ETV Bharat / bharat

బంగ్లాదేశ్​లో కుమార్తె- భారత్​లో మరణించిన తండ్రి- BSF సాయంతో చివరిచూపు - BSF Helps Bangladeshi Girl

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 28, 2024, 4:47 PM IST

BSF Helps Bangladeshi Girl
BSF Helps Bangladeshi Girl

BSF Helps Bangladeshi Girl : భారత్​లో మరణించిన తండ్రి మృతదేహాన్ని బంగ్లాదేశ్​లో ఉన్న అతడి కుమార్తె, కుటుంబ సభ్యులు చూసేందుకు అవకాశం కల్పించింది బీఎస్​ఎఫ్. బంగ్లాదేశ్ అధికారులతో మాట్లాడి ఇరుదేశాల సరిహద్దు వద్ద తండ్రి మృతదేహాన్ని కుమార్తె చూసేందుకు ఏర్పాటు చేసి మానవత్వాన్ని మరోసారి చాటుకుంది.

BSF Helps Bangladeshi Girl : బంగాల్​లోని నదియా జిల్లాలో మరణించిన తండ్రి మృతదేహాన్ని చివరిసారిగా చూసేందుకు బంగ్లాదేశ్ యువతి, ఆమె బంధువులకు అవకాశం కల్పించి మానవత్వాన్ని చాటుకుంది బీఎస్​ఎఫ్(భారత సరిహద్దు దళం). తండ్రిని కడసారి చూసేందుకు యువతిని భారత్ -బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతమైన జీరో లైన్ వద్దకు అనుమతించింది.

నదియా జిల్లాలోని నలుపుర్ గ్రామానికి చెందిన బీబీ పుట్టి ఖలీ అనేక వ్యక్తి బీఎస్​ఎఫ్ 4వ బెటాలియన్ కంపెనీ కమాండర్ వద్దకు వెళ్లాడు. శనివారం రాత్రి మహబుల్ మండల్ అనే వ్యక్తి మరణించాడని, అతని కుమార్తె, బంధువులు బంగ్లాదేశ్​లోని మేదీనీపుర్​లో ఉన్నారని అధికారికి చెప్పాడు. మహబుల్ మండల్ మృతదేహాన్ని అతని కుమార్తె, కుటుంబ సభ్యులు చివరిసారిగా చూడాలనుకుంటున్నారని తెలిపాడు. మండల్ మృతదేహాన్ని చూసేందుకు వారికి అవకాశం ఇవ్వాలని బీఎస్ ఎఫ్ అధికారిని అభ్యర్థించాడు.

బంగ్లా అధికారులతో చర్చలు
ఈ నేపథ్యంలో బీఎస్​ఎఫ్ కంపెనీ కమాండర్ మానవతా కోణంలో ఆలోచించి బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (BGB) అధికారులను సంప్రదించారు. భారత్​లో మరణించిన తండ్రిని చివరిసారి చూసేందుకు మృతుడి కుమార్తె, ఆమె బంధువులు బార్డర్​ వద్దకు రావడంపై చర్చించారు. బీఎస్ఎఫ్ కమాండర్ ప్రతిపాదనకు బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్ కూడా అంగీకరించింది. ఆ తర్వాత ఇరు దేశాల సరిహద్దు గార్డులు మండల్ కుమార్తె, ఆమె బంధువులను అంతర్జాతీయ సరిహద్దు అయిన జీరో లైన్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ మండల్ మృతదేహాన్ని చూసి అతడి కుమార్తె, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.

'మానవతా విలువలకు కట్టుబడి ఉంటాం'
భద్రతా బలగాలు ఎల్లప్పుడూ సామాజిక, మానవతా విలువలకు కట్టుబడి ఉంటాయని బీఎస్​ఎఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఏకే ఆర్య తెలిపారు. బీఎస్​ఎఫ్ జవాన్లు సరిహద్దులో దేశం కోసం రేయింబవళ్లు పహారా కాస్తారని చెప్పారు. బీఎస్​ఎఫ్ మానవత్వం, మానవతా విలువలను నిలబెట్టడానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.

సోదరుడిని చివరసారి చూసేందుకు బీఎస్ఎఫ్ సాయం
కొన్నాళ్ల క్రితం భారత్​లో మరణించిన తన సోదరుడిని చివరిసారిగా చూసేందుకు బంగ్లాదేశ్​లో ఉంటున్న ఓ సోదరి చేసిన ప్రయత్నం నెరవేరింది. ఇందుకోసం భారత్ -బంగ్లాదేశ్ బీఎస్​ఎఫ్ దళాలు ఆమెకు సహకరించాయి. సబర్‌ఖాన్ అనే ఓ యువతి బంగ్లాదేశ్ లో నివసిస్తోంది. అయితే భారత్​లో ఉంటున్న తన సోదరుడు మరణించాడనే విషయం ఆమెకు తెలిసింది. కానీ, భారత్ -బంగ్లాదేశ్ రెండు వేర్వేరు దేశాలు కావడం వల్ల పలు భద్రతా కారణాలతో అనేక ప్రక్రియలు దాటాలి. దీంతో సోదరుడిని చివరిసారిగా చూసేందుకు వీలు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో సబర్‌ఖాన్, భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉండే అమినుద్దీన్ అనే ఓ మంచి మిత్రుడు సహకారంతో బీఎస్ఎఫ్ సౌత్ బంగాల్ ఫ్రాంటియర్ ప్రతినిధి ఏకే ఆర్యని కలిశారు.

తన సోదరుడిని చివరిసారిగా చూసి నివాళులర్పిస్తానంటూ అధికారుల్ని వేడుకుంది సబర్​ఖాన్. సోదరి బాధను అర్థం చేసుకున్న అధికారి అమీనుద్దీన్ సొదరుడిని చూపించేందుకు చొరవ తీసుకొని బోర్డర్ అవుట్ పోస్ట్ మధుపుర్, 68 బెటాలియన్​లోని బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ) కంపెనీ కమాండర్‌ను సంప్రదించి పరిస్థితిని వివరించారు. ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు బీఎస్ఎఫ్ అధికారులు. దీంతో అంతర్జాతీయ సరిహద్దు దగ్గర సబర్​ఖాన్ తన సోదరుడి మృతదేహానికి కన్నీటి వీడ్కోలు పలికింది. ఆమె కుటుంబ సభ్యులు కూడా నివాళులర్పించారు. తమకు సహాకరించిన బీఎస్​ఎఫ్ అధికారులకు ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

రోబోతో ఇంజినీర్ లవ్​- పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తి- 'గిగా' తయారీకి రూ.19 లక్షలు ఖర్చు! - Man Robot Marriage

పెళ్లిలో 'భౌ భౌ పార్టీ'- హల్దీ, బరాత్​లోనూ కుక్కల హంగామా- వెడ్డింగ్​ కార్డుపై శునకాల పేర్లు ముద్రించిన యువకుడు - Dogs Name Print Wedding Card

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.