ETV Bharat / international

హంగ్ దిశగా పాక్​! ఇమ్రాన్​ అభ్యర్థుల జోరు- ఇంకా వెల్లడి కాని ఫలితాలు

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 10, 2024, 8:09 AM IST

pakistan election results
pakistan election results

Pakistan Election Results : నగదు కొరతతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో హంగ్‌ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఏకీకృత ప్రభుత్వానికి పిలుపునిచ్చారు.

Pakistan Election Results : పాకిస్థాన్​ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. దేశంలోనే రెండు ప్రధాన పార్టీలు తమదే విజయమంటూ ప్రకటించుకున్నా, ఎన్నికల సంఘం మాత్రం ఇంకా ఫలితాలు వెల్లడించలేదు. బ్యాలెట్‌ పత్రాల లెక్కింపు నెమ్మదిగా కొనసాగుతోంది. ప్రస్తుత ఫలితాల సరళి చూస్తుంటే హంగ్‌ ఏర్పడే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. జాతీయ అసెంబ్లీలో అత్యధిక సీట్లను ఇమ్రాన్‌ ఖాన్‌ సారథ్యంలోని పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీకి చెందిన స్వతంత్ర అభ్యర్థులు సొంతం చేసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. రెండో స్థానంలో మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (నవాజ్‌)- పీఎంఎల్‌(ఎన్‌) నిలిచే అవకాశం ఉంది.

నాలుగోసారి ప్రధాని పదవిని అధిష్ఠించాలనుకుంటున్న నవాజ్‌ షరీఫ్‌, బిలావల్‌ భుట్టో జర్దారీ నాయకత్వంలోని పీపీపీతో కూటమి కట్టే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. పీపీపీ అధినేత బిలావల్‌ భుట్టో లాహోర్​కు చేరుకున్నారు. ఆయన షరీఫ్​తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు ముందుకు రావాలంటూ వివిధ రాజకీయ పక్షాలకు షరీఫ్‌ పిలుపునిచ్చారు. అయితే, ఇమ్రాన్ నేతృత్వంలోని పీటీఐ పార్టీ మాత్రం తాము ఎవరితోనూ జత కట్టబోమని, సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేసింది. లండన్​ ప్లాన్​ విఫలమైందంటూ షరీఫ్​ను ఉద్దేశించి ఇమ్రాన్​ ఖాన్​ వ్యాఖ్యానించారు.

ఏకీకృత ప్రభుత్వానికి నవాజ్ షరీఫ్ పిలుపు
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో హంగ్‌ వచ్చే అవకాశాల నేపథ్యంలో ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఏకీకృత ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు తన పార్టీకి సరైన ఆధిక్యం లేకపోవడం వల్ల కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రత్యర్థి పార్టీలను కోరారు. తొలుత ఏ పార్టీతో కూటమి ఉండదని పేర్కొన్న నవాజ్, ప్రతికూల ఫలితాలు రావడం వల్ల మాట మార్చారు. పాకిస్థాన్‌లో పదే పదే ఎన్నికలు నిర్వహించలేమనీ, దేశాన్ని సంక్షోభం నుంచి బయటకు తెచ్చేందుకు అన్ని పార్టీలు కలిసి రావాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. లాహోర్‌లోని తన పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) సెంట్రల్ సెక్రటేరియట్‌లో మద్దతుదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థులతో సహా అన్ని పార్టీల ఆదేశాన్ని తమ పార్టీ గౌరవిస్తుందని చెప్పారు.

ఇమ్రాన్​ అభ్యర్థులదే హవా
తాజాగా పాక్ ఎన్నికల సంఘం మొత్తం 265 నియోజకవర్గాలకు గాను 241 స్థానాల ఫలితాలను విడుదల చేసింది. ఇందులో తోషఖానా, సైఫర్‌ సహా మరో కేసులో శిక్ష పడి జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతున్న అభ్యర్థులు విజృంభించారు. ఇప్పటి వరకు కౌంటింగ్ పూర్తయిన 226 స్థానాల్లో 97 చోట్ల జయభేరి మోగించారు. నవాజ్ షరీఫ్ పార్టీ PML-N 72, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 52, ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ 15 ఇతర పార్టీలు 8 సీట్లు గెలుచుకున్నాయి. పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉండగా, ఇందులో 266 స్థానాలకు నేరుగా ఎన్నికలు జరుగుతాయి. మిగతా 70 స్థానాలను మహిళలు, మైనారిటీలకు కేటాయిస్తారు. ఒక స్థానంలో అభ్యర్థి మరణించడం వల్ల 265 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 133 సీట్లు కావాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.