తెలంగాణ

telangana

కోలుకుంటున్న మణిపుర్​.. కర్ఫ్యూ ఎత్తివేత.. విధ్వంసకాండ దృశ్యాలు చూశారా?

By

Published : May 10, 2023, 4:46 PM IST

manipur latest news

Manipur violence : ఈశాన్య రాష్ట్రం మణిపుర్​లో పరిస్థితులు కుదుటపడుతున్నాయి. పశ్చిమ ఇంఫాల్, బిష్ణుపుర్, చురాచంద్​పుర్, జిరిబమ్​ సహా 11 జిల్లాల్లో కర్ఫ్యూను సడలించారు. ఉదయం 5 నుంచి ఆరు గంటల పాటు కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు అధికారులు బుధవారం ప్రకటించారు. కొత్తగా రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరగలేదని తెలిపారు.

గిరిజన, గిరిజనేతరుల మధ్య చెలరేగిన ఘర్షణలు మణిపుర్​లో హింసకు దారితీశాయి. ఫలితంగా 60 మంది మృతి చెందారు. 30 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. అందులో 26 వేల మందిని సురక్షితంగా ఇతర జిల్లాలకు తరలించారు. 4వేల మందిని వారి నివాసాలకు దగ్గర్లో రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి ఉంచినట్లు సమాచార, ప్రజా సంబంధాల మంత్రి సపమ్ రంజన్ సింగ్ వెల్లడించారు.

ఇంఫాల్​కు సమీపంలో ఉన్న కంగ్​చుప్ చింగ్​ఖోంగ్​.. హింసాత్మక ఆందోళనల్లో తీవ్రంగా నష్టపోయింది. ఈ ప్రాంతంలోని 50 ఇళ్లకు ఆందోళనకారులు నిప్పంటించారు. జూనియర్ హైస్కూల్​పైనా దాడి చేశారు. స్కూల్​కు నిప్పంటించడం వల్ల టేబుళ్లు, కుర్చీలు బూడిదయ్యాయి. ప్రార్థనాస్థలాలను సైతం ఆందోళనకారులు వదల్లేదు. ఎటు చూసినా.. పైకప్పు కూలిపోయి, ధ్వంసమైన ఇళ్లే కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తామంతా శాంతియుతంగా జీవించాలని అనుకుంటున్నామని, వీలైనంత త్వరగా పరిస్థితులను అదుపు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

మరోవైపు, రాష్ట్రంలో పరిస్థితి మెరుగైందని ప్రభుత్వం చెబుతోంది. మంగళవారం ఎలాంటి హింసాత్మక ఘటనలు నమోదు కాలేదని తెలిపింది. "హైవేలపై కొన్ని చెదురుమదురు ఘటనలు జరిగాయి. హింసాత్మక ఘటనలు మాత్రం నమోదు కాలేదు. మణిపుర్ సాధారణ స్థితికి వచ్చేసింది. ఆయుధాలను సీజ్ చేస్తున్నాం. కర్ఫ్యూ సడలిస్తున్నాం" అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి టీహెచ్ బసంతకుమార్ తెలిపారు.

ఆర్మీ పహారా.. 
హింస ప్రబలిన ప్రాంతాల్లో ఆర్మీ, అసోం రైఫిల్స్ బలగాలను మోహరించారు. అనుక్షణం వీరంతా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని అధికారులు తెలిపారు. ఫ్లాగ్​మార్చ్​లు నిర్వహిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తున్నారని వివరించారు. మానవరహిత వాహనాల ద్వారా నిఘా పెట్టినట్లు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details