ETV Bharat / bharat

'2029లో బీజేపీ ముక్త భారత్- ఆ పార్టీని ఓడించేది మేమే- అందుకే వారికి భయం'

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 1:44 PM IST

Updated : Feb 17, 2024, 2:30 PM IST

Kejriwal on BJP : దేశవ్యాప్తంగా బీజేపీకి సవాల్ విసిరే పార్టీ ఆమ్ ఆద్మీనేనని దిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. అందుకే తమను చూసి కమలం పార్టీ ఆందోళన చెందుతోందని పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినా- 2029లో మాత్రం ఆ పార్టీని తాము తప్పక ఓడిస్తామని జోస్యం చెప్పారు.

kejriwal on bjp
kejriwal on bjp

Kejriwal on BJP : 2029 లోక్​సభ ఎన్నికల్లో భారతీ జనతా పార్టీ(బీజేపీ) నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కమలం విజయం సాధించినా- ఆ తర్వాత ఎలక్షన్​లో మాత్రం బీజేపీని ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిస్తుందని జోస్యం చెప్పారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షపై చర్చ సందర్భంగా మాట్లాడిన కేజ్రీవాల్- కాషాయదళంపై విరుచుకుపడ్డారు. ఆప్​ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

"బీజేపీ సొంత భవిష్యత్​పై ఆందోళన ఉందంటే అందుకు కారణం ఆమ్ ఆద్మీనే. అందుకే ఆప్​ను విడగొట్టాలని అనుకుంటోంది. 2024 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోకపోతే 2029 కల్లా ఆప్ కచ్చితంగా దేశాన్ని బీజేపీ ముక్త భారత్​గా మారుస్తుంది. 12 ఏళ్ల క్రితమే ఆప్ ఏర్పడింది. దేశంలో ఇప్పటికే 1350 పార్టీలు ఉన్నాయి. అయినప్పటికీ బీజేపీ, కాంగ్రెస్​ల తర్వాత మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది.

ఆప్​ను, ఆప్ మంత్రులను వారు (బీజేపీ) ఏవిధంగా లక్ష్యంగా చేసుకున్నారో దేశ ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్​ను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారా అనే ప్రశ్న ప్రజలు అడుగుతున్నారు. మా పార్టీలోని నంబర్ 2, 3, 4 స్థాయి నేతలు అరెస్ట్ అయి జైలులో ఉన్నారు. త్వరలోనే నంబర్ 1 (కేజ్రీవాల్​)ను కూడా అరెస్ట్ చేస్తారని అనుకుంటున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి సవాల్ విసిరేది ఆప్ మాత్రమే కాబట్టి ఇదంతా జరుగుతోంది."
-అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ సీఎం, ఆప్ అధినేత

ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఓటింగ్ సందర్భంగా 62 మంది ఆప్ ఎమ్మెల్యేల్లో 54 మంది సభలో ఉన్నారు. తమ ఎమ్మెల్యేలెవరూ పార్టీకి దూరం కాలేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు జైలులో ఉన్నారని, కొందరు అనారోగ్యంతో ఉంటే, ఇంకొందరు వేరే ప్రాంతాల్లో ఉన్నారని తెలిపారు. బీజేపీ తమను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన విషయాన్ని సభ్యులే స్వయంగా వివరించారని చెప్పారు.

'నన్ను అరెస్ట్ చేసి ఆప్​ను అంతం చేయాలని బీజేపీ అనుకుంటోంది. మీరు నన్ను అరెస్ట్ చేయొచ్చు కానీ కేజ్రీవాల్ ఆలోచనలను ఎలా అంతం చేయగలుగుతారు? బ్యూరోక్రసీపై ఆధిపత్యం ఉంటే అభివృద్ధి పనులు ఆగుతాయని బీజేపీ అనుకుంటోంది. రామ భక్తులం అని చెప్పుకునే బీజేపీ ఆస్పత్రుల్లో పేదలకు పంచే ఔషధాలను అడ్డుకుంది. పేదలకు ఔషధాలు ఇవ్వకుండా అడ్డుకోవాలని రాముడు చెప్పాడా?' అని కేజ్రీవాల్ మండిపడ్డారు.

Last Updated :Feb 17, 2024, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.