తెలంగాణ

telangana

ఈ వ్యాయామాలు చేస్తే... శృంగార సామర్థ్యం రెట్టింపు!

By

Published : Apr 22, 2022, 7:13 AM IST

Exercises For Sexual Health: దాంపత్య జీవితంలో శృంగారం పాత్ర కీలకం! అయితే జీవనశైలిలో మార్పులు, అనారోగ్యాలు లైంగిక జీవితాన్ని దెబ్బ తీస్తున్నాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా స్థూలకాయం కారణంగా 43 శాతం మంది మహిళలు, 31 శాతం మంది పురుషులు లైంగిక జీవితానికి దూరమైనట్లు జాతీయ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దీని ప్రభావం అనుబంధాల పైనే కాదు.. ఆరోగ్యం పైనా పడుతుంది. అందుకే ఈ సమస్యను అధిగమించాలంటే వ్యాయామమే సరైన మార్గం అంటున్నారు నిపుణులు. మరి, వ్యాయామానికి, శృంగార సామర్థ్యం పెరగడానికి సంబంధమేంటో తెలుసుకుందాం రండి..!

Sexual Health
Sexual Health

Exercises For Sexual Health: శృంగారం వల్ల దంపతుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. అయితే ఈ ఆసక్తి పెరగాలంటే.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా ముఖ్యమేనంటున్నారు నిపుణులు. వివిధ రకాల వర్కవుట్స్‌ వల్ల శరీరం స్పందించే విధానం, పలు శారీరక చర్యలు ఈ కోరికల్ని పెంచడానికి దోహదం చేస్తాయంటున్నారు.

ఆకర్షణ పెరుగుతుంది!.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చక్కటి శరీరాకృతి మన సొంతమవుతుంది. ఇది మనలో స్వీయ ప్రేమను, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే భాగస్వామికి మన పట్ల ఆకర్షణ మరింత పెరుగుతుంది. ఇది లైంగిక చర్యకు ప్రేరేపించడం సహా కలయికనూ ఆస్వాదించేలా చేస్తుందంటున్నారు నిపుణులు.

కండరాలు చురుగ్గా! :వ్యాయామం చేయని మహిళలతో పోల్చితే వ్యాయామం చేసే మహిళల్లో లైంగిక కోరికలు పెరిగినట్లు టెక్సాస్‌ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. అదెలాగంటే.. వర్కవుట్స్‌ చేసే క్రమంలో గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది.. శ్వాస తీసుకోవడమూ ఎక్కువవుతుంది. తద్వారా కండరాలు మరింత చురుగ్గా పనిచేస్తాయి.. ఈ మార్పులన్నీ అంతిమంగా లైంగిక కోరికలు పెంచడం సహా శృంగారాన్నీ ఆస్వాదించేలా చేస్తాయట!

ఒత్తిడి తగ్గితే సరి!.. లైంగికాసక్తిని, శృంగార కోరికల్ని హరించే వాటిలో ఒత్తిడిది అగ్రస్థానం. వివిధ వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాలు మనల్ని ఒత్తిడి, ఆందోళనల్లోకి నెట్టేస్తున్నాయి. అందుకే వీటిని తగ్గించుకోవాలంటే రోజూ వ్యాయామం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. ఇలా వివిధ రకాల వర్కవుట్స్‌ చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు (హ్యాపీ హార్మోన్లు) విడుదలవుతాయి. ఇవి శారీరక నొప్పులు, ఒత్తిడి-ఆందోళనల్ని తగ్గించడం సహా సంతోషాన్ని-ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయి. తద్వారా లైంగికాసక్తి కూడా క్రమంగా పెరుగుతుంది.

రక్తప్రసరణ మెరుగవుతుంది..!: శరీరంలో ఏ అవయవమైనా ఆరోగ్యంగా ఉండాలన్నా, చురుగ్గా పనిచేయాలన్నా.. ఆయా భాగానికి సరైన రక్తప్రసరణ జరగడం ముఖ్యం. లైంగిక అవయవాలకు ఇది వర్తిస్తుంది. అయితే ఇందుకు వ్యాయామమే సరైన మార్గం అంటున్నారు నిపుణులు. వర్కవుట్స్‌ చేసే క్రమంలో గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. తద్వారా శరీర అవయవాలకు రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఈ క్రమంలో లైంగిక అవయవాలూ యాక్టివేట్‌ అవుతాయి. శరీరంలో జరిగే ఈ మార్పులన్నీ లైంగిక అవయవాల ఆరోగ్యానికి, శృంగార సామర్థ్యాన్ని పెంచడానికి దోహదం చేస్తాయి.

ఏయే వ్యాయామాలు మంచివి?..శృంగార సామర్థ్యాన్ని, ఆసక్తిని పెంచాలంటే కొన్ని రకాల వ్యాయామాలు చేయడం మంచిదంటున్నారు నిపుణులు. కీగల్‌, స్క్వాట్స్‌, లాంజెస్‌, పుషప్స్‌, ప్లాంక్‌ వ్యాయామాలతో పాటు.. నడక, పరుగు, ఈత, సైక్లింగ్‌.. వంటివీ రోజువారీ వర్కవుట్‌లో భాగం చేసుకోవాలి. ఇవి కటి వలయంలోని కండరాల్ని దృఢం చేసి లైంగిక చర్యను పూర్తిగా ఆస్వాదించేలా చేస్తాయి. ఇక ఈ వ్యాయామాలన్నీ ఒంటరిగా కాకుండా.. మీ భాగస్వామితో కలిసి జంటగా చేస్తే.. ఇద్దరి మధ్య ఆకర్షణ క్రమంగా పెరుగుతుంది. కలయికను ఆస్వాదించడానికి ఇదీ ముఖ్యమే!

అయితే ఇన్ని చేసినా లైంగికాసక్తి పెరగకపోయినా, ఇతర వ్యక్తిగత కారణాలేవైనా ఉన్నా.. ఆలస్యం చేయకుండా సంబంధిత నిపుణుల్ని సంప్రదిస్తే సమస్య తీవ్రం కాకముందే పరిష్కరించుకోవచ్చు. ఇది అనుబంధానికి, ఆరోగ్యానికి.. ఇలా రెండు విధాలుగానూ మంచిదే!

ఇదీ చూడండి :వ్యాయామం తర్వాత విశ్రాంతి కచ్చితంగా అవసరమా..?

ABOUT THE AUTHOR

...view details