తెలంగాణ

telangana

బిర్యానీ ఘుమఘుమల్లో ఆరోగ్యం దాగుంది!

By

Published : Jul 30, 2020, 12:47 PM IST

బిర్యానీ ఘుమఘుమలు ముక్కుపుటాలను తాకుతుంటే పొట్టకన్నా ముందు మనసే నిండిపోతుందేమో అనిపిస్తుంది.. బిర్యానీ రుచంతా ఆ మసాలా దినుసుల్లోనే ఉంటుందనేది అక్షర సత్యం. మరి ఈ దినుసులు రుచితోపాటు పోషకవిలువలు కూడా అందిస్తాయని మీకు తెలుసా?

health benefits of biryani spices or biryani masala
బిర్యానీ ఘుమఘుమల్లో ఆరోగ్యం దాగుంది!

బిర్యానీ, గుత్తి వంకాయ, పనీర్ మసాలా ఇలా.. రుచికరమైన భారతీయ వంటకాల్లో ఉపయోగించే మసాలా దినుసులు.. సుగంధ ఔషధాలే. వీటిలో పోషకాలు పుష్కలంగా నిండి ఉంటాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. మరి అవేంటో చూసేయండి..

దాల్చినచెక్క

దాల్చినచెక్క

మాంసాహార వంటల్లో రుచికి, సువాసనకు తప్పనిసరిగా వాడతారు. దీన్ని చెట్టు బెరడు నుంచి తీస్తారు. ఇది ఆహారం త్వరగా చెడిపోకుండా కాపాడుతుంది. దీనిలోని సుగంధతైలాలు మెదడులోని కణజాలం, న్యూరాన్లు అతిగా పనిచేయకుండా ఉండటానికి, మానసిక ఆందోళన తగ్గించడానికి, నిద్ర పట్టడానికి సహాయపడుతుంటాయి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది తలనొప్పి, నిద్రలేమి, నోటి దుర్వాసనను నివారిస్తుంది. శీతల గుణం ఉంటుంది. జీర్ణ సమస్యలు ఉన్నప్పుడు దీన్ని నిమ్మరసంతో కలిపి తీసుకోవాలి. దగ్గు, ఆయాసం ఉన్నప్పుడు దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలను సమానంగా కలిపి కొంచెం తేనె వేసి రెండు, మూడు సార్లు తీసుకుంటే త్వరగా సమస్య తగ్గుతుంది.

లవంగాలు

లవంగాలు

వీటినే లౌంగ్‌, లవంగ పుష్పం అని పిలుస్తారు. ఆయుర్వేద ఔషధాల్లో వాడుతుంటారు. నోటి దుర్వాసన తగ్గడానికి, హెలిటోసిస్‌ అనే వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు. ఇరాన్‌, చైనా దేశాల్లో కొన్ని రకాల వాజీకరణ ఔషధాల్లో వినియోగిస్తారు. ఇవి గ్యాస్‌ను తగ్గిస్తాయి. ఆహారం త్వరగా జీర్ణం అయ్యేట్లు చేస్తాయి. రక్తప్రసరణను వేగవంతం చేస్తాయి. వీటిని దోరగా వేయించి తేనెతోపాటు తీసుకుంటే వాంతులు తగ్గుతాయి. అయిదారు చుక్కల లవంగతైలం నీళ్లలో వేసి తీసుకుంటే కడుపునొప్పి తగ్గుతుంది. లవంగాలను పెనం మీద కాల్చి పొడిగా చేసి తేనెతో కలిపి తీసుకుంటే గొంతునొప్పి తగ్గుతుంది. దగ్గు, ఆయాసంగా ఉన్నప్పుడు దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలను తేనెతో కలిపి తీసుకుంటే సమస్య త్వరగా తగ్గుతుంది.

షాజీరా

షాజీరా

శహజీరకను షాజీరా అంటారు. జీలకర్ర మాదిరిగా ఉంటుంది. ఈ గింజలు చిన్నగా, నల్లగా, సన్నగా సువాసనతో ఉంటాయి. రుచి కాస్త చేదుగా, వగరుగా ఉంటుంది. దీన్ని గరంమసాలా దినుసు అనికూడా అంటారు. ఇది కఫాన్ని తగిస్తుంది. దీని చూర్ణాన్ని నస్యంగా పీలిస్తే ముక్కు నుంచి రక్తం పడటం తగ్గుతుంది. అయిదారు చుక్కల వెనిగర్‌లో కలిపి తీసుకుంటే దగ్గు, ఆయాసం తగ్గుతాయి. వాతం, తేన్పులు, వెక్కిళ్ల సమస్యలు ఉన్నప్పుడు చిటికెడు షాజీరా చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. దీన్ని రోజూ తీసుకోవడం మంచిది కాదు. ఇది శరీరంలోని నీటి శాతాన్ని తగ్గిస్తుంది.

తేజ్ పత్రి

ఆకుపత్రి

దీన్నే తేజపత్రి, త్వక్‌ బిర్యానీ ఆకు అని పిలుస్తారు. మాంసాహార వంటల్లో ఎక్కువగా వేస్తారు. కొన్ని శాకాహార వంటల్లోనూ వాడతారు. జలుబు, దగ్గు, ఆయాసం తగ్గించే ఆయుర్వేద ఔషధాల తయారీలో వాడుతుంటారు. గ్యాస్‌ సమస్య తగ్గడానికి దీన్ని కషాయంగా వాడతారు.

అల్లం వెల్లుల్లి

అల్లం, వెల్లుల్లి

వీటికి అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని సమాన పరిమాణంలో తీసుకుని ముద్దగా చేసి మాంసాహార వంటకాల్లో వాడతారు. ఈ రెండింటిలోని సుగంధ తైలాలు ఆహారం త్వరగా చెడిపోకుండా రుచిని, సువాసనను అందిస్తాయి. రక్త ప్రసరణను వేగవంతం చేస్తాయి. ఆహారం త్వరగా అరిగేటట్టు చేస్తాయి. విడిగా తీసుకున్నా మంచిదే.

జాజికాయ

దీన్నే మేస్‌, నట్‌మెగ్‌ అంటారు. జాజికాయ ముందు భాగంలో ఉండే పువ్వు ఎరుపురంగులో ఉంటుంది. దీనిలో ఉండే మెరిస్‌టిన్‌ అనే సుగంధ తైలానికి ఔషధ గుణాలుంటాయి. జాజికాయ పువ్వులో కొంత మత్తును కలిగించే గుణాలుంటాయి. చాలా తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. దీన్ని కిళ్లీ/తమలపాకుల్లో వేసి తీసుకుంటారు. విరేచనాలు అవుతున్నప్పుడు చిటికెడు జాజికాయ పొడిని పెరుగులో కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. చిటికెడు జాజికాయ పొడిని పాలల్లో వేసుకుని తాగితే నిద్ర బాగా పడుతుంది. చెంచా మారేడు పండు గుజ్జు, చిటికెడు జాజికాయ చూర్ణం, కొంచెం పెరుగు వేసి మూడు, నాలుగుసార్లు తీసుకుంటే జిగట విరేచనాలు తగ్గుతాయి.

యాలకులు

యాలకులు

వీటిలో పెద్దవి, చిన్నవి ఉంటాయి. ఇవి కొంచెం కారంగా, కాస్త తీయగా, చిరు చేదుగా, వగరుగా ఉంటాయి. మొగ్గల్లా ఉండే ఈ యాలకుల్లో నల్లటి గింజలు తెల్లటి పొరలతో కప్పి ఉంటాయి. కడుపులో తిప్పినప్పుడు, వాంతులు అరికట్టడానికి, కడుపులో గ్యాస్‌, చెడు బ్యాక్టీరియా పెరగకుండా ఉండటానికీ వీటిని వాడుతుంటారు. నోటి దుర్వాసన తగ్గడానికీ తీసుకుంటారు. దగ్గూ, జీర్ణాశయ సమస్యల నివారణకు ఆయుర్వేద మందుల తయారీలో వాడతారు.

జాగ్రత్తలు

మసాలా దినుసులను చాలా తక్కువగా వాడుకోవాలి. ఎక్కువైతే మలబద్దకం, కడుపులో మంట, అజీర్ణం లాంటి సమస్యలూ వస్తాయి.

ఇదీ చదవండి: ఒక్కో మెట్టు ఎక్కేయండి.. ఆరోగ్యాన్ని అందుకోండి!

ABOUT THE AUTHOR

...view details