ETV Bharat / bharat

కేజ్రీవాల్​కు బెయిల్​పై వీడని సస్పెన్స్- అప్పటివరకు జైల్లోనే! - SC On Kejriwal Ed Arrest Case

author img

By ETV Bharat Telugu Team

Published : May 7, 2024, 12:34 PM IST

Updated : May 7, 2024, 3:26 PM IST

SC On Kejriwal Ed Arrest Case
SC On Kejriwal Ed Arrest Case (ETV BHARAT)

SC On Kejriwal Ed Arrest Case : మద్యం కేసులో అరవింద్‌ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే అధికారిక విధులకు దూరంగా ఉండేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. అయితే ఈ మధ్యంతర బెయిల్​పై ఎలాంటి ఉత్తర్వులు సుప్రీం కోర్టు జారీ చేయలేదు. మరోవైపు కేజ్రీవాల్​ జ్యుడీషియల్​ కస్టడీని మే20 వరకు పొడగిస్తూ దిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

SC On Kejriwal Ed Arrest Case : మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌పై సుప్రీం కోర్టు మంగళవారం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. ఒకవేళ బెయిల్‌ను మంజూరు చేస్తే, అధికార విధులకు దూరంగా ఉండేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. బెయిల్ పిటిషన్​పై గురువారం లేదా వచ్చే వారం విచారణ కొనసాగే అవకాశముంది. ఇదిలా ఉండగా అరవింద్​ కేజ్రీవాల్​ జ్యుడీషియల్​ కస్టడీని మే20 వరకు పొడగిస్తూ దిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇంత జాప్యం ఎందుకు?
ఈ కేసు దర్యాప్తులో తీవ్ర జాప్యం ఎందుకు జరిగిందని ఈడీని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. దిల్లీ మద్యం కేసులో తనను ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.

దిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఒకవేళ బెయిల్‌ను మంజూరు చేస్తే, అధికార విధులకు దూరంగా ఉండాలని, ఒకవేళ అధికారిక విధులను కేజ్రీవాల్ నిర్వర్తిస్తే, కేసు విచారణకు విఘాతం కలుగుతుందని సుప్రీం కోర్టు పేర్కొంది. దీనిపై స్పందించిన కేజ్రీవాల్ బెయిల్ మంజూరైతే తాను లిక్కర్ స్కాంతో ముడిపడిన ఫైళ్లకు దూరంగా ఉంటానని కోర్టుకు హామీ ఇచ్చారు. 'కేజ్రీవాల్ ఒక ప్రజాప్రతినిధి. ఆయన కూడా ఈ ఎన్నికల్లో ప్రచారం చేయాల్సి ఉంది. అందుకే మధ్యంతర బెయిల్‌ను కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌‌పై తప్పక వాదనలు వింటాం' అని సుప్రీంకోర్టు బెంచ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

'రెండేళ్ల సమయం ఎందుకు పట్టింది?'
ఈ కేసులో నిజానిజాల్ని వెలికితీయడానికి రెండేళ్ల సుదీర్ఘ సమయం ఎందుకు పట్టిందని ఈడీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సాక్షులు, నిందితులను నేరుగా ప్రశ్నలను ఎందుకు అడగలేదని కేంద్ర దర్యాప్తు సంస్థను నిలదీసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా అరెస్టుకు ముందు, తర్వాతి కేసు ఫైళ్లను సమర్పించాలని సుప్రీంకోర్టు ఈడీని ఆదేశించింది.

సుప్రీంలో ఈడీ వాదనలు ఇలా
'ఈ విషయంలో రాజకీయ నాయకుల కోసం ప్రత్యేకమైన వర్గాన్ని కోర్టు సృష్టించలేదు. అరవింద్ కేజ్రీవాల్ ఈ కేసులో అసలు అరెస్టయ్యే వారే కాదు. మేం తొమ్మిదిసార్లు సమన్లు పంపినా ఆయన స్పందించలేదు. అందుకే అరెస్టు చేశాం. ఈ కేసులో విచారణ మొదలుపెట్టిన కొత్తలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరు పెద్దగా బయటకు రాలేదని చెప్పారు. విచారణ లోతుగా జరిగే కొద్దీ ఆయన పాత్ర ఉందనే విషయం తేటతెల్లమైంది. మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మాకు సాక్ష్యాలతో మాత్రమే సంబంధం ఉంది. మా వద్ద అవి సరిపడా ఉన్నాయి' అని ఈడీ కోర్టుకు తెలిపింది.

2022 గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో గోవాలోని 7 స్టార్ హోటల్‌ 'గ్రాండ్ హయత్​'లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ బస చేశారని సుప్రీంకోర్టుకు ఈడీ తెలిపింది. దానికి సంబంధించిన బిల్లులో కొంత భాగాన్ని దిల్లీ ప్రభుత్వ సాధారణ పరిపాలనా విభాగం, ఇంకొంత భాగాన్ని ఆప్ ప్రచారానికి నిధులు సేకరించిన చన్‌ప్రీత్ సింగ్ చెల్లించారని వెల్లడించింది. ఈ కేసులో అప్రూవర్​గా మారిన వారి వాంగ్మూలాలను ఈడీ అటకెక్కించింది అంటూ కేజ్రీవాల్‌ చేసిన ఆరోపణలను వ్యతిరేకిస్తూ పలు డాక్యుమెంట్లను సుప్రీంకోర్టుకు ఈడీ సమర్పించింది.

కేజ్రీవాల్‌ను మార్చి 21న అరెస్టు చేయగా, ఆయన ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీ కింద తిహాడ్ జైలులో ఉన్నారు. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రతిస్పందన తెలపాలని ఏప్రిల్ 15న ఈడీకి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది.

విపక్షాలకు పాకిస్థాన్​పై ఎందుకా ప్రేమ? భారత సైన్యంపై ద్వేషమెందుకు?: మోదీ - lok sabha elections 2024

దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు సర్వీస్​ - జూన్ 4 నుంచి రయ్ రయ్ - ఎక్కడి నుంచో తెలుసా? - KERALA PRIVATE TRAIN SERVICE

Last Updated :May 7, 2024, 3:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.