తెలంగాణ

telangana

Teen Pregnancy: ఈ విషయాలు మీకు తెలుసా?

By

Published : Feb 8, 2022, 12:43 PM IST

Teen Pregnancy : తెలిసీ తెలియని వయసులో క్షణికావేశం, అత్యాచారాలు, బాల్య వివాహాలు.. ఇలా యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు గర్భం దాల్చడానికి (టీన్‌ ప్రెగ్నెన్సీ) కారణాలు ఎన్నో! అయితే ఇంత చిన్న వయసులో గర్భధారణ అంటే ఇటు తల్లికి, అటు బిడ్డకి.. ఇద్దరికీ ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు నిపుణులు. అందుకే బాల్య వివాహాల్ని నిర్మూలించడంతో పాటు లైంగిక ఆరోగ్యం, టీన్‌ ప్రెగ్నెన్సీ.. వంటి విషయాల గురించి చిన్నతనం నుంచే అమ్మాయిల్లో అవగాహన కలిగించాలంటున్నారు.

Teen Pregnancy, women health tips
టీన్ ప్రెగ్నెన్సీ

Teen Pregnancy : టీన్‌ ప్రెగ్నెన్సీ అనేది చాలా సున్నితమైన అంశం. దీని గురించి చర్చించడానికి చాలామంది సిగ్గుపడుతుంటారు. ఇదే ఈ విషయం పట్ల అమ్మాయిల్లో అవగాహన లోపానికి, వారు చిన్న వయసులోనే గర్భం ధరించడానికి మూల కారణమవుతుంది. మన దేశంలో వేళ్లూనుకుపోయిన సమస్యల్లో ఇది కూడా ఒకటి. నెలసరి ప్రారంభమైన తర్వాత నుంచి, 19 ఏళ్ల లోపు గర్భం ధరించిన అమ్మాయిల్ని ‘టీన్‌ ప్రెగ్నెంట్’గా పరిగణిస్తారు. తెలిసీ తెలియని వయసులో కలిగే లైంగిక కోరికలు, లైంగిక హింస, బాల్య వివాహాలు.. వంటివి ఆడుకునే అమ్మాయిల్ని అమ్మల్ని చేస్తున్నాయి. ప్రత్యుత్పత్తి వ్యవస్థ, లైంగిక ఆరోగ్యం.. వంటి విషయాల్లో అమ్మాయిలకు సరైన అవగాహన లేకపోవడం వల్లే వారు చిన్న వయసులోనే గర్భందాల్చుతున్నారు.

ఏటా కోట్ల మంది బాలికలు అమ్మలుగా..!

మన దేశంలో ఈ సమస్య కాస్త తీవ్రంగానే ఉందని చెప్పాలి. ఏటా సుమారు 1.6 కోట్ల మంది బాలికలు చిన్న వయసులోనే (15-19) తల్లులవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇలా చిన్న వయసులోనే గర్భం దాల్చిన అమ్మాయిల్లో, వారికి పుట్టే పిల్లల్లో కొన్ని దీర్ఘకాలిక అనారోగ్యాలు తలెత్తుతున్నాయని.. ఫలితంగా ఇద్దరూ జీవితాంతం ఇటు శారీరకంగా, అటు మానసికంగా బాధపడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకు లైంగిక విద్య పట్ల పూర్తి అవగాహన కల్పిస్తేనే ఈ సమస్యను అంతం చేయచ్చని చెబుతున్నారు.

అమ్మల్లో ‘అనీమియా’!

చిన్న వయసులోనే తల్లులైన అమ్మాయిల్లో అటు శారీరకంగా, ఇటు మానసికంగా పలు అనారోగ్యాలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు.

* సరైన వయసులో గర్భం ధరించే మహిళలతో పోల్చితే చిన్న వయసులో అమ్మలయ్యే అమ్మాయిల్లో.. ప్రెగ్నెన్సీ సమయంలో అధిక రక్తపోటు (ప్రిఎక్లాంప్సియా) వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నారు నిపుణులు. తద్వారా నెలలు నిండకుండానే బిడ్డ పుట్టడం, అది కూడా తక్కువ బరువుతో పుట్టడం.. అలాగే తల్లీబిడ్డల్లో మూత్రపిండ సంబంధిత సమస్యలు ఎదురయ్యే ప్రమాదం అధికంగా ఉందంటున్నారు.

* పిన్న వయసులో గర్భం దాల్చిన అమ్మాయిలు రక్తహీనత బారిన పడే సమస్య కూడా ఎక్కువేనట! తద్వారా నీరసం, అలసట.. వంటివి తలెత్తి ఇవి అంతిమంగా ఎదిగే పిండంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.

* యుక్త వయసులో ఉన్న అమ్మాయిల మరణానికి గల కారణాలన్నింటిలోకెల్లా టీన్‌ ప్రెగ్నెన్సీనే ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

* తెలిసో తెలియకో క్షణికావేశంలో గర్భం ధరించడం మూలంగా చాలామంది అమ్మాయిలు ఆ విషయాన్ని నలుగురితో చెప్పలేకపోతున్నారని, ఆ సమయంలో సరైన చికిత్స తీసుకోలేకపోతున్నారని.. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు.

* చిన్న వయసులో గర్భం ధరించడం వల్ల స్కూల్‌ మానేసే అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. ఇది వారి బంగారు భవిష్యత్తును తుంచేసి.. వారిని పేదరికంలోకి నెట్టేస్తుంది.

పిల్లల్లో ఈ సమస్యలు!

* టీనేజ్‌ తల్లులు నెలలు నిండకుండానే పిల్లలకు జన్మనిచ్చే అవకాశాలు ఎక్కువంటున్నారు నిపుణులు. తద్వారా వారి మెదడు పరిణతి చెందకపోవడం, శరీరంలో అవయవ లోపాలు.. వంటి సమస్యలు వారిని జీవితాంతం వెంటాడతాయి.

* ఇక వారు తక్కువ బరువుతోనూ పుట్టచ్చట! తద్వారా వారిలో శ్వాస సంబంధిత సమస్యలు, డయాబెటిస్‌, గుండె సమస్యలు.. వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. ఇవి ఒక్కోసారి శిశు మరణాలకు కూడా దారితీస్తాయట!

చూశారుగా.. టీన్‌ ప్రెగ్నెన్సీ వల్ల అమ్మాయిల ఆరోగ్యానికి ఎంత నష్టమో! కాబట్టి లైంగిక ఆరోగ్యం, ప్రత్యుత్పత్తి వ్యవస్థ.. తదితర సున్నితమైన అంశాల గురించి వారితో చర్చించడానికి సిగ్గుపడకుండా.. ఈ విషయాలను వారికి వివరించండి.. తద్వారా వారిలో అవగాహన పెంచినవారవుతారు. ఇది అంతిమంగా టీన్‌ ప్రెగ్నెన్సీ సమస్యను తగ్గించేందుకు దోహదం చేస్తుంది.

ఇదీ చదవండి:Beauty Tips: చారడేసి కళ్ల కోసం.. మాయ చేసే మేకప్!

ABOUT THE AUTHOR

...view details