తెలంగాణ

telangana

Yellampalli 25 Gates Open : ఎల్లంపల్లి ప్రాజెక్టు 25గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

By

Published : Jul 21, 2023, 7:23 PM IST

Yellampalli Project

Yellampalli Project 25 Gates Open : పెద్దపెల్లి జిల్లా అంతర్గాం మండలంలో ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలోకి వరద పోటెత్తుతోంది. కడెం జలాశయం గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని వదులుతుండడంతో పాటు పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో... 25గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు 25 గేట్ల ద్వారా 2,53,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు ద్వారా 1,47,800 క్యూసెక్కులు, గోదావరి ఎగువ ప్రాంతం నుంచి 1,00,082 క్యూసెక్కుల నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పాటు కడెం ప్రాజెక్టు నీటిని దిగువకు వదులుతుండగా ఎల్లంపల్లి జలాశయంలోకి మరింత భారీగా నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. దీంతో జలాశయంలో నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా ముందస్తుగానే గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 

శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ఎల్లంపల్లి జలాశయంలో 20 టీఎంసీలకు గాను 18.23 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 147.30 మీటర్లకు చేరింది.  మొత్తం ఇన్​ ఫ్లో 2,47,882 క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో 1,78,410 క్యూసెక్కులు ఉంది. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు పార్వతీ పంప్ హౌస్ నుంచి ఎల్లంపల్లికి.. ఎల్లంపల్లి నుంచి నంది పంప్ హౌస్​కు ఎత్తిపోతలు నిలిపివేశారు. కేవలం హైదరాబాద్ మెట్రో వాటర్ స్కీంకు మాత్రమే 110 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. కాగా శ్రీపాద ప్రాజెక్టు పరిసర ప్రాంత ప్రజలు, మత్స్యకారులకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details