ETV Bharat / business

హెల్త్​ ఇన్సూరెన్స్​ పోర్టింగ్​ రిక్వెస్ట్​ రిజెక్ట్​ అయిందా? అసలు కారణాలు ఇవే!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 22, 2024, 8:39 AM IST

Health Insurance Porting Request Tips
Health Insurance Porting Request Tips

Health Insurance Porting Request Tips : హెల్త్​ ఇన్సూరెన్స్​ను పోర్ట్​ చేయాలనుకుంటున్నారా? పోర్టింగ్​ సమయంలో కొత్త బీమా సంస్థలు పలు కారణాలతో మీ రిక్వెస్ట్​ను రిజెక్ట్​ చేస్తున్నాయా? మరి అలా ఎందుకు జరుగుతుంది, జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Insurance Porting Request Tips : కొవిడ్​-19 తర్వాత చాలామంది తమ హెల్త్​ ఇన్సూరెన్స్​లను పోర్ట్​ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం వివిధ ఆరోగ్య బీమా సంస్థలు ఆకర్షణీయమైన ఆఫర్స్​తో పాటు వినూత్నమైన ప్రొడక్ట్స్​ను కస్టమర్స్​కు అందించటమే. అయితే ఒక హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీని పోర్ట్​ చేసేముందు సదరు పాలసీ హోల్డర్​ జాగ్రత్తలు తీసుకోవాలి. పోర్ట్​ చేయడం ద్వారా కలిగే లాభనష్టాల గురించి ముందే ఓ అంచనాకు రావాలి. వాటి ఆధారంగా బీమా బదిలీ చేయడం ద్వారా ఏమైనా అదనపు ప్రయోజనాలు పొందగలుగుతున్నామా లేదా అనే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

మీరు కొత్త ఆరోగ్య బీమా సంస్థకు మీ హెల్త్​ పాలసీని పోర్ట్​ చేసే సమయంలో కొన్నిసార్లు మీ పోర్టింగ్ అభ్యర్థన తిరస్కరణకు గురవుతుంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. మరి పాలసీ పోర్టింగ్​ రిక్వెస్ట్​ రిజెక్ట్​ కావడానికి గల ప్రధానమైన కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

హెల్త్​ ఇన్సూరెన్స్​ పోర్టింగ్​ అంటే ఏంటి?
ఒక ఆరోగ్య బీమా సంస్థ వద్ద తీసుకున్న హెల్త్​ పాలసీని కాలం చెల్లకముందే అంటే గడువు తీరకముందే వేరే లేదా కొత్త ఇన్సూరెన్స్​ కంపెనీకి బదలాయించుకోవచ్చు. దీనినే హెల్త్​ ఇన్సూరెన్స్ పాలసీ పోర్టింగ్​ అంటారు. అయితే ఈ పోర్టింగ్​ సమయంలో మునుపటి పాలసీలో ఉన్న నో క్లెయిమ్​ బోనస్ ​(ఎన్​సీబీ), వెయిటింగ్​ పీరియడ్​ క్రెడిట్​, ఫ్రీ హెల్త్ చెకప్స్​ సహా మొదలైన ప్రయోజనాలు యథావిధిగా కొనసాగుతాయి.

ఎన్ని రోజుల్లోగా పోర్టింగ్​కు దరఖాస్తు ఇవ్వాలి?
ఇప్పటికే యాక్టివ్​లో ఉన్న హెల్త్​ పాలసీని పోర్ట్​ చేయాలనుకుంటే దాని రెన్యూవల్ తేదీకి​ కనీసం 45 రోజుల ముందే కొత్త బీమా సంస్థకు అప్లికేషన్​ ఇవ్వాలి. మునుపటి పాలసీ ప్రీమియంలను మీరు ఎటువంటి విరామం లేకుండా కట్టినట్లయితే, దాని ద్వారా మీరు పొందిన ప్రయోజనాలను కొత్త బీమా సంస్థకు తెలియజేయండి. ఒకవేళ పాలసీ ప్రీమియంను చెల్లించాల్సిన తేదీకి లేదా అంతకుముందు లేదా గడువు దాటాక 30 రోజుల్లోగా చెల్లించకపోతే, దానిని బ్రేక్​ ఇన్​ పాలసీగా పరిగణిస్తారు. ఇది మీ పాలసీ పోర్టింగ్​కు ఇబ్బందిగా మారవచ్చు.

ఈ కారణాలతో తిరస్కరించవచ్చు!

  1. కొన్ని ఆరోగ్య బీమా సంస్థలు పోర్టింగ్​ పాలసీలకు వయో పరిమితి షరతులను విధిస్తుంటాయి. ఈ క్రమంలో ఆయా ఇన్సూరెన్స్​ కంపెనీలు నిర్దేశించిన వయో పరిమితికి మించి మీ వయసు ఉంటే కూడా మీ బీమా పోర్టింగ్​ అభ్యర్థనను తిరస్కరించవచ్చు.
  2. పాలసీ పోర్టింగ్​కు ముందు ఉన్న వాస్తవ పరిస్థితులను కొత్త బీమా సంస్థకు చెప్పకపోతే మీ పోర్టింగ్​ అభ్యర్థనను తిరస్కరిస్తారు.
  3. మీ ప్రస్తుత బీమా సంస్థ నిర్దేశించిన ఏ నిబంధననైనా పాటించకపోయినా లేదా షరతులకు లోబడి లేకున్నా కూడా మీ పోర్టింగ్​ రిక్వెస్ట్​ను కొత్త బీమా సంస్థ రిజెక్ట్​ చేసే అవకాశం ఉంటుంది.
  4. పాలసీదారుకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాటి గురించి వివరించకపోవడం లాంటి అంశం కూడా మీ పాలసీ పోర్ట్​ రిక్వెస్ట్​ నిరాకరణకు కారణం కావచ్చు. ఈ సమయంలో గతంలో అనేకమార్లు క్లెయిమ్​ చేసిన పాలసీ వివరాలను దాచి ఉంచడం లేదా పాలసీ కొనుగోలు సమయంలో ఏదైనా తప్పుడు సమాచారం ఇచ్చినా మీ పాలసీ పోర్టింగ్​ రిక్వెస్ట్​ను కొత్త బీమా సంస్థలు రిజెక్ట్​ చేయవచ్చు.
  5. పాత బీమా సంస్థ నుంచి పొందిన పాలసీ మినహాయింపులు, అక్కడ చెల్లించని ప్రీమియంలు సహా ఇతర కీలక వివరాలు తెలియజేయకపోయినా మీ పాలసీ పోర్ట్ అభ్యర్థన తిరస్కరణకు గురికావచ్చు.
  6. మీరు పోర్ట్​ చేయాలనుకుంటున్న కరెంట్​ పాలసీ గడువు ముగిసినా మీ పాలసీ పోర్ట్​ ప్రతిపాదనను కొత్త బీమా సంస్థ నిరాకరించవచ్చు.

పాలసీ పోర్ట్ చేసేముందు ఈ విషయాలను తనిఖీ చేయండి!

  • మీకు భవిష్యత్తులో ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వాటికి అనుగుణంగా చికిత్స ఇచ్చే ఆస్పత్రులు మీ కొత్త ఇన్షూరర్ ​(బీమా సంస్థ)తో లింక్​ అయి ఉన్నాయా లేవా అనే విషయాలను ముందే తెలుసుకునే ప్రయత్నం చేయండి.​
  • కొత్త బీమా సంస్థకు చెందిన పాలసీ రెన్యూవల్​ ప్రక్రియను పాలసీదారు ముందే పరిశీలించాలి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రీమియంలు చెల్లించే విధంగా కంపెనీ విధివిధానాలు ఉన్నాయా లేవా అనే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. తద్వారా పాలసీ రెన్యూవల్​ సమయంలో సమస్యలు రాకుండా నివారించవచ్చు.

పోర్టింగ్​ చేయడానికి ముందు ఇవీ గుర్తుంచుకోండి!

  • ఒక్కో బీమా సంస్థ ఒక్కో ప్రీమియం రేట్లను కలిగి ఉంటాయి. అందుకని ప్రస్తుత ఇన్సూరెన్స్​ కంపెనీ, నూతన బీమా సంస్థలు అందించే ప్రీమియం రేట్లను బేరీజు వేయండి లేదా సరిపోల్చండి. పాత బీమా కంపెనీ కంటే మెరుగైన ప్రయోజనాలు వస్తున్నాయని నిర్ధరించుకున్నాకే పాలసీని పోర్ట్​ చేసేందుకు ముందడుగు వేయండి.
  • పలు బీమా సంస్థలు నిర్దిష్టమైన వెయిటింగ్​ పీరియడ్​లను కలిగి ఉంటాయి. అందుకోసం ప్రస్తుత బీమా సంస్థ, నూతన ఇన్సూరెన్స్​ కంపెనీలు అందించే వెయిటింగ్​ పీరియడ్​లను పరిశీలించండి. పాలసీ కవరేజీ విషయంలో ఎటువంటి గ్యాప్​లు ఉండకుండా చూసుకోండి. అలా అయితేనే పాలసీని పోర్ట్ చేసేందుకు మొగ్గు చూపండి.
  • దీర్ఘకాలిక పాలసీ విషయంలో, పాలసీదారు ఆరోగ్య బీమా సంస్థ అందించే సేవలతో సంతృప్తి చెందకపోయినా, పాలసీ టర్మ్​ సమయంలో మల్టీ-ఇయర్​ పాలసీని పోర్ట్ చేయాలనుకున్నా, పాలసీ రెన్యూవల్​ సందర్భంలో ఆరోగ్య బీమా పోర్టబిలిటీ కింద చెల్లించే రుసుము లేదా ప్రీమియంను పాలసీదారు తిరిగి పొందలేడు.
  • చివరగా యాక్టివ్​గా లేదా గడువు ఉన్న పాలసీలను మాత్రమే హెల్త్​ ఇన్సూరెన్స్​ కంపెనీలు పోర్ట్​ చేసేందుకు అనుమతిస్తాయన్న విషయాన్ని మాత్రం మర్చిపోకండి.
  • అధిక క్లెయిమ్​ సెటిల్‌మెంట్​ నిష్పత్తి కలిగి ఉన్న పాలసీని మాత్రమే ఎంచుకోండి.

మీకు సేవింగ్స్ అకౌంట్ ఉందా? అయితే ఈ 8 లాభాలు గురించి తెలుసుకోండి!

రిటైర్మెంట్​ తర్వాత మనిషికి ఎంత డబ్బు అవసరం? సెబీ క్యాలుకులేటర్​తో సింపుల్​గా అంచనా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.