ETV Bharat / bharat

MSPపై కేంద్రం కీలక ప్రతిపాదన- ప్రభుత్వ ఏజెన్సీలతో ఐదేళ్ల ఒప్పందం! రెండు రోజుల్లో రైతుల నిర్ణయం!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 19, 2024, 7:20 AM IST

Updated : Feb 19, 2024, 7:48 AM IST

Farmers Government Talks
Farmers Government Talks

Farmers Government Talks : రైతుల సంఘాల నాయకులతో జరిగిన చర్చల్లో కేంద్రమంత్రుల బృందం కీలక ప్రతిపాదనలు చేసింది. ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా రైతులు ఉత్పత్తి చేసిన మొత్తాన్ని ఎంఎస్​పీకి కొనుగోలు చేస్తామని వివరించింది. మరోవైపు, కేంద్రం ప్రతిపాదనలపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని రైతు సంఘాల ప్రతినిధులు తెలిపారు.

Farmers Government Talks : వచ్చే ఐదేళ్లపాటు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను కనీస మద్దతు ధరలకు ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేసేలా కేంద్ర మంత్రుల బృందం రైతు సంఘాల నాయకులకు ఆదివారం రాత్రి ప్రతిపాదనలు చేసింది. రైతు సంఘాల నాయకులతో సుదీర్ఘంగా కేంద్ర మంత్రుల బృందం చర్చలు జరిపిన అనంతరం మంత్రి పీయూష్ గోయల్ ఈ విషయాన్ని వెల్లడించారు.

నాలుగు గంటల పాటు!
రైతు సంఘాల నాయకులతో కేంద్రమంత్రులు పీయూష్‌ గోయల్‌, అర్జున్‌ ముండా, నిత్యానందరాయ్‌ బృందం చండీగఢ్ ఆదివారం సాయంత్రం చర్చలు జరిపింది. నాలుగు గంటలకు పైగా సాగిన సుదీర్ఘ సమావేశంలో చట్టబద్ధమైన కనీస మద్దతు ధర హామీతోపాటు రైతుల డిమాండ్లపై నాలుగో రౌండ్ చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారు.

రైతులతో సహకారం సంస్థలు డీల్!
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, నాలుగో రౌండ్ చర్చల్లో తాము వినూత్న ప్రతిపాదన చేశామని పీయూష్ గోయల్​ తెలిపారు. "NCCF, NAFED, CCI వంటి సహకార సంస్థలు వివిధ పంటలు పండించే రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. వచ్చే ఐదేళ్లపాటు వారి పంటను కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తాయి. ఈ ప్రతిపాదనను రైతు నేతల ముందు ఉంచాం" అని చెప్పారు.

'పంజాబ్​ వ్యవసాయాన్ని కాపాడుతుంది'
రైతులు ఉత్పత్తి చేసిన మొత్తాన్ని కొనుగోలు చేస్తామని, దీనికి ఎలాంటి పరిమితులు ఉండబోవని రైతులకు వివరించినట్లు పీయూష్ గోయల్ పేర్కొన్నారు. కొనుగోళ్ల కోసం ప్రత్యేక పోర్టల్‌ను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ నిర్ణయం పంజాబ్ వ్యవసాయాన్ని కాపాడుతుందని, భుగర్భ జలాలను మెరుగుపరుస్తుందని వివరించారు. రైతులతో మరోసారి సమావేశమయ్యే అవకాశం ఉందని చెప్పారు. రైతులు చేస్తున్న కొన్ని డిమాండ్లపై సమగ్ర చర్చ లేకుండా నిర్ణయం తీసుకోలేమని చెప్పారు.

'రూ.18లక్షల కోట్ల పంట కొన్నాం'
2014-2024 మధ్య నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ.18లక్షల కోట్ల విలువైన పంటలను ఎంఎస్​పీకి కొనుగోలు చేసిందని పీయూష్ గోయల్ చెప్పారు. అదే 2004-2014 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5.50 లక్షల విలువైన పంటలను మాత్రమే కొనుగోలు చేసిందని ఆరోపించారు. ఏదేమైనా ఎన్నికలు వస్తున్నాయని, కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని, రైతుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని అన్నారు.

'భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తాం'
మరోవైపు, కేంద్ర మంత్రులతో ఎంఎస్​పీ చట్టం, ఎం.ఎల్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు, రుణమాఫీ వంటి అంశాలపై చర్చించినట్లు రైతు సంఘ నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లెవాల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై నిర్ణయం తీసుకుంటామని రైతు సంఘాల ప్రతినిధులు చెప్పారు. ప్రభుత్వ ప్రతిపాదనపై మరో రెండు రోజుల్లో తమ చర్చా వేదికల్లో సమాలోచనలు జరిపి భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయిస్తామని వెల్లడించారు.

దిల్లీ చలోకు బ్రేక్​
రుణమాఫీతో పాటు ఇతర డిమాండ్లపై చర్చలు పెండింగ్​లో ఉన్నాయని రైతు సంఘ నాయకుడు సర్వన్‌సింగ్‌ పంధేర్‌ తెలిపారు. మరో రెండు రోజుల్లో అవి కూడా పరిష్కారమవుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి చలో దిల్లీ కార్యక్రమం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. తమ సమస్యలన్నింటికీ పరిష్కారం దొరక్కపోతే మళ్లీ ఫిబ్రవరి 21వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

శాంతిభద్రతలను కాపాడండి!
రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు, పంటలకు ఎంఎస్​పీ చట్టబద్ధత కోసం తాను పోరాడుతున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్​ మాన్​ తెలిపారు. కేంద్ర మంత్రులతో సమావేశంలో మొజాంబిక్, కొలంబియా నుంచి పప్పుల దిగుమతి అంశాన్ని లేవనెత్తినట్లు సీఎం చెప్పారు. ఈ దిగుమతులు రెండు బిలియన్ల డాలర్ల కంటే ఎక్కువగా ఉన్నాయని, ఈ పంటలకు ఎంఎస్​పీ ఇస్తే పప్పుధాన్యాల ఉత్పత్తిలో పంజాబ్ దేశాన్ని నడిపించగలదని చెప్పారు. నిరసనల సమయంలో శాంతిభద్రతలను కాపాడాలని రైతులకు సూచించారు.

ఆరురోజులుగా సరిహద్దుల్లోనే!
పంటలకు కనీస మద్దతు ధర, స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల అమలు, గతంలో రైతులు చేపట్టిన ఆందోళనల్లో మృతి చెందిన కర్షకుల కుటుంబాలకు సాయం అందించడం సహా ఇతర డిమాండ్లను ఆమోదించాలని కోరుతూ గత వారం రైతు సంఘాలు దిల్లీ చలోకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో ట్రాక్టర్లు, ట్రాలీతో ర్యాలీగా బయలుదేరిన రైతులను శంభు సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకున్నారు. దిల్లీ వైపు వెళ్లకుండా బారికేడ్లు, ఇనుప కంచెలు, కాంక్రీట్‌ దిమ్మెలు ఏర్పాటు చేశారు. దీంతో కేంద్రం తమ డిమాండ్లను అంగీకరించాలని, లేదంటే శాంతియుతంగా దిల్లీ వరకు ర్యాలీ చేపట్టేందుకు అనుమతించాలని కోరుతూ రైతులు ఆరు రోజులుగా సరిహద్దుల్లోనే ఉండిపోయారు.

దిల్లీకి భారీగా రైతులు- హరియాణా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత- కర్షకులపైకి టియర్​ గ్యాస్​ ప్రయోగం

'మా డిమాండ్లన్నీ పాతవే'- కేంద్రంతో చర్చలకు రైతులు సై- కర్షకులపై మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగం

Last Updated :Feb 19, 2024, 7:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.