ETV Bharat / bharat

'ఏం చేసినా భయపడం- ఇండియా కూటమి ఫుల్ స్ట్రాంగ్​- రాజ్యాంగం మారిస్తే బీజేపీ పని అంతే' - INDIA Alliance On BJP

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 21, 2024, 7:39 PM IST

Updated : Apr 21, 2024, 10:50 PM IST

INDIA Alliance Mega Rally : కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ కూటమి పోరాడుతోందని ఇండియా కూటమి నేతలు పునరుద్ఘాటించారు. ఝార్ఖండ్‌లోని రాంచీలో జరిగిన ఇండియా మెగా ర్యాలీలో పాల్గొన్న నేతలు, నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అక్రమంగా తమ నేతలను అరెస్టు చేశారని కూటమిని భయపెట్టాలని ఎవరూ ఎంత ప్రయత్నించినా, తాము భయపడమని స్పష్టం చేశారు. తమ కూటమి శక్తి బలంగా ఉందని, ప్రధాని నరేంద్ర మోదీ అయినా, బీజేపీకు చెందిన ఎవరైనా తమ కూటమిని విచ్ఛిన్నం చేయలేరన్నారు.

INDIA Alliance Mega Rally
INDIA Alliance Mega Rally

INDIA Alliance Mega Rally : బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఝార్ఖండ్‌లోని రాంచీలో మెగా ర్యాలీ నిర్వహించింది. ఉలు‌గులన్ న్యాయ్ మహార్యాలీ పేరుతో ఝార్ఖండ్ ముక్తి మోర్చా-JMM ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించారు. తమ నేతలను అక్రమంగా అరెస్టు చేశారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే ఆరోపించారు. ఝార్ఖండ్‌లో ఇండియా కూటమి బయటకు వచ్చేందుకు ఒప్పుకోనందుకే హేమంత్‌ సోరెన్‌ను అరెస్టు చేశారని మండిపడ్డారు. తమ కూటమి విచ్ఛిన్నం చేయడానికి ఎవరూ ఎంత ప్రయత్నించినా విడగొట్టలేరన్నారు.

"సార్వత్రిక ఎన్నికల్లో 500, 400 సీట్లు గెలుస్తామని బీజేపీ నేతలు చెబుతూనే ఉన్నారు. కానీ ఈసారి కూటమి 'శక్తి' ఎంత బలంగా ఉందంటే అది ప్రధాని మోదీ అయినా, బీజేపీకి చెందిన ఎవరైనా విపక్ష కూటమి శక్తిని విచ్ఛిన్నం చేయలేరు. మేం అంత బలంగా ఉన్నాం. మమ్మల్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. హేమంత్ సోరెన్‌ను జైలుకు పంపి భయపెట్టాలని చూస్తే మేం భయపడం"

- మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు

'రాజ్యాంగాన్ని మార్చే అధికారం ఎవరికీ లేదు'
కేంద్ర ప్రభుత్వ నియంతృత్వానికి వ్యతిరేకంగా విపక్షాల కూటమి పోరాడుతోందని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ భార్య సునీతా కేజ్రీవాల్‌ అన్నారు. త‌న భ‌ర్తను జైలులో అంత‌మొందించేందుకు కాషాయ పాల‌కులు కుట్ర ప‌న్నుతున్నారని ఆమె ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు త‌ప్పు చేశార‌ని తేల‌కుండానే, జైల్లో పెట్టడం నియంతృత్వాన్ని త‌ల‌పిస్తోంద‌ని సునీతా కేజ్రీవాల్ విమ‌ర్శించారు. బీజేపీ నేతలు పదే పదే రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్నారని, రాజ్యాంగాన్ని మార్చే అధికారం ఎవరికీ లేదని ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్‌ తెలిపారు.

"బీజేపీ నేతలు పదే పదే రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్నారు. ఇది బాబాసాహెబ్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ఎవరో బాబా రాసినది కాదు. బిహార్‌లో కూడా వారి (బీజేపీ) మంత్రులు రాజ్యాంగాన్ని మారుస్తామని చెబుతున్నారు. మాట్లాడేముందు ఒకసారి ఆలోచించండి. రాజ్యాంగాన్ని మార్చాలని ఆలోచిస్తే దేశ ప్రజలు మిమ్మల్ని అంతం చేస్తారు."

-తేజస్వీ యాదవ్‌, ఆర్జేడీ అగ్రనేత

'కేజ్రీవాల్‌ను చంపాలనుకుంటున్నారు'
"అరవింద్ కేజ్రీవాల్‌కు అధికార కాంక్ష లేదు. దేశానికి సేవ చేయాలనే కోరిక ఉంది. దేశాన్ని తొలిస్థానంలో నిలబెట్టాలనుకుంటున్నారు. చదువుకున్న వారు రాజకీయాల్లోకి రాకపోతే దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది. చాలా మంది రాజకీయాలు నీచమైనవని అంటున్నారు. ఇప్పుడు జైలులో కేజ్రీవాల్ ఆహారంపై కెమెరా ఉంది. ఆయనకు పంపిన ఆహారంలోని ప్రతి చిన్న పదార్థాన్ని పరిశీలిస్తున్నారు. కేజ్రీవాల్ షుగర్ వ్యాధిగ్రస్థులు. ఆయన గత 12 సంవత్సరాలుగా ప్రతిరోజూ 50 యూనిట్ల ఇన్సులిన్ తీసుకుంటున్నారు. కానీ జైలులో ఆయనకు ఇన్సులిన్ ఇవ్వడం లేదు. కేజ్రీవాల్‌ను చంపాలనుకుంటున్నారు" అని కేజ్రీవాల్ సతీమణి సునీత ఆరోపించారు.

కేజ్రీ, హేమంత్​కు కుర్చీలు
విపక్ష కూటమి రాంచీలో నిర్వహించిన బహిరంగ సభలో 28 ప్రతిపక్ష పార్టీలు పాల్గొన్నాయి. ఇక జైల్లో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ల కోసం సభా వేదికపై ప్రత్యేకంగా ఖాళీ కుర్చీలు ఉంచారు. వేదిక బయట ఈ ఇద్దరు నాయకుల భారీ కటౌట్‌లను ఏర్పాటు చేశారు. కార్యకర్తలు వీరికి మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Last Updated : Apr 21, 2024, 10:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.