ETV Bharat / bharat

'26రోజులుగా ఏం చేశారు?'- SBIపై సుప్రీం ఫైర్- ఎలక్టోరల్ బాండ్ల లెక్క తేల్చాలని స్పష్టం

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 11, 2024, 11:29 AM IST

Updated : Mar 11, 2024, 2:13 PM IST

SBI Electoral Bonds Supreme Court
SBI Electoral Bonds Supreme Court

SBI Electoral Bonds Supreme Court : ఎన్నికల బాండ్ల వ్యవహారంలో ఎస్‌బీఐకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. మార్చి 12న బ్యాంకు పనివేళలు ముగిసేలోగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించాలని ఎస్​బీఐను ఆదేశించింది. ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించడానికి జూన్ 30 వరకూ గడువు పొడిగించాలని ఎస్​బీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

SBI Electoral Bonds Supreme Court : ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో స్టేట్‌ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)పై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గత 26 రోజులుగా ఏం చేశారంటూ ఘాటుగా ప్రశ్నించింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించేందుకు జూన్ 30 వరకు గడువును పొడిగించాలని కోరుతూ ఎస్​బీఐ దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మార్చి 12న(మంగళవారం) బ్యాంకు పని వేళలు ముగిసేలోగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించాలని ఎస్‌బీఐని కోర్టు ఆదేశించింది. మార్చి 15 సాయంత్రం 5గంటలకల్లా ఎస్​బీఐ​ ఇచ్చిన వివరాలను బహిరంగపరచాలని ఎన్నికల సంఘాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించడానికి వీలు కల్పించే ఎన్నికల బాండ్ల పథకాన్ని ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు రద్దు చేసింది. వాటి ద్వారా పార్టీలకు అందిన సొమ్ము, ఇచ్చిన దాతల వివరాలను మార్చి 6లోగా ఎన్నికల సంఘానికి అందించాలని ఎస్‌బీఐని ధర్మాసనం ఆదేశించింది. ఆ సమాచారాన్ని మార్చి 13లోగా బహిరంగపరచాలని ఈసీకి స్పష్టం చేసింది. ఈ క్రమంలో మరింత గడువు కావాలంటూ ఎస్‌బీఐ సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.

"గత నెల ఇచ్చిన తీర్పు ప్రకారం విరాళాల వివరాలు వెల్లడించాలని మేం ఆదేశించాం. మీరు ఇలా అదనపు సమయం కోరుతూ మా దగ్గరకు రావడం చాలా తీవ్రమైన విషయం. మా తీర్పు స్పష్టంగా ఉంది. గత 26 రోజులుగా మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు. మీ దరఖాస్తులో ఆ విషయాలు ఏవీ లేవు' అని ధర్మాసనం ఎస్​బీఐని ప్రశ్నించింది. ఎస్‌బీఐ ఆ సీల్డ్ కవర్‌ను తెరిచి, ఎన్నికల సంఘానికి సమాచారం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.

హర్షం వ్యక్తం చేసిన జయా ఠాకూర్​
ఎలక్టోరల్ బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకూర్ హర్షం వ్యక్తం చేశారు.' ఎలక్టోరల్ బాండ్ల విషయంపై ఎస్​బీఐ దాఖలు చేసిన పిటిషన్​పై సుప్రీంకోర్టు తీర్పుపై నేను సంతోషిస్తున్నాను. ఈ సమస్య తీవ్రతను పరిగణనలోకి తీసుకుని కోర్టు తగిన నిర్ణయం తీసుకుంది' అని పేర్కొన్నారు.

స్వాగతించిన కాంగ్రెస్​
ఎలక్టోరల్ బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ స్వాగతించింది. ప్రస్తుత పాలకుల కుతంత్రాల నుంచి సుప్రీంకోర్టు ప్రజాస్వామాన్ని మరోసారి రక్షించిందని పేర్కొంది. 'సుప్రీంకోర్టు సర్టిఫై చేసిన ఈ మెగా అవినీతి కుంభకోణం, బీజేపీ, దాని అవినీతి కార్పొరేట్ మాస్టర్లకు మధ్య ఉన్న అపవిత్ర బంధాన్ని బట్టబయలు చేసింది' అని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు. మరోవైపు, ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీం తీర్పు నేపథ్యంలో బెంగళూరులోని ఎస్‌బీఐ బ్రాంచ్ ఎదుట యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

'సుప్రీం తీర్పును గౌరవిస్తున్నాం'
ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని బీజేపీ తెలిపింది. బీజేపీ చాలా పారదర్శకంగా నిధులు సేకరించిందని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు పూర్తిగా సహకరిస్తామని ఝార్ఖండ్ బీజేపీ నేత అరుణ్ కుమార్ బౌరీ తెలిపారు.

గోప్యత, విశ్వసనీయత కొందరికే- ఎన్నికల బాండ్లతో ఉన్న సమస్య ఇదే: సుప్రీంకోర్టు

'ఎలక్టోరల్‌ బాండ్స్‌ రాజ్యాంగ విరుద్ధం'- సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Last Updated :Mar 11, 2024, 2:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.