ETV Bharat / international

ఆర్థిక మాంద్యం పంజా- క్షీణించిన యూకే, జపాన్ ఎకానమీ- ఎన్నికల వేళ రిషికి షాక్!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 15, 2024, 7:02 PM IST

UK Japan Recession
UK Japan Recession

UK Japan Recession : ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న జపాన్‌తో పాటు బ్రిటన్‌ ఆర్థిక మాంద్యంలోకి జారుకున్నాయి. ఆ రెండు దేశాల్లో వరుసగా రెండు త్రైమాసికాల్లో జీడీపీ క్షీణించింది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మూడో స్థానంలో ఉన్న జపాన్‌- నాలుగో స్థానానికి పడిపోయింది. మరోవైపు ఎన్నికల ఏడాదిలో బ్రిటన్‌ ఆర్థిక మాంద్యంలోకి జారుకోవడం ఆ దేశ ప్రధాని రిషి సునాక్‌కు ఇబ్బందికరంగా మారింది.

UK Japan Recession : బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంది. 2023 చివరి త్రైమాసికంలో ఆర్థిక మాంద్యంలోకి వెళ్లింది. చివరి మూడు నెలల్లో యూకే జీడీపీ 0.3 శాతం క్షీణించినట్లు అక్కడి జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది. మూడు ప్రధాన రంగాలైన సేవలు, పారిశ్రామికోత్పత్తి, నిర్మాణ రంగంలో స్తబ్ధత కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. వాస్తవానికి జీడీపీ క్షీణత 0.1 శాతం ఉండొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేయగా- అంతకుమించి క్షీణించడం గమనార్హం. బ్రిటన్‌ జీడీపీ అంతకుముందు త్రైమాసికంలోనూ 0.1 శాతం క్షీణించింది. దీంతో 2023 చివరి త్రైమాసికంలో బ్రిటన్‌ మాంద్యంలోకి జారుకున్నట్లయ్యింది.

వరుసగా రెండు త్రైమాసికాల్లో జీడీపీ క్షీణిస్తే దాన్ని ఆర్థిక మాంద్యంగా పేర్కొంటారు. కొవిడ్‌ కారణంగా 2020 తొలి అర్ధభాగంలో వృద్ధి నెమ్మదించడం వల్ల బ్రిటన్‌ ఒకసారి మాంద్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత మళ్లీ ఇదే తొలిసారి. ఈ ఏడాది బ్రిటన్‌ ఎన్నికలు జరగనున్న వేళ ప్రస్తుతం అధికారంలో ఉన్న కన్జర్వేటివ్‌ పార్టీకి ఈ పరిణామం గట్టి షాక్‌. బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతామన్న హామీతో గద్దెనెక్కిన ప్రధాని రిషి సునాక్‌కు ఇది ఓ విధంగా ఇబ్బంది కలిగించే పరిణామమే. ఇప్పటికే ఒపీనియన్‌ పోల్స్‌లో ప్రధాన ప్రతిపక్షం లేబర్‌ పార్టీ అధికార పక్షం కంటే ఆధిక్యంలో ఉంది. ఎన్నికల తేదీలను రిషి సునాక్‌ నిర్ణయించాల్సి ఉంది.

అదుపులోకి ద్రవ్యోల్బణం!
బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ త్వరలోనే వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉంది. బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం నాలుగు దశాబ్దాల గరిష్ఠమైన 11 శాతానికి చేరిన నేపథ్యంలో 2022 నుంచి గతేడాది ఆగస్టు వరకు వివిధ సందర్భాల్లో కీలక వడ్డీ రేట్లను బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ సున్నా నుంచి 5.25 శాతానికి చేర్చింది. ప్రస్తుతం యూకేలో ద్రవ్యోల్బణం 4 శాతంగా ఉంది. ఇది బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ నిర్దేశించుకున్న 2 శాతం లక్ష్యానికి చేరువైతే వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. దీంతో వృద్ధికి ఊతం లభిస్తుంది.

Japan Recession : మరోవైపు, ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన జపాన్‌ సైతం మాంద్యంలోకి జారుకుంది. అక్టోబర్‌- డిసెంబర్‌ త్రైమాసికంలో జపాన్‌ వాస్తవిక జీడీపీ వృద్ధిలో వార్షిక ప్రాతిపదికన 0.4 శాతం క్షీణత నమోదైంది. త్రైమాసికం వారీగా చూస్తే 0.1 శాతం కుంగింది. అంతకుముందు త్రైమాసికంలోనూ 3.3 శాతం మేర జీడీపీ క్షీణించింది. దీంతో జపాన్‌ సైతం మాంద్యంలోకి వెళ్లినట్లయింది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మూడో స్థానంలో ఉన్న జపాన్‌- నాలుగో స్థానానికి పడిపోయింది. జర్మనీ మూడో స్థానానికి చేరుకుంది. గతేడాది జపాన్ జీడీపీ మొత్తం 4.2ట్రిలియన్ డాలర్లు కాగా జర్మనీ జీడీపీ మొత్తం 4.4 ట్రిలియన్ డాలర్లుగా నమోదైంది.

'రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఆయనే గెలివాలి'- బైడెన్​పై పుతిన్​ ప్రశంసలు

'యుద్ధంలో వెనక్కి తగ్గితే పుతిన్​ను చంపేస్తారు'- రష్యాకు మద్దతుగా మస్క్ వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.