ETV Bharat / bharat

టార్గెట్ 2026- విజయ్ పార్టీ వ్యూహాలేంటి? 'మాస్టర్' ప్లాన్ ఇదేనా?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 2, 2024, 8:14 PM IST

Updated : Feb 2, 2024, 8:26 PM IST

Vijay Political Party Future : తమిళనాడు వెండి తెరపై అగ్రతారగా వెలుగొందుతున్న దళపతి విజయ్ రాజకీయ రంగప్రవేశం చేశారు. ఈ రణరంగంలో విజయ్​ ఎత్తుగడలు ఏ మేరకు పనిచేస్తాయి? అసలు విజయ్​ వ్యూహాలు, పార్టీ భవిష్యత్​ కార్యాచరణ ఏంటి? నటుడు విజయ్ కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

Vijay Political Party Future
Vijay Political Party Future

Vijay Political Party Future : తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పులు రాబోతున్నాయా? దాదాపు ఐదు దశాబ్దాలుగా ముఖ్యమంత్రి సీటుతో దోబూచులాడుతోన్న డీఎంకే, ఏఐడీంకే పార్టీల ఆధిపత్యానికి గండి పడుతుందా? పూర్వవైభవం వైపు సాగుతున్న కాంగ్రెస్ ఓవైపు, తమిళగడ్డపై పాగా వేయాలనుకుంటున్న బీజేపీ మరోవైపు- ఇలా తమిళ రాజకీయం రసవత్తరంగా సాగుతుండగా ప్రముఖ కోలీవుడ్ నటుడు దళపతి విజయ్ కొత్త పార్టీ పెట్టారు. శుక్రవారం తన రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' ప్రకటించి​ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యారు. మరి విజయ్ రాజకీయ వ్యూహాలేంటి? పార్టీ భవిష్యత్​ కార్యాచరణలేంటి? ఎంజీఆర్, జయలలిత తరహాలో సినీ రంగం నుంచి వచ్చి రాజకీయాలను శాసిస్తారా?

పార్టీ విధివిధానాలు ఖరారు అప్పుడే!
దాదాపు మూడు నెలల క్రితం ఓ కార్యక్రమంలో తన పార్టీ గురించి హింట్​ ఇచ్చారు విజయ్​. చెప్పినట్టే 'తమిళగ వెట్రి కళగం' పార్టీని ప్రకటించి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ప్రస్తుతం ఉన్న అవినీతి, విభజనపూరిత పాలనకు వ్యతిరేకంగా రాజకీయాల్లోకి వచ్చానని ఎన్నో రోజులుగా మనసులో ఉన్న మాటను సరైన సమయం చూసుకుని బయటపెట్టారు విజయ్. త్వరలో జరగపోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా, 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కుంభస్థలాన్ని బద్ధలుగొట్టడమే తన లక్ష్యమని ప్రకటించారు. లోక్​సభ ఎన్నికల తర్వాత పార్టీ జెండా, విధివిధానాలు ప్రకటిస్తామని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే విజయ్​ సుదీర్ఘ ప్రణాళికతో ఈ ప్రకటన చేసినట్లు కనిపిస్తోంది.

పక్కా ప్రణాళికతో
కొంతకాలంగా సేవా కార్యక్రమాలు చురుగ్గా చేపడుతున్నారు విజయ్. పరీక్షల్లో ప్రతిభ చూపిన పదోతరగతి, ప్లస్‌ వన్‌, ప్లస్‌ టూ విద్యార్థులకు ప్రోత్సాహకాలను కూడా అందిస్తున్నారు. రాజకీయాల్లోకి రాబోనని రజనీకాంత్‌ స్పష్టం చేసిన తర్వాత విజయ్‌ తన రాజకీయ ప్రవేశాన్ని వేగవంతం చేసినట్లు కనిపిస్తోంది. పార్టీ ప్రకటనకు ముందు తన అభిమాన సంఘం (విజయ్‌ మక్కల్‌ ఇయక్కం) ప్రతినిధులతో విజయ్ సుదీర్ఘ చర్చలు జరిపినట్లు సమాచారం.

ప్రజలకు ఏదైనా చేయాలని ఎంతో కాలంగా ఉన్న తపనతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టానని విజయ్​ తెలిపారు. ఇక పార్టీ పేరు ప్రకటిస్తూ తన సీనియర్ల నుంచి రాజకీయాల్లో లోతుపాతులనే కాకుండా, వేసే ఎత్తులను కూడా నేర్చుకున్నట్లు విజయ్ చెప్పారు. తమిళనాడులో దిగ్గజ నటులు అనేక మంది రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. అందులో కొందరు రాష్ట్ర రాజకీయాలపై బలమైన ముద్ర వేశారు. మరోవైపు, రెండు జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు నువ్వా నేనా అంటూ అధికారం కోసం పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తలలు పండిన రాజకీయ నాయకులను విజయ్​ సమర్థంగా ఢీకొట్టాల్సి ఉంటుంది.

క్షేత్ర స్థాయిలో పార్టీని సన్నద్ధం చేయడం
లోక్​సభ ఎన్నికల తర్వాత సభలు ఏర్పాటు చేస్తూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తామని విజయ్ వెల్లడించారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోపు పార్టీని సంస్థాగతంగా సిద్ధం చేసే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అందులో భాగంగా క్షేత్ర స్థాయిలో పార్టీని బలపరుచుకునేలా కార్యకర్తలను నియమించుకోవడం, పార్టీ కార్యకలాపాలు సజావుగా జరిగేలా వివిధ స్థాయిల్లో నేతలను ఎన్నుకోవడం వంటి ప్రక్రియలు పూర్తి చేస్తామని చెప్పారు.

రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయి?
'తమిళగ వెట్రి కళగం' రాకతో తమిళ నాట రాజకీయాలు ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే (132/234), ఏఐడీఎంకే (62/234) సంఖ్యాపరంగా ప్రధాన పార్టీలు. ఆ తర్వాత కాంగ్రెస్​ (18/234), బీజేపీ (4/234) ఉన్నాయి. అయితే ప్రస్తుతం అధికార డీఎంకే- కాంగ్రెస్ కూటమి మళ్లీ రాష్ట్రంలో గెలుపొందాలని గట్టిగానే ప్రయత్నించడం ఖాయం. డీఎంకేకు వ్యతిరేకంగా ఏఐడీఎంకే, బీజేపీ కూడా దీటుగా శ్రమిస్తోంది. ఈ రెండు పార్టీలు చిన్న ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో ఈ పార్టీలను తట్టుకుని టీవీకే నిలబడుతుందా అనేది ఆసక్తికరం కానుంది. అయితే వీరిని ఢీకొట్టడానికి విజయ్​ భిన్నమైన కార్యాచరణ అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.

భవిష్యత్ కార్యాచరణ ఇదే!
2026 అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్​లో మధురైలో విజయ్​ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అందులో తన పార్టీ పాటించే నాలుగు కీలక విధానాలను ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వాటి ద్వారా ప్రస్తుతం ఉన్న పార్టీల కంటే భిన్నమైన రాజకీయాలు చేయాలని విజయ్​ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. విజయ్​ పార్టీ ప్రాధాన్యం ఇచ్చే అంశాలు!

  • సినిమా ఆర్టిస్టులకు పార్టీలో కచ్చితంగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు.
  • కొత్త పార్టీలో మహిళలకు, ముఖ్యంగా చదువుకున్న మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు.
  • ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు ఉండదు.
  • డబ్బు, సమాజంలో పేరు ఉన్న నేతలు టీవీకేలోకి రావలనుకుంటే వారిపై అవినీతి, దుష్ప్రవర్తన వంటి కేసులు ఉండకూడదు.

సినిమాల సంగతేంటి?
తాను పూర్తిస్థాయి రాజకీయాలు చేయదలుచుకున్నట్లు విజయ్​ శుక్రవారం ప్రకటించారు. ఇప్పుడున్న సినిమాల తర్వాత పూర్తి సమయం ప్రజా సేవకే అంకితమివ్వనున్నట్లు స్పష్టం చేశారు. తాను చూసినంతవరకు చాలామంది రాజకీయ నేతలు పదవుల్లో ఉండి నటించినవారే అని, ప్రజల కోసం పనిచేసిన వారు లేరని అన్నారు.
ప్రస్తుతం విజయ్​, వెంకట్​ ప్రభు దర్శకత్వంలో 'గోట్​' సినిమా చేస్తున్నారు. దీంతోపాటు తన 69వ చిత్రాన్ని సూపర్​ గుడ్​ ఫిలిమ్స్​ బ్యానర్​పై చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత విజయ్​ సినిమాలకు దూరమవనున్నారు.

రాజకీయాల్లోకి హీరో విజయ్- 2026 ఎన్నికల్లో పోటీ- తమిళ ప్రజలకే అంకితమన్న దళపతి

గొప్ప మనసు చాటుకున్న విజయ్​ - 1500 మంది వరద బాధితులకు సహాయం

Last Updated : Feb 2, 2024, 8:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.