తెలంగాణ

telangana

భిన్న వాతావరణానికి ప్రతీక.. ఈ తంగేడు వనం

By

Published : Jan 27, 2021, 9:55 AM IST

భిన్న వాతావరణానికి ప్రతీక.. ఈ తంగేడు వనం
భిన్న వాతావరణానికి ప్రతీక.. ఈ తంగేడు వనం

మనసుకు ఉత్తేజాన్నిచ్చేలా పర్యావరణహిత వాతావరణానికి వేదికగా నిలుస్తోంది.. చౌటుప్పల్‌ వద్ద ఏర్పాటు చేసిన తంగేడువనం. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై అనుక్షణం వినిపించే రణగొణధ్వనుల నుంచి ఉపశమనం కలిగిస్తూ ఆహ్లాదకర వాతావరణం అందిస్తోంది. రిజర్వ్ అటవీ ప్రాంతంలో రూపుదిద్దుకున్న అడవి... అందరినీ ఆకర్షిస్తోంది.

రణగొణధ్వనుల్లో పక్షుల కిలకిలారావాలు... కాంక్రీట్ జంగిల్ నడుమ కారడవి... పరిశ్రమల చెంతన పరచుకున్న పచ్చదనం... ఇలాంటి భిన్న వాతావరణానికి ప్రతీకగా నిలుస్తోంది ప్రకృతి వనం. రాష్ట్ర పుష్పం తంగేడుతో పాటు తంగేడుపల్లి గ్రామం పేరు కలసివచ్చేలా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ శివారులో ఏర్పాటు చేసిన అటవీ పార్కు... సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతోంది.

భిన్న వాతావరణానికి ప్రతీక.. ఈ తంగేడు వనం

యాదాద్రి భువనగిరి జిల్లా పేరు మీదుగా మొదలైన యాదాద్రి మోడల్ నేచురల్ పార్కు ప్రకృతి అందాలను చెంతకు చేరుస్తోంది. 2018 ఏప్రిల్‌లో శంకుస్థాపన చేశాక జులై నుంచి నిర్మాణానికి అడుగులు పడితే...2020 జులై 26న అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పార్కును ప్రారంభించారు. చౌటుప్పల్ అటవీ రేంజ్ లోని 125 ఎకరాలకు గాను తొలిదశలో 40 ఎకరాల్లో అటవీ పెంపకం, సంరక్షణ కొనసాగుతోంది. మియావాకీ పద్ధతిలో ఎకరంలో 4 వేల మొక్కలు నాటగా... ఇప్పుడవి వృక్షాలుగా మారి ఆ ప్రాంతం కారడవిని తలపిస్తోంది.

జీవ వైవిధ్యానికి వేదిక

జీవ వైవిధ్యానికి వేదికగా నిలుస్తోన్న తంగేడువనం... వివిధ రకాల పుష్పాలు, సీతాకోకచిలుకల సందడితో ఆకట్టుకుంటోంది. రావి, మర్రి, జువ్వి, మేడి, సీతాఫలం వంటి 28 రకాల మొక్కలు అక్కడ కనిపిస్తాయి. ఆహ్లాదకర వాతావరణానికి సందర్శకులు తన్మయత్వం చెందుతున్నారు.

రోజుకు 100 నుంచి 1500

ఇక్కడ పిల్లల కోసం సైతం పార్కును తీర్చిదిద్దుతున్నారు. వచ్చే ఏప్రిల్ నుంచి తంగేడువనం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. పుట్టినరోజు వేడుకలు, వెడ్డింగ్ ఫొటో షూట్ వంటి కార్యక్రమాల కోసం షెడ్డు తయారవుతోంది. యోగా కోసం ఏర్పాటు చేసే షెడ్డు పూర్తయితే... వంద మంది దాకా ఇందులో పాల్గొనవచ్చు. చిన్నారుల కోసం ఊయల, జారుడుబండ వంటి వాటితో కూడిన ప్లే స్టేషన్ కు శ్రీకారం చుడుతున్నారు. మరో నెలలో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని అటవీశాఖ చెబుతోంది. రోజుకు వెయ్యి నుంచి 15 వందల మంది వచ్చినా ఇబ్బందులు లేకుండా... సౌకర్యాలు తంగేడువనంలో ఉండబోతున్నాయి.

మోడల్ నేచురల్ పార్కు

కేవలం పచ్చదనమే కాకుండా...వివిధ రకాలుగా తంగేడువనం సేవలందించబోతోంది. పర్యావరణ విద్యా కేంద్రం, వైల్డ్ లైఫ్, వాచ్ టవర్, వ్యూ పాయింట్, వాకింగ్ ట్రాక్ సౌకర్యాలు...యాదాద్రి మోడల్ నేచురల్ పార్కు సొంతం. అడవిలోపల కుంటలను చుడుతూ సాగేలా 6 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్‌తో పాటు వృద్ధుల కోసం కిలోమీటరున్నర ట్రాక్ ను రూపొందించారు. పోలీసు శిక్షణ, పోటీ పరీక్షల తర్ఫీదు కోసం అటవీ పార్కు ఉపయోగపడుతోంది. అడవిని తలపిస్తూ పర్యావరణహితంగా ఉండేలా... గుడిసె మాదిరి క్యాంటీన్​ను రూపొందించే పనిలో ఉన్నారు. జూపార్కు మాదిరిగా పక్షుల అరుపులను వివరించేందుకు గాను... ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్ తయారవుతోంది. తంగేడుపల్లి వ్యాయామ విద్యా కళాశాల విద్యార్థులు...ఇప్పటికే వాకింగ్ ట్రాక్​ను ఉపయోగిస్తున్నారు.

ప్రకృతి అనుభూతులు పంచేలా

ఇంతకాలం కొవిడ్ తీవ్రత దృష్ట్యా కొన్ని పరిమితుల మధ్య తంగేడువనం తెరిచారు. ఇప్పుడు లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుతో ఉద్యానవనం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. మరిన్ని సౌకర్యాలు కల్పించడం ద్వారా పూర్తిస్థాయిలో ప్రకృతి అనుభూతులు పంచేలా అటవీశాఖ చర్యలు తీసుకుంటోంది.

ABOUT THE AUTHOR

...view details