ETV Bharat / bharat

2024 లోక్​సభ ఎన్నికల తేదీలు ఫిక్స్! మార్చి 9 తర్వాత షెడ్యూల్!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 20, 2024, 11:27 AM IST

Updated : Feb 20, 2024, 11:57 AM IST

Loksabha Election Schedule 2024 : మరికొద్ది రోజుల్లో 2024 సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగనుంది. మార్చి రెండో వారంలో ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Loksabha Election Schedule 2024
Loksabha Election Schedule 2024

Loksabha Election Schedule 2024 : త్వరలో జరగబోయే 2024 లోక్​సభ ఎన్నికల తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు దాదాపు పూర్తయినట్లు సమాచారం. లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్- ఈసీ గత కొన్ని రోజులుగా రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేస్తోంది. రాజకీయ పార్టీలు, స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహించిన అధికారులు షెడ్యూల్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మార్చి 9వ తేదీ తర్వాత ఈసీ పోలింగ్ తేదీలను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటితో పాటు జమ్మూకశ్మీర్‌లోనూ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ అనుకుంటోంది. దీనికోసం మార్చి 8-9 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఈ బృందం సమావేశం కానున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులు, బలగాలపై ఆ సమావేశాల్లో చర్చించనున్నారు. అనంతరం మార్చి 12-13 తేదీల్లో ఎన్నికల సంఘం బృందం జమ్మూకశ్మీర్‌లో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించనుంది. లోక్‌సభతో పాటే స్థానిక అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించే అవకాశాలపై ఒక అంచనాకు రానున్నట్లు సమాచారం. ఆ తర్వాత వచ్చే నెల రెండోవారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

మూడు దశల్లో ఎన్నికలు జరపండి : జేడీయూ
ఎన్నికల సంఘం అధికారులతో సమావేశం సందర్భంగా తాము మూడు సూచనలు చేశామని జేడీయూ నేత రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్) తెలిపారు. గతంలో మాదిరిగా ఏడు దశల్లో కాకుండా మూడు దశల్లోనే ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు వెల్లడించారు. అంతేకాకుండా బలగాల మోహరింపుపై కూడా పలు సూచనలు చేసినట్లు వెల్లడించారు.

గత లోక్‌సభ ఎన్నికలకు 2019 మార్చి 10న షెడ్యూల్‌ను ప్రకటించారు. ఏప్రిల్‌ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. మే 23న ఓట్ల లెక్కంపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా ఏప్రిల్‌-మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించేలా ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఒక్కసారి షెడ్యూల్‌ ప్రకటించగానే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుంది.

'వచ్చే 100 రోజులు అత్యంత కీలకం, ప్రతి ఓటరు వద్దకు వెళ్లాలి'- కార్యకర్తలకు మోదీ సూచన

'6 ట్రంకు పెట్టెలు తెచ్చుకోండి'- జయలలిత ఆభరణాలు తమిళనాడు ప్రభుత్వానికే!

Last Updated :Feb 20, 2024, 11:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.