ETV Bharat / bharat

పార్లమెంట్​ ముట్టడికి రైతుల పిలుపు​- దిల్లీ సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్​ జామ్​

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 8, 2024, 7:30 PM IST

Updated : Feb 8, 2024, 11:02 PM IST

Delhi Traffic Jam Today
Delhi Traffic Jam Today

Delhi Traffic Jam Today : దిల్లీ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్​ జామ్​లు ఏర్పడ్డాయి. నోయిడా, గ్రేటర్ నోయిడా రైతులు పార్లమెంట్​ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో, పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. దీంతో దిల్లీ-నోయిడా సరిహద్దు సహా డీఎన్​డీ, చిల్లా, ఘాజీపుర్ సరిహద్దుల్లో రోడ్లపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

Delhi Traffic Jam Today : నోయిడా, గ్రేటర్‌ నోయిడా రైతులు పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో దిల్లీ పోలీసులు అప్రమత్తమై రాజధానిలోకి ప్రవేశించే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. దీంతో దిల్లీ-నోయిడా సరిహద్దులో గురువారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీని కారణంగా వేలాది వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్​లో అవస్థలు పడుతున్నారు. డీఎన్​డీ, చిల్లా, ఘాజీపుర్ సరిహద్దుల వద్ద కూడా రోడ్లపై భారీగా వాహనాలు నిలిచిపోయినట్లు అయినట్లు దిల్లీ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. దీంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.

మరోవైపు, ఊహించని పరిణామాలు ఎదురైతే ఎదుర్కొనేందుకు వీలుగా అల్లర్ల నియంత్రణ వాహనాలను, జల ఫిరంగులను పోలీసులు సిద్ధం చేసి ఉంచారు. డ్రోన్‌ కెమెరాలతో నిఘా ఏర్పాటుచేశారు. రైతులు గుమిగూడకుండా అడ్డుకుంటున్నారు.

రైతుల నిరసనకు కారణమిదే
ప్లాట్లుగా అభివృద్ధి చేస్తామని నమ్మించి తమ భూమిని ప్రభుత్వాలు దోచుకున్నాయని, తగినంత పరిహారం చెల్లించలేదని నోయిడా, గ్రేటర్‌ నోయిడా ప్రాంత రైతులు కొంత కాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పుడు పార్లమెంట్‌ ముట్టడికి బయల్దేరగా దిల్లీలోకి ప్రవేశించకముందే పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఆందోళనల ముసుగులో కొన్ని సంఘ విద్రోహశక్తులు హింసకు పాల్పడే అవకాశం ఉందని, రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని, వెంటనే అక్కడినుంచి వెళ్లిపోవాలని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

పంజాబ్​ రైతులతో కేంద్ర మంత్రులు భేటీ
మరోవైపు దిల్లీకి ట్రాక్టర్‌ మార్చ్‌ నిర్వహించాలని నిర్ణయించిన హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాలకు చెందిన రైతులతో మంగళవారం ముగ్గురు కేంద్ర మంత్రులు భేటీ అయ్యారు. అందులో కేంద్ర మంత్రులు పీయుష్​ గోయల్, అర్జున్ ముండా, నిత్యానంద రాయ్​తో రైతు సంఘాల ప్రతినిధులు సమావేశమై తమ డిమాండ్లు వినిపించారు.

"గవర్నమెంట్ మేము ఈ రోజు సమావేశమయ్యాం. ఇది సానుకూల వాతావరణంలోనే జరిగింది. పంజాబ్ ప్రభుత్వం ఈ విషయంపై చొరవ తీసుకుంది. మేము మా డిమాండ్లన్నింటినీ వివరంగా, వాస్తవాలతో వారికి అందించాము. ప్రభుత్వం మా డిమాండ్లను సానుకూలంగా విన్నది. మేము వారికి ఇచ్చిన వాస్తవాలన్నింటినీ క్షుణ్నంగా పరిశీలిస్తామని చెప్పారు. ఫిబ్రవరి 13న మా నిరసన యథాతథంగా కొనసాగుతుంది. త్వరలో మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది. 13వ తేదీలోపు సమావేశం ఏర్పాటు చేసి మా సమస్యలను పరిష్కరిస్తే బాగుంటుంది. లేకుంటే 13వ తేదీ మా ఆందోళన యధాతథంగా కొనసాగుతుంది."
--జగ్జీత్​ సింగ్ జింద్వాల, రైతు ప్రతినిధి

అంతకుముందు కనీస మద్దతు ధరపై చట్టం తీసుకురావాలని, రైతులకు పింఛను, పంటబీమా, 2020 ఆందోళనల్లో రైతులపై పెట్టిన కేసులు కొట్టివేయాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంట్‌ వరకు ర్యాలీ చేపట్టడానికి రైతులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మునుపటి పరిస్థితులు పునరావృతం కాకుండా హరియాణా, పంజాబ్‌ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. గత ఆందోళనల్లో క్రియాశీలంగా పని చేసినవారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి రాజధానిలోకి రైతులు ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారు. అంతర్‌ రాష్ట్ర సరిహద్దుల్లో ఇసుకబస్తాలతో గోడలు, సిమెంట్‌ బారికేడ్లు ఏర్పాటుచేశారు. ఆందోళనలో పాల్గొనేందుకు దిల్లీ వెళ్లాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

Last Updated :Feb 8, 2024, 11:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.