ETV Bharat / bharat

50% పరిమితి దాటి రిజర్వేషన్లు, పేద మహిళలకు ఏడాదికి రూ.లక్ష- కాంగ్రెస్​ మేనిఫెస్టో విడుదల - Congress released its manifesto

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 5, 2024, 12:07 PM IST

Updated : Apr 5, 2024, 1:21 PM IST

Congress Lok Sabha Election Manifesto
Congress Lok Sabha Election Manifesto

Congress Lok Sabha Election Manifesto : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో న్యాయ్​పత్ర పేరుతో మేనిఫెస్టో విడుదల చేసింది కాంగ్రెస్. ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, సంక్షేమం సూత్రాలపై ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలిపింది.

Congress Lok Sabha Election Manifesto : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ మేనిఫెస్టోను విడుదల చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ తదితరులు న్యాయ్‌పత్ర పేరుతో దిల్లీలో మేనిఫెస్టోను శుక్రవారం ప్రకటించారు. ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, సంక్షేమ సూత్రాలపై దీనిని రూపొందించినట్లు మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ చిదంబరం వివరించారు. గత పదేళ్లుగా ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదని, అన్నిరంగాల్లో విధ్వంసం జరిగిందని ఆయన అన్నారు. అధికారంలోకి రాగానే పేదల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్​ ఎన్నికల హామీలు ఇవే :

50శాతం రిజర్వేషన్ పరిమితి​ పెంపు

  • దేశవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, కుల గణన నిర్వహణ
  • ఎస్​సీ, ఎస్​టీ, ఓబీసీలకు 50శాతం ఇస్తున్న రిజర్వేషన్​ పరిమితి​ పెంచడం కోసం రాజ్యాంగ సవరణ
  • ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో పది శాతం EWS కోటా అన్ని కులాలు, వర్గాలకు వివక్ష లేకుండా అందగజేత
  • ప్రజలందరి ఆరోగ్య సంరక్షణ కోసం రూ.25 లక్షల వరకు నగదు రహిత బీమా
  • పేద మహిళలకు ఏడాదికి రూ.లక్ష ఆర్థిక సాయం
  • కిసాన్‌ న్యాయ్‌ పేరుతో రైతులకు భరోసా
  • కనీస మద్దతు ధర చట్టం
  • విద్యార్థులకు రూ.లక్ష ఆర్థిక సాయం

LGBTQIA+ జంటలకు గుర్తింపు

  • వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం తరఫున సామాజిక న్యాయం కింద ఆర్థిక సాయం నెలకు రూ.200-500 నుంచి రూ.1000కి పెంపు
  • సీనియర్ సిటిజన్లకు నిర్లక్ష్యం, దుర్వినియోగం, ఒంటరిగా విడిచిపెట్టడం, ఆర్థిక మోసం వంటి సందర్భాల్లో న్యాయ సేవలను సులభంగా పొందేలా చర్యలు
  • దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను కఠినంగా అమలు
  • LGBTQIA+ వర్గానికి చెందిన జంటలను గుర్తించడానికి కొత్త చట్టం
  • బ్రెయిలీ లిపి, సంకేత భాషను భాషలుగా గుర్తింపు

రైతులకు రుణమాఫీ

  • రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ
  • ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వ్‌ చేసిన పోస్టులను ఏడాదిలో భర్తీ
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌ రెట్టింపు
  • రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ
  • ప్రతి జిల్లాలో లైబ్రరీలతో కూడిన అంబేడ్కర్‌ భవనాలు
  • వైద్యులు, వైద్యసిబ్బందిపై దాడికి పాల్పడితే కఠిన చర్యలకు చట్టం
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌
  • ఉపాధి హామీ పథకం కూలీ రోజుకు రూ.400కు పెంపు

అగ్నిపథ్​ రద్దు, జమ్ముకశ్మీర్​కు రాష్ట్రహోదా

  • రైట్‌ టు అప్రంటీస్‌ చట్టం
  • అగ్నిపథ్‌ పథకం రద్దు
  • జమ్ముకశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా పునరుద్ధరణ
  • ప్రభుత్వ ఉద్యోగాల పరీక్ష ఫీజుల రద్దు
  • మార్చి 15 నాటికి ఉన్న విద్యా రుణాల మొత్తం రద్దు. ఆ సొమ్మును ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించేలా చర్యలు.
  • మైనార్టీలకు వస్త్రధారణ, ఆహారం, భాష, పర్సనల్‌ లాను ఎంచుకొనే హక్కు
  • తప్పుడు వార్తల నియంత్రణకు 1978 నాటి ప్రెస్‌ కౌన్సిల్‌ ఇండియా చట్టానికి సవరణ

ధనవంతుల కోసమే మోదీ ప్రభుత్వం : ఖర్గే
మేనిఫెస్టో విడుదల సందర్భంగా మాట్లాడిన మల్లికార్జున ఖర్గే బీజేపీపై విరుచుకుపడ్డారు. మోదీ ప్రభుత్వం కేవలం ధనవంతుల కోసమే పనిచేసిందని ఆరోపించారు. మోదీ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ గతంలో అభివృద్ధి చేసిందని గుర్తుచేశారు. మళ్లీ అధికారంలోకి రాగానే అభివృద్ధి కొనసాగిస్తామని ఖర్గే హామీ ఇచ్చారు.

"మా మేనిఫెస్టోను పేద ప్రజలకు అంకితం ఇస్తున్నాం. దేశ రాజకీయ చరిత్రలో న్యాయ పత్రాలుగా దీనిని ప్రజలు గుర్తుంచుకుంటారు. రాహుల్‌ గాంధీ చేపట్టిన 'భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర'లో అందిస్తామన్న ఐదు న్యాయాలు, 25 గ్యారంటీలు దీనిలో ఉన్నాయి. మోదీ హయాంలో ఒక్కటైనా పెద్ద ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇచ్చారా? కేవలం తిట్లు తప్పితే ఆయన పాలనలో మరేమీ మేం వినలేదు. ప్రతిపక్ష నాయకులను జైళ్లలో పెడుతున్నారు. ఎన్నికల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించడంలేదు. మా పార్టీపై రూ.3,500 కోట్ల ఫైన్ విధించారు. నేడు మాపై జరిగినవి రేపు మీడియాపై కూడా జరగవచ్చు. దేశ ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు ప్రజలు ఏకమై పోరాడి మోదీని గద్దె దించాలి. కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి పార్టీ హామీలును వారికి చెప్పాలి. అవినీతిపరులను పార్టీలో చేర్చుకొని బీజేపీ మమ్మల్ని నిందిస్తోంది. ప్రధాని ఇప్పటి వరకు భయపడి మణిపుర్‌ వెళ్లలేదు, మా నేత రాహుల్‌ అక్కడికి వెళ్లారు. భయపడే నాయకుడు దేశానికి మంచి చేయలేరు"
-- మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు

రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే వారితో మా పోరాటం : రాహుల్
'దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్న వారికి, వాటిని పరిరక్షించేందుకు ప్రయత్నిస్తున్న వారికి మధ్య ఈ ఎన్నికల్లో ప్రధాన పోరు నెలకొంది. ఈ పోరాటంలో గెలిచిన తర్వాత, అత్యధిక మంది ప్రజల ప్రయోజనాలను చూసుకోవడం చాలా ముఖ్యం అని మేము నమ్ముతున్నాము. భారత్​ రెండు లేదా మూడు పెద్ద వ్యాపారాల కోసం నడవదు. మెజారిటీ ప్రజల కోసం పనిచేస్తుంది. మనది గుత్తాధిపత్యం ఉండే దేశం కాదు. వ్యాపారాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండే దేశం. ఇవి ప్రాథమికంగా భిన్నమైన ఎన్నికలు.' అని రాహుల్​ గాంధీ పేర్కొన్నారు.

'ఇండియా' ప్రధాని ఖరారు అప్పుడే'
ఇది కాంగ్రెస్‌ తయారు చేసిన మేనిఫెస్టో కాదన్న రాహుల్​, రైతులు, మహిళలు, శ్రామికుల మేనిఫెస్టోగా అభివర్ణించారు. దేశంలోని అన్నివర్గాల ప్రజలతో మాట్లాడాకే మేనిఫెస్టో రూపొందించామని తెలిపారు. ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీ నిధులెలా సమకూర్చుకుందో తేటతెల్లమైందని, సీబీఐ, ఈడీని ప్రయోగించి నిధులెలా సమకూర్చుకుందో రుజువైందని ఆరోపించారు. తమ పార్టీ బ్యాంక్‌ ఖాతాను సీజ్‌ చేశారన్న రాహుల్ ​సీబీఐ, ఈడీని ప్రయోగించి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇవి 2024 ఎన్నికలు కావు అని, ప్రజాస్వామ్య పరిరక్షణకు యుద్ధం అని అన్నారు. భావసారూప్య పార్టీలతో ఎన్నికల బరిలోకి దిగామని తెలిపారు. విజయం సాధించాక భాగస్వామ్య పార్టీలన్నీ ప్రధాని ఎవరనేది నిర్ణయిస్తాయని చెప్పారు.

23 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి : చిదంబరం
తమ పార్టీ వర్కింగ్‌ కమిటీలో పూర్తిస్థాయిలో చర్చలు జరిపి ఈ మేనిఫెస్టోను తయారు చేసినట్లు పార్టీ నేత, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ పి చిదంబరం వెల్లడించారు. గత 10 సంవత్సరాలలో అన్ని రకాల న్యాయాలు ప్రజలకు అందలేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ సంస్థలను పనిచేయనీయకపోవడం, బలహీన వర్గాల అణచివేత కొనసాగుతోందన్న చిదంబరం, పార్లమెంట్‌ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారని ఆరోపణలు గుప్పించారు. గత పదేళ్లలో దేశానికి జరిగిన నష్టాన్ని పూడ్చేలా ఈ న్యాయపత్రను సిద్ధం చేసినట్లు చెప్పారు. 'వర్క్‌, వెల్త్‌, వెల్ఫేర్‌' (ఉద్యోగాలు, సంపద, సంక్షేమం)ను ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చారు. యూపీఏ-1 పాలనలో 8.5 శాతం వృద్ధి సాధించామని గుర్తు చేశారు. గత పదేళ్లలో దేశం 5.9 శాతం మాత్రమే వృద్ధి సాధించిందని చెప్పారు. యూపీఏ ప్రభుత్వం 24 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చిందని, 2024లో అధికారం చేపట్టాక మరో 23 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పిస్తామని చిదంబరం వివరించారు.

Last Updated :Apr 5, 2024, 1:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.