తెలంగాణ

telangana

Superspeciality Hospital: వరంగల్​లో అత్యాధునిక వసతులతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి

By

Published : Dec 5, 2021, 3:32 AM IST

చారిత్రక నగరం ఓరుగల్లులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం దిశగా మరో ముందడుగు పడింది. 15 ఎకరాల్లో 24 అంతస్తుల్లో 1100 కోట్లతో నిర్మించనున్న భవనానికి సంబంధించి నిధుల విడుదలకు పరిపాలనా అనుమతులతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సాధ్యమైనంత త్వరగా పని ప్రారంభించాలని సంబంధిత శాఖలను ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశించారు. నిర్మాణం పూర్తైతే వరంగల్ జిల్లా ప్రజలకే కాకుండా పొరుగు జిల్లా వాసులకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Superspeciality Hospital: వరంగల్​లో అత్యాధునిక వసతులతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి
Superspeciality Hospital: వరంగల్​లో అత్యాధునిక వసతులతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి

Superspeciality Hospital: వరంగల్​లో అత్యాధునిక వసతులతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి

వరంగల్‌లో బహుళ అంతస్తుల సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే సంకల్పంతో ఈ ఏడాది జూన్ 21న జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్​ కేంద్రకారాగారం స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి భూమిపూజ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలందించేందుకు విదేశాల్లో మాదిరిగా హెలీ అంబులెన్స్ సేవలతో ఆసుపత్రిని నిర్మించనున్నారు. పూర్తి పర్యావరణ హితంగా నిర్మించనున్న ఆసుపత్రికి సంబంధించి.. 1100 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో నంబర్‌ 158ని విడుదల చేసింది. ఇందులో సివిల్ పనులకు రూ.509 కోట్లు, మంచినీరు, పారిశుద్ధ్యం కోసం రూ.20.36కోట్లు, మెకానికల్, విద్యుత్, ప్లంబింగ్ పనులకు 182.18కోట్లు, వైద్య పరికరాల కోసం 105కోట్లు, అనుబంధ పనుల కోసం 54.28కోట్లు, ఇతరత్రా పనుల కోసం 229.18 కోట్లు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పనులు వెంటనే చేపట్టాలని సంబంధిత శాఖలను ముఖ్యమంత్రి ఆదేశించారు.

15 ఎకరాల్లో రూ.1100 కోట్లతో నిర్మాణం

అత్యాధునిక వైద్యసదుపాయాలు, సూపర్ స్పెషాలిటీ సేవలతో వరంగల్‌లో హెల్త్ సిటీ నిర్మాణానికి ప్రభుత్వం 215.35 ఎకరాలు కేటాయించింది. అందులో 15 ఎకరాల్లో రూ.1100 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి నిధులు విడుదల చేస్తూ జీవో జారీచేసింది. 24 అంతస్తులతో 2 వేల పడకల సామర్థ్యంతో ఆసుపత్రిని నిర్మించనున్నారు. అందులో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఈఎన్​టీ, డెర్మటాలజీ, అర్ధోపెడిక్స్ మొదలైన స్పెషాలిటీ వైద్యం కోసం 1200 పడకలు కేటాయించనున్నారు. అంకాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, కార్డియాలజీ, గ్యాస్ట్ట్రో ఎంటరాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం 800 పడకలను కేటాయించనున్నారు. కిడ్నీ కాలేయం మొదలైన అవయవ మార్పిడి కోసం అన్ని సదుపాయాలూ ఉండేలా ఆసుపత్రిని అత్యాధునికంగా నిర్మించనున్నారు. కీమోథెరఫీ, రేడియేషన్ సౌకర్యాలతో అధునాతన క్యాన్సర్ కేంద్రాన్ని నిర్మించనున్నారు. వాటితోపాటు వైద్య విద్యార్థుల కోసం డెంటల్ కళాశాలలను ఏర్పాటు చేయనున్నారు.

మంత్రి ఎర్రబెల్లి హర్షం వ్యక్తం

సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి నిధులు విడుదల చేయడంపై పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్‌, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుకి కృతజ్ఞతలు తెలిపారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తైతే... కార్పొరేట్‌ వైద్యం ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అక్కడి ఆసుపత్రులపైనా భారం తగ్గుతుందని తెలిపారు. విద్య, వైద్యం, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీటవేస్తూ దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోందని గుర్తుచేశారు.

ఇదీ చదవండి:

Minister Puvvada ajay kumar: 'దేశంలోనే అతి పెద్ద వాహనాల తయారీ యూనిట్​లు తెలంగాణలో..'

ABOUT THE AUTHOR

...view details