ETV Bharat / bharat

రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్? కాంగ్రెస్ క్యాంప్ ఆపరేషన్​- అఖిలేశ్​కు ఎమ్మెల్యేల షాక్

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 27, 2024, 9:32 AM IST

Updated : Feb 27, 2024, 9:46 AM IST

Rajya Sabha Election 2024
Rajya Sabha Election 2024

Rajya Sabha Election 2024 : దేశంలోని మూడు రాష్ట్రాల్లో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేను ముందుజాగ్రత్తగా హోటల్​కు తరలించింది. మరోవైపు, ఉత్తర్​ప్రదేశ్​లో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఏర్పాటు చేసిన విందుకు 8మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. దీంతో వారు క్రాస్ ఓటింగ్​కు పాల్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Rajya Sabha Election 2024 : దేశంలోని 15 రాజ్యసభ స్థానాలకు మంగళవారం (ఫిబ్రవరి 27న) ఎన్నికలు జరుగుతున్నాయి. కర్ణాటక, ఉత్తర్​ప్రదేశ్​, హిమాచల్‌ప్రదేశ్‌లోని 15 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో మూడు రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే కర్ణాటక, ఉత్తర్​ప్రదేశ్​లో క్రాస్‌ ఓటింగ్‌ జరగవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ముందుజాగ్రత్తగా కర్ణాటకలోని కాంగ్రెస్ తమ పార్టీ ఎమ్మెల్యేలను హోటల్​కు తరలించింది. ఉత్తర్​ప్రదేశ్​లో సమాజ్ వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్​ ఏర్పాటు చేసిన డిన్నర్​కు 8మంది ఎమ్మెల్యేలు గైర్హాజరైనట్లు సమాచారం.

నాలుగు స్థానాలు- ఐదుగురు పోటీ
కర్ణాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలకు మొత్తం ఐదుగురు పోటీలో ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్‌కు చెందిన అజయ్‌ మాకెన్‌, సయ్యద్‌ నజీర్‌ హుస్సేన్‌, జీసీ చంద్రశేఖర్‌లు పోటీలో ఉండగా బీజేపీ నుంచి నారాయణ్‌ భాండగే, జేడీఎస్‌కు చెందిన కుపేంద్ర రెడ్డి బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో క్రాస్‌ ఓటింగ్‌ జరగవచ్చనే వార్తలు రావడం వల్ల అన్ని పార్టీలు తమ ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేశాయి. ముందు జాగ్రత్తగా కాంగ్రెస్‌ తన ఎమ్మెల్యేలను బెంగళూరులోని ఓ హోటల్‌కు తరలించింది. సోమవారం రాత్రి అక్కడే శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించింది.

హోటల్​లో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు స్పెషల్ క్లాస్!
రాజ్యసభ ఎన్నికల ఓటింగ్‌పై ఎమ్మెల్యేలతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడారు. ఓటు చెల్లకుండా ఉండేందుకు జాగ్రత్త పడాలని సూచించారు. అనేక మంది కొత్త ఎమ్మెల్యేలు ఉండడం వల్ల రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ, ఓటింగ్ పద్ధతి గురించి వివరించారు. అయితే తమ వైపు నుంచి క్లాస్ ఓటింగ్ జరగదని డీకే శివకుమార్​ తెలిపారు. హోటల్ నుంచి నేరుగా విధాన సౌధకు ఎమ్మెల్యేలు ఓటు వేయనున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్ ఆందోళన అందుకే!
కాంగ్రెస్‌కు 134 మంది ఎమ్మెల్యేలు, బీజేపీ, జేడీఎస్‌కు మొత్తం 85 (66- 19) మంది ఎమ్మెల్యేల బలం ఉంది. మరో నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో తమకు ముగ్గురి మద్దతుందని కాంగ్రెస్‌ చెబుతోంది. అయితే, బీజేపీ-జేడీఎస్‌ కూటమికి ఒక స్థానంలో గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ రెండో అభ్యర్థిని బరిలో నిలపడం వల్ల పోటీపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ నుంచి నారాయణ్‌ గెలుపు ఖాయమే అయినప్పటికీ బీజేపీ కూటమి తరఫున బరిలో ఉన్న జేడీఎస్‌ అభ్యర్థి కుపేంద్ర రెడ్డి గెలవాలంటే మరో ఐదు ఓట్లు అవసరం. దీంతో క్రాస్‌ ఓటింగ్‌ జరిగే ప్రమాదం ఉందని కాంగ్రెస్‌ ఆందోళన చెందుతోంది.

యూపీలో పరిస్థితి ఇలా!
మరోవైపు, ఉత్తర్​ప్రదేశ్​లో 10 స్థానాలకు గాను బీజేపీ ఎనిమిది మందిని, సమాజ్‌వాదీ పార్టీ ముగ్గురిని బరిలోకి దింపింది. శాసనసభలో లెక్కల ప్రకారం బీజేపీ 7 సీట్లు, ఎస్పీ 3 సీట్లు గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ పలువురు ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓట్లు వేయవచ్చని వార్తలు వస్తున్నాయి. సోమవారం రాత్రి ఎస్పీ చీఫ్ అఖిలేశ్​ యాదవ్ ఏర్పాటు చేసిన విందుకు 8 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. దీంతో వారంతా క్రాస్ ఓటింగ్ చేయవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

'బీజేపీ ఒత్తిడి తెస్తోంది'
రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలపై భారతీయ జనతా పార్టీ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడేలా ఒత్తిడి తెస్తోందని ఎస్పీ అధినేత అఖిలేశ్​ యాదవ్ ఆరోపించారు. "సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు గెలుస్తారని మేం ఆశిస్తున్నాం. కానీ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ అన్ని వ్యూహాలను ప్రయోగిస్తోంది. విజయం కోసం ఆ పార్టీ ఏమైనా చేస్తోంది. వ్యక్తిగత ప్రయోజనాలను కోరుకునే కొందరు ఎస్పీ నాయకులు బీజేపీలోకి వెళ్లవచ్చు" అని తెలిపారు. నటి జయా బచ్చన్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అలోక్‌ రంజన్‌, రామ్‌జీ లాల్‌ సుమన్‌ను ఎస్పీ రంగంలోకి దించింది.

'8 స్థానాలు మావే!'
అయితే రాజ్యసభ ఎన్నికల్లో మొత్తం తమ పార్టీ ఎనిమిది అభ్యర్థులు గెలుస్తారన్న నమ్మకంతో బీజేపీ ఉంది. నిషాద్ పార్టీ, సుహెల్ దేవ్ సమాజ్ పార్టీ, అప్నా దళ్, రాష్ట్రీయ లోక్ దళ్, జనసత్తా దళ్ మద్దతు తమకు ఉన్నాయని ఉత్తర్​ప్రదేశ్​ బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌధరీ తెలిపారు. మొత్తం ఎనిమిది మంది ఎన్​డీఏ అభ్యర్థులు గెలుస్తారని చెప్పారు. సంఖ్యాబలం లేకపోయినా మూడో అభ్యర్థిని అఖిలేశ్​ యాదవ్‌ బరిలో దించారని డిప్యూటీ సీఎం కేపీ మౌర్య ఆరోపించారు.

హిమాచల్​లో గట్టి పోటీ!
హిమాచల్ ప్రదేశ్‌లోని ఎన్నికలు జరుగుతున్న ఒకే ఒక్క రాజ్యసభ స్థానానికి గట్టి పోటీ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ బరిలో దిగగా, తమ పార్టీలో చేరిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే హర్ష్ మహాజన్‌ను పోటీలో నిలబెట్టింది బీజేపీ. అయితే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్పడుతోందని రాష్ట్ర మంత్రి హర్షవర్ధన్ చౌహాన్ ఆరోపించారు. సంఖ్యాబలం లేకున్నా బీజేపీ తమ అభ్యర్థిని బరిలోకి దింపిందని తెలిపారు. తమకు 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు.

రాజ్యసభకు సోనియా గాంధీ ఏకగ్రీవ ఎన్నిక- తొలిసారి పెద్దల సభకు

రాజ్యసభకు 55మంది వీడ్కోలు- మన్మోహన్, నడ్డా సహా 9మంది కేంద్రమంత్రులు

Last Updated :Feb 27, 2024, 9:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.