ఎన్నికల్లో 329కే పరిమితమైంది. యూపీఏ కూటమిలో ఉన్నప్పటికీ 2019లో 421 సీట్లలో బరిలోకి దిగిన కాంగ్రెస్, ఈసారి ఇండియా కూటమిలో పార్టీలు పెరగడం వల్ల తన సీట్లను బాగా కోల్పోయిది. కూటమిలో సర్దుబాట్లు సరిగా లేక వంద స్థానాల్లో ఇండియా పార్టీలు పరస్పరం తలపడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు అధికార ఎన్​డీఏకి నేతృత్వం వహిస్తున్న బీజేపీ మాత్రం ఎక్కడా పరస్పర పోటీ లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. 446 స్థానాల్లో పోటీచేస్తున్న బీజేపీ మిత్రపక్షాలకు 97 సీట్లు మాత్రమే కేటాయించినప్పటికీ విభేదాలు లేకుండా పరిస్థితులను చక్కబెట్టుకుంది.

ఇదే మొదటి సారి
దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 329 స్థానాలకే ఆ పార్టీ పరిమితం అయ్యింది. వాటిలో ఇప్పటివరకు 282 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణలో మూడు నియోజకవర్గాలు సహా ఇతర సీట్లకు ఇంకా ప్రకటించాల్సి ఉంది. 2004 లోక్‌సభ ఎన్నికల్లో హస్తం పార్టీ 417 స్థానాల్లో పోటీ చేసింది. ఇన్నేళ్లూ అదే అత్యల్ప సంఖ్య కాగా, ఇప్పుడు అంతకంటే తక్కువ స్థానాలకు పరిమితమవుతోంది. ప్రధాని మోదీ నేతృత్వంలో బలంగా ఉన్న ఎన్​డీఏను ఎదుర్కోవడం ఒంటరిగా సాధ్యం కాదన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్‌ ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో భావసారూప్య పార్టీలతో పొత్తులు కుదుర్చుకుంది. కర్ణాటక, తెలంగాణ, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, గోవా, అరుణాచల్‌ప్రదేశ్‌, మణిపుర్‌, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, సిక్కింతోపాటు ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రమే ఆ పార్టీ పూర్తి స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగిలిన రాష్ట్రాల్లో మిత్ర పక్షాలతో సీట్లు పంచుకుంది.

తక్కువ స్థానాలకే పరిమితం
ఉత్తర్‌ప్రదేశ్‌ 80, మహారాష్ట్ర 48, బిహార్‌ 40,తమిళనాడులో 39 కలుపుకొని ఈ రాష్ట్రాల్లో మొత్తం 207 స్థానాలు ఉండగా వాటిలో కాంగ్రెస్‌ కేవలం 52 చోట్ల పోటీ చేస్తోంది. అంటే 25.12శాతం స్థానాలకే పరిమితమైంది. మిగిలినవాటిని ఇండియా కూటమి మిత్రపక్షాలైన సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌జేడీ, శివసేన-UBT, ఎన్​సీపీ పవార్‌, డీఎమ్​కేకు వదులుకుంది. 21 సీట్లున్న ఒడిశాలో ఇప్పటివరకు 17 స్థానాలకు మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మిగతా నాలుగింటిని జేఎమ్​ఎమ్​, వామపక్షాలకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. గుజరాత్‌, హరియాణాల్లో ఆప్‌తో సీట్ల సర్దుబాటు చేసుకున్న కాంగ్రెస్‌ పంజాబ్‌లో మాత్రం అదే పార్టీతో తలపడుతోంది. బంగాల్, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌లో వామపక్షాలతో పొత్తు కుదుర్చుకుంది. కానీ కేరళలో లెఫ్ట్‌ కూటమితో హోరాహోరీ తలపడుతోంది.

ఆ రాష్ట్రాల్లోనే బీజేపీకి బలమైన పోటీ
కాంగ్రెస్‌ ప్రస్తుతం కేరళ, తెలంగాణ, కర్ణాటక, హరియాణా, మహారాష్ట్ర, పంజాబ్‌ల్లో మాత్రమే బీజేపీకి బలమైన పోటీ ఇచ్చే స్థాయిలో ఉంది. యూపీ, బిహార్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌లో హస్తం పార్టీ, ఇండియా కూటమి పక్షాలు అంత గొప్ప స్థితిలో లేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోని 25 స్థానాల్లో కాంగ్రెస్‌ బలహీనంగా ఉందనే భావన వ్యక్తమవుతోంది. ఒడిశా, బంగాల్​లో పోటీ బీజేపీ, అక్కడి ప్రాంతీయ పార్టీలకు మధ్యే ఉందని స్పష్టమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఉనికి పెద్దగా లేదు. ఫలితంగా 329 సీట్లలో పోటీ చేస్తున్నప్పటికీ, కాంగ్రెస్‌ ప్రభావం కొన్ని రాష్ట్రాలకే పరిమితమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మిత్రపక్షాలపై పోటీ
ఇండియా కూటమిలో 26 పార్టీలు ఉండగా చాలా రాష్ట్రాల్లోని వందకుపైగా స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ తన మిత్రపక్షాలతోనే తలపడుతోంది. బంగాల్​లో అత్యధికంగా 41 స్థానాల్లో టీఎంసీపై కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, ఇతర మిత్రపక్షాలు స్వయంగా పోటీపడుతున్నాయి. కేరళలోని మొత్తం 20 స్థానాల్లో కాంగ్రెస్‌, లెఫ్ట్‌ఫ్రంట్‌ మధ్య పోటీ నెలకొంది. రాజస్థాన్‌, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆరేసి, మహారాష్ట్రలో ఐదు, అసోం, జమ్ముకశ్మీర్‌లో నాలుగేసి స్థానాల్లో ఇండియా కూటమి పార్టీలో పరస్పరం తలపడుతున్నాయి. ఝార్ఖండ్‌లో 3, మధ్యప్రదేశ్‌లో 2 చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. మరో ఎనిమిది రాష్ట్రాల్లో ఒక్కోచోట ఇండియా కూటమి పార్టీలు ఒకటిపై మరొకటి పోటీ చేస్తున్నాయి.

పరస్పర పోటీ లేకుండా బీజేపీ
మరోవైపు 23 పార్టీలున్న ఎన్​డీఏ కూటమి మాత్రం కలిసికట్టుగా పోటీచేస్తోంది. ఎక్కడా పరస్పర పోటీ లేకుండా జాగ్రత్త తీసుకుంది. కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ 446చోట్ల పోటీచేస్తోంది. వాటిలో ఇప్పటివరకు 434 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, మరో 12చోట్ల ఖరారు చేయాల్సి ఉంది. అత్యధికంగా యూపీలో 75స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. బంగాల్​లో, గుజరాత్, రాజస్థాన్, ఒడిశా, తెలంగాణ, ఝార్ఖండ్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌, దిల్లీ, జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని అన్ని స్థానాల్లోనూ బీజేపీ పోటీ నిలుస్తోంది. ఎన్​డీఏలో రెండో అతిపెద్ద పార్టీ అయిన తెలుగుదేశం ఏపీలో 17చోట్ల పోటీచేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. జేడీయూ 16, శివసేన సిందే వర్గం 13, పీఎమ్​కే 10, ఎల్​జేపీ రామ్‌ విలాస్‌ పార్టీ 5, ఎన్​సీపీ 5 చోట్ల పోటీ చేస్తున్నాయి. ఏపీలో జనసేన 2చోట్ల పోటీలో నిలిచింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మోదీ 3.0 టార్గెట్​గా బీజేపీ మాస్టర్​ ప్లాన్- 360 డిగ్రీలు పరిశీలించి అభ్యర్థుల ఎంపిక- 130మంది సిట్టింగులకు నో టికెట్​ - lok sabha elections 2024

ఆరు జిల్లాలో జీరో పోలింగ్- 20మంది ఎమ్మెల్యేలు సహా 4లక్షల మంది ఓటింగ్​కు దూరం- అందుకోసమేనట! - Lok Sabha Elections 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.