తెలంగాణ

telangana

14వ సారి యాదాద్రిని సందర్శించనున్న కేసీఆర్​

By

Published : Mar 4, 2021, 2:34 AM IST

Updated : Mar 4, 2021, 4:28 AM IST

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కృష్ణశిలా సౌందర్యంతో తళుకులీనుతున్న యాదాద్రి ఆలయం... తుది దశ నిర్మాణాలు పూర్తి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆలయ పనులను పరిశీలించనున్నారు. పద్నాలుగోసారి క్షేత్రానికి రానున్న కేసీఆర్​ ఆలయ పనులపై దిశానిర్దేశం చేయనున్నారు.

CM KCR visit to Yadadri for the 14th time
14వ సారి యాదాద్రిని సందర్శించనున్న కేసీఆర్​

14వ సారి యాదాద్రిని సందర్శించనున్న కేసీఆర్​

ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించేందుకు సీఎం కేసీఆర్​... ఇవాళ యాదాద్రికి రానున్నారు. గతేడాది సెప్టెంబరు 13న క్షేత్రానికి వచ్చిన ఆయన... ఐదున్నర నెలల తర్వాత మరోసారి పర్యటించబోతున్నారు. శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఉద్ఘాటనను.. ఘనంగా నిర్వహించాలన్న లక్ష్యంతో ఉన్న ముఖ్యమంత్రి... అసంపూర్తిగా మిగిలిన పనులను పూర్తి చేయించేందుకు మరోమారు యాదాద్రిలో అడుగు పెట్టబోతున్నారు. 1200 కోట్ల రూపాయలతో ప్రారంభించిన పునర్నిర్మాణాలను 2016 అక్టోబరు 11న ప్రారంభించగా... ఇప్పటివరకు సుమారు 850 కోట్లు వెచ్చించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అద్భుత గోపురాలు, ప్రభవించే ప్రాకారాలు, దశావతారాలు, ఆళ్వారులతో అలరారుతున్న ప్రధాన ఆలయం... 4.33 ఎకరాల్లో రూపుదిద్దుకుంటోంది.

తుది దశకు పునరుద్ధరణ పనులు

మాడ వీధుల్లోని సాలహారాల్లో విగ్రహాల పొందిక పనులు మినహా... ప్రధానాలయ పునర్నిర్మాణం పూర్తయింది. పంచ లోహంతో ప్రహ్లాద చరిత్రను చాటే పలకలను గర్భాలయ మహా ద్వారంపై... జయ విజయుల శిల్పాల మందిరాలకు ఇత్తడి ప్రభలను బిగించారు. క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి... గండ భేరుండ నార సింహస్వామిని దర్శించుకునే ఏర్పాట్లున్నాయి. ప్రధానాలయానికి అనుబంధంగా నిర్మిస్తున్న శ్రీ పర్వత వర్ధిని రామ లింగేశ్వరుడి ఆలయ పునరుద్ధరణ పనులు... తుది దశకు చేరుకున్నాయి. రామానుజ కూటమిగా పిలుచుకునే వంటశాల... యాగశాల, నిత్య కల్యాణ మండపంతోపాటు అద్దాల మండపాన్ని రూపొందించారు. ఆలయ పడమర దిశలో వేంచేపు మండపం, తూర్పున బ్రహ్మోత్సవ మండపం, ఉత్తరాన రథశాల నిర్మించారు.

చెల్లింపు విషయంలో..


ప్రధాన ఆలయానికి ఉత్తరాన 13.23 ఎకరాలతో 104 కోట్లతో చేపట్టిన ప్రెసిడెన్షియల్ సూట్లలో... 15 విల్లాలకు గాను 14 పూర్తి కాగా, ఒకటి పురోగతిలో ఉంది. కొండ చుట్టూ 130 కోట్లతో 5.7 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న బాహ్య వలయ రహదారి... దక్షిణ దిశలో మినహాయించి మూడు వైపులా పూర్తి చేశారు. నిర్వాసితులకు పరిహారం చెల్లింపు విషయంలో నెలకొన్న జాప్యంతో... మిగతా పనికి ఆటంకం కలుగుతోంది. ప్రధాన ఆలయంలో విద్యుదీకరణతోపాటు ఏసీ సరఫరా, ఇతర సదుపాయాల కోసం... నిపుణులు చెమటోడుస్తున్నారు. ఇప్పటికే ఫ్లోరింగ్, డ్రైనేజీ పనులు పూర్తి కాగా... ఆలయ ఉత్తర దిశలో బస్సు ప్రాంగణం, వాహనాల పార్కింగ్ నిర్మాణం సాగుతోంది. ఈ మిగిలిన పనులపైనే ముఖ్యమంత్రి దృష్టి సారించే అవకాశముంది.


ఇదీ చూడండి :చర్లపల్లికి యాదాద్రి ఆలయ వెండి తరలింపు

Last Updated :Mar 4, 2021, 4:28 AM IST

ABOUT THE AUTHOR

...view details