తెలంగాణ

telangana

మరియమ్మ లాకప్​డెత్​పై సీఎం సీరియస్​.. బాధిత కుటుంబానికి భరోసా

By

Published : Jun 26, 2021, 4:40 AM IST

మరియమ్మ లాకప్‌డెత్‌పై విపక్షాలు, ప్రజాసంఘాల ఆందోళనతో బాధిత కుటుంబానికి న్యాయం జరిగే దిశగా అడుగులు పడుతున్నాయి. కాంగ్రెస్‌ బృందం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన కేసీఆర్‌... దళితులపై చేయిపడితే ఊరుకునేది లేదని స్పష్టంచేశారు. బాధిత కుటుంబానికి పరిహారం ప్రకటించిన సీఎం... లాకప్‌డెత్‌ పూర్వాపరాలు తెలుసుకోవాలని డీజీపీని ఆదేశించారు.

cm kcr serious on mariyamma lockup death in addaguduru
cm kcr serious on mariyamma lockup death in addaguduru

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌ స్టేషన్‌లో మరియమ్మ అనే ఎస్సీ మహిళ మృతిచెందటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడకు చెందిన మరియమ్మ... యాదాద్రి జిల్లా గోవిందాపురంలో చర్చి పాస్టర్ బాలశౌరి ఇంట్లో వంటమనిషిగా పనిచేశారు. ఈనెల 3న ఆమె కుమారుడు ఉదయ్‌కిరణ్‌తో పాటు అతడి స్నేహితుడు శంకర్‌... గోవిందాపురం వచ్చారు. ఈనెల 5న ఫాదర్ పని మీద హైదరాబాద్ వెళ్లారు. మరుసటి రోజు వచ్చేసరికి... ఇంట్లో 2 లక్షలు మాయమైనట్లు గుర్తించారు. డబ్బుల విషయమై మరియమ్మను పాస్టర్‌ ప్రశ్నించారు. మర్నాడు మరియమ్మతోపాటు ఆమె కుమారుడు... రాత్రికి రాత్రే పరారయ్యారు. సొమ్ము పోయిందని అడ్డగూడురు పోలీస్ స్టేషన్‌లో ఫాదర్‌ ఫిర్యాదు చేశారు. కేసులో భాగంగా విచారణ చేపట్టిన పోలీసులు....ఈ నెల 18న మరియమ్మను పిలిపించారు. విచారణలో భాగంగా... ఆమె స్పృహ కోల్పోయిందని.... భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మరియమ్మ మృతిచెందటంతో పోలీసులే అమె మృతికి కారణమని ఆరోపణలు వచ్చాయి.

ఈ విషయాలన్నీ బయటకు తెలిస్తే ప్రమాదమని భావించిన పోలీసులు... భువనగిరి కేంద్రంగా వ్యవహారం నడిపారు. ఈనెల 19న ఠాణాలో కాకుండా... రహస్య ప్రదేశంలో ఉదయం నుంచే మంతనాలు సాగించారు. దొంగతనం జరిగిన 2 లక్షల్లో... 90 వేలను అప్పటికే స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో... మరియమ్మ ప్రాణాలు కోల్పోయింది. మరియమ్మ మృతితో ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేయటంతో... ఎస్సై మహేశ్‌, కానిస్టేబుళ్లు రషీద్, జానయ్యలను సస్పెండ్‌ చేస్తూ.... రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఎస్సీ మహిళ మృతిపట్ల ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. తెరాస పాలనలో ఎస్సీలు, గిరిజనులపై దాడులు పెరిగాయని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. వారి కుటుంబానికి ఆర్థికసాయం అందించాలని కోరారు.

ప్రజాసంఘాలు, విపక్షాల ఆందోళనతో... ఎస్సీ మహిళ మరియమ్మ లాకప్‌డెత్ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదన్నారు. మరియమ్మ కుమారుడు, కుమార్తెలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. కుమారుడు ఉదయ్‌కిరణ్‌కు ప్రభుత్వ ఉద్యోగం, నివాస గృహంతో పాటు... 15 లక్షల పరిహారం, మరియమ్మ ఇద్దరు కుమార్తెలకు చెరో 10 లక్షలు ఆర్థిక సాయంగా అందించాలని సీఎస్​ సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. కేసు పూర్వపరాలను తెలుసుకుని... అవసరమైతే బాధ్యులను ఉద్యోగం నుంచి తొలగించాలని సీఎం కేసీఆర్‌ డీజీపీని ఆదేశించారు.

మరియమ్మ కేసుకు సంబంధించి హైకోర్టుకు ఇప్పటికే న్యాయవిచారణ ఆదేశించింది. అడ్డగూడూరు ఠాణాలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని పోలీసులు నివేదికలో తెలిపారు. శుక్రవారం ఆలేరు జడ్జి న్యాయ విచారణకు వచ్చేలోపే.... హడావుడిగా పోలీస్‌స్టేషన్‌లో కెమెరాలను రిపేరు చేయించారు.

ఇదీ చూడండి: Cm Kcr: ఎస్సీల మీద చేయి పడితే ప్రభుత్వం ఊరుకోబోదు: సీఎం

ABOUT THE AUTHOR

...view details