ETV Bharat / international

మూడేళ్లు నవాజ్​- రెండేళ్లు భుట్టో- పాక్​లో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 13, 2024, 7:53 AM IST

pakistan election results 2024
pakistan election results 2024

Pakistan New Government : పాకిస్థాన్​ ప్రభుత్వ ఏర్పాటుకు దాదాపు రంగం సిద్ధమైంది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్​ పార్టీ పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌), బిలావల్‌ భుట్టో జర్దారీ నాయకత్వంలోని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ)లు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి.

Pakistan New Government : పాకిస్థాన్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ నేతృతంలోని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌, బిలావల్‌ భుట్టో జర్దారీ నాయకత్వంలోని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీలు సూత్రప్రాయంగా అంగీకరించాయి. ఈ మేరకు జరిగిన చర్చల్లో అధికార పంపకంపై కొన్ని కీలక ప్రతిపాదనలు ముందుకొచ్చాయని తెలుస్తోంది. తమ ఛైర్మన్‌ బిలావల్‌ భుట్టో జర్దారీకి ప్రధాని పదవి కావాలని పాకిస్థాన్ పీపుల్స్‌ పార్టీ గట్టి పట్టుబడినట్లు సమాచారం. ప్రధాని పదవిని మూడేళ్లు PML-N, రెండేళ్లు పీపీపీ పంచుకోవాలన్న ప్రతిపాదనపైనా కసరత్తు జరుగుతోందని బిలావల్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని పగ్గాలను ఏ పార్టీ ముందు స్వీకరించాలన్న విషయంపై స్పష్టత రాలేదని తెలుస్తోంది

మూడు స్థానాలను వదులుకున్న పార్టీలు
మరోవైపు పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీకు జరిగిన ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని ఆరోపిస్తూ మూడు పార్టీలు సింధ్‌ ప్రావిన్స్‌లోని మూడు స్థానాలను వదులుకుంటున్నట్లు ప్రకటించాయి. అయితే రిగ్గింగ్‌ ఆరోపణలను ఆ దేశ ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. సింధ్‌ ప్రావిన్స్‌లో తాను పోటీ చేసిన నియోజకవర్గం నుంచి పీటీఐ పార్టీ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థి గెలిచారని జమాత్‌-ఇ-ఇస్లామీ పార్టీ సీనియర్‌ నాయకుడు హఫీజ్ నయీమూర్ రెహ్మాన్‌ తెలిపారు. అనేక నియోజకవర్గాల్లో జరిగిన రిగ్గింగ్‌ను ఎత్తిచూపేందుకు తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వివరించారు. తమకు తక్కువ ఓట్లు వచ్చాయని పాకిస్థాన్‌ ఎన్నికల సంఘం వివరించిందని తెలిపారు. తమ బృందం అంచనాల ప్రకారం పీటీఐ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థి సైఫ్ భారీ ఓట్లను 31 వేల నుంచి 11 వేలకు తగ్గించారని ఆరోపించారు. అయితే పీఎస్‌-129 నియోజకవర్గం నుంచి నయీమూర్ 26 వేల 296 ఓట్ల మెజారిటీతో గెలిచారని పాక్‌ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల లెక్కింపులో అవకతవకల నేపథ్యంలో సింధ్‌ ప్రావిన్స్‌లోని రెండు స్థానాలను వదులుకుంటున్నట్లు గ్రాండ్‌ డెమోక్రాటిక్‌ అలయెన్స్‌ చీఫ్‌ షా రశీది తెలిపారు.

ఏ ప్రభుత్వంతోనైనా పనిచేస్తాం : అమెరికా
265 జాతీయ అసెంబ్లీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో పీఎంఎల్‌-ఎన్‌కు 75 స్థానాలు దక్కాయి. ఇమ్రాన్‌ సారథ్యంలోని పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ పార్టీ నుంచి స్వతంత్రులుగా పోటీచేసిన అభ్యర్థులు అత్యధికంగా 101 స్థానాలు గెలుచుకున్నారు. పీఎంఎల్‌-ఎన్‌ అధికారంలోకి రావాలంటే 54 సీట్లలో విజయం సాధించిన పీపీపీ మద్దతు తప్పనిసరి మారింది. పీపీపీ, పీఎంఎల్‌-ఎన్‌, పార్టీలు కలిస్తే మొత్తం 129 సీట్లు అవుతాయి. ఆరుగురు స్వతంత్రులు కూడా ఆదివారం పార్టీలో చేరినట్లు పీఎంఎల్‌-ఎన్‌ ప్రకటించింది. 17 సీట్లు నెగ్గిన ఎంక్యూఎం-పీతోనూ చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. మరోవైపు పీఎంఎల్‌-ఎన్‌, పీపీపీ ఏర్పరిచే సంకీర్ణ ప్రభుత్వంలో తాము చేరే ప్రసక్తే లేదని ఇమ్రాన్‌ సారథ్యంలోని పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ (పీటీఐ) ఇప్పటికే స్పష్టం చేసింది. వారితో కూటమి కట్టే కంటే ప్రతిపక్షంలో కూర్చోవడానికి ఇష్టపడతామని తేల్చి చెప్పింది. మరోవైపు పాకిస్థాన్​లో నెలకొన్న పరిస్థితులపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. పాక్​లో అధికారంలోకి వచ్చే ఏ ప్రభుత్వంతోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది.

కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు భుట్టో ఓకే- దేశాన్ని రక్షించేందుకే పొత్తు అన్న నవాజ్ పార్టీ!

'మేము ఎన్నికల్లో 170 స్థానాల్లో గెలిచాం'- కోర్టులో పిటిషన్లు వేసిన ఇమ్రాన్ అభ్యర్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.