ETV Bharat / bharat

ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించిన ఈసీ​- ధారాళంగా రూ.11,671 కోట్ల విరాళాలు- ఏ పార్టీకి ఎంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 14, 2024, 10:07 PM IST

Updated : Mar 15, 2024, 6:46 AM IST

Electoral Bonds Data EC
Electoral Bonds Data EC

Electoral Bonds Data EC : ఎన్నికల బాండ్ల డేటాను ఎన్నికల సంఘం బహిర్గతం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు SBI సమర్పించిన వివరాలను ఈసీ తన వెబ్‌సైట్‌లో పెట్టింది. డేటాను రెండు భాగాలుగా పేర్కొన్న EC, 337 పేజీల సమాచారాన్ని వెబ్‌సైట్‌లో ఉంచింది. రూ. 11 వేల 671 కోట్ల విలువైన బాండ్లను వివిధ సంస్థలు, వ్యక్తులు కొనుగోలు చేసినట్లు ఈ డేటా ద్వారా వెల్లడైంది. ఏ సంస్థ ఏ రాజకీయ పార్టీకి విరాళాలు ఇచ్చిందన్న వివరాలను ఇందులో పొందుపరచలేదు. దానికి 3 నెలల సమయం పడుతుందని ఎస్‌బీఐ వెల్లడించింది.

Electoral Bonds Data EC : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు SBI సమర్పించిన ఎన్నికల బాండ్ల సమాచారాన్ని ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో ఉంచింది. ఇందులో మొత్తం విరాళాలు రూ. 11 వేల 671 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేయగా బీజేపీకి రూ. 6 వేల 61 కోట్లు, తృణమూల్‌కు రూ. 16 వందల 10 కోట్లు, కాంగ్రెస్‌కు రూ. 14 వందల 22 కోట్లు వచ్చాయి. బాండ్లను కొనుగోలు చేసిన కంపెనీల్లో స్టీల్‌ టైకూన్‌ లక్ష్మీ మిత్తల్‌ నుంచి బిలియనీర్‌ సునీల్‌ భారతీ మిత్తల్, అనిల్‌ అగర్వాల్, ఐటీసీ, మహీంద్ర అండ్‌ మహీంద్ర, కాంట్రాక్టు సంస్థ మేఘా ఇంజినీరింగ్, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్, అంతగా పేరులేని ఫ్యూచర్‌ గేమింగ్‌ అండ్‌ హోటల్‌ సర్వీసెస్‌ కంపెనీలున్నాయి.

టాప్​లో గేమింగ్​ సంస్థ
అయితే, చాలా పార్టీలకు ఆయా పార్టీల పేరుపై ఎన్నికల బాండ్ల విరాళాలు రాగా కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలకు మాత్రం అధ్యక్షుల పేర్లపై వచ్చాయి. 2022 మార్చి నుంచి ఈడీ దర్యాప్తు జరుపుతున్న ఫ్యూచర్‌ గేమింగ్‌ కంపెనీ అత్యధికంగా రూ.13 వందల 68 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసింది. ముంబయికి చెందిన క్విక్‌ సప్లై చైన్‌ సంస్థ రూ.410 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. వేదాంత సంస్థ రూ.400 కోట్ల బాండ్లను కొనుగోలు చేయగా, హల్దియా ఎనర్జీ సంస్థ రూ.377 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. గాజియాబాద్‌ కేంద్రంగా పనిచేసే యశోద సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ రూ.162 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది.

లక్ష్మీ మిత్తల్‌ తన సొంత డబ్బు రూ.35 కోట్లతో బాండ్లు కొనగా, ఆయన కంపెనీలు మరో 247 కోట్ల విలువైన బాండ్లను కొన్నాయి. కిరణ్‌ మజుందార్‌ షా, వరుణ్‌ గుప్తా, బీకే గోయెంకా, జైనేంద్ర షా, మోనికా వ్యక్తిగతంగా బాండ్లు కొన్నారు. రూ. 10లక్షల విలువైన బాండ్లను 4,620 మంది రూ.లక్ష విలువైన బాండ్లను 2,228 మంది కొనుగోలు చేశారు. స్పైస్‌ జెట్, ఇండిగో, గ్రాసిం ఇండస్ట్రీస్, మేఘా ఇంజినీరింగ్, పిరమిల్‌ ఎంటర్‌ప్రైజెస్, టొరెంట్‌ పవర్, భారతీ ఎయిర్‌టెల్, డీఎల్‌ఎఫ్‌ కమర్షియల్‌ డెవలపర్స్, జిందాల్‌ గ్రూప్, సియట్‌ టైర్స్, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్ సహా చాలా కంపెనీలు బాండ్లు కొనుగోలు చేశాయి.

బీజేపీ, కాంగ్రెస్, ఏఐఏడీఎంకే, భారాస, శివసేన, తెలుగుదేశం, వైకాపా, డీఎంకే, జనసేన సహా చాలా పార్టీలకు పార్టీలకు బాండ్లు వచ్చాయి. 22,217 బాండ్లను కంపెనీలు కొనుగోలు చేసినట్లు SBI తెలిపింది. వీటిని 2019 ఏప్రిల్‌ 1, 2024 ఫిబ్రవరి 15వ తేదీ మధ్య కంపెనీలు కొనుగోలు చేశాయి. ఇందులో 22 వేల 30 బాండ్లను పార్టీలు నగదుగా మార్చుకున్నాయి. బీజేపీకి 6,566 కోట్ల విలువైన బాండ్లు, కాంగ్రెస్‌కు 11 వందల 23 కోట్ల విలువైన బాండ్లు, తృణమూల్‌కు వెయ్యి 92 కోట్ల బాండ్లు దక్కాయి.

వైకాపాకే అధికం
తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందిన మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సంస్థ రాజకీయ పార్టీలకు రూ.966 కోట్ల విరాళం ఇచ్చింది. 2019 ఏప్రిల్‌ 12 నుంచి ఇప్పటివరకు ఆ సంస్థ కోటి రూపాయల విలువైన 966 బాండ్లను కొనుగోలు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితా ద్వారా వెల్లడైంది. షిర్డీసాయి ఎలక్ట్ట్రికల్స్‌ లిమిటెడ్‌ ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఒక్క రోజే కోటి విలువైన 40 బాండ్లను కొనుగోలు చేసి 40 కోట్ల విరాళం ఇచ్చింది. ఎన్నికల బాండ్ల రూపంలో ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక విరాళాలు అందిన పార్టీల్లో వైకాపా అగ్రస్థానంలో ఉంది. ఆ పార్టీకి ఇప్పటిదాకా రూ.337 కోట్లు అందగా, తెలుగుదేశానికి 219 కోట్లు, జనసేనకు రూ.21 కోట్లు వచ్చాయి. తెలంగాణలో భారాసకు రూ.12 వందల 15 కోట్ల విరాళాలు అందాయి. మరోవైపు ఎన్నికల బాండ్లపై శుక్రవారం ఎన్నికల సంఘం దరఖాస్తుపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.

Last Updated :Mar 15, 2024, 6:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.