తెలంగాణ

telangana

దీపావళి తర్వాత బతుకమ్మ వేడుకలు.. వందల ఏళ్లుగా ఇదే ఆచారం.. ఎక్కడంటే..?

By

Published : Oct 28, 2022, 4:27 PM IST

Bathukamma After Diwali In Sitampeta: బతుకమ్మ వేడుకలను దసరా రోజుల్లో జరుపుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే హనుమకొండ జిల్లా సీతంపేట గ్రామస్థులు మాత్రం దీపావళి తర్వాత బతుకమ్మ పండుగ నిర్వహించుకున్నారు. ఈ గ్రామంలోని నేతకాని సామాజిక వర్గానికి చెందిన వారు.. వందల ఏళ్ల నుంచి ఇదే ఆచారాన్నికొనసాగిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే మహిళలతో కలిసి పురుషులు సైతం బతుకమ్మ ఆడి సందడి చేశారు.

Bathukamma after Diwali in Sitampet
Bathukamma after Diwali in Sitampet

దీపావళి తరువాత బతుకమ్మ ఉత్సవాలు.. వందల ఏళ్లుగా ఇదే ఆచారం.. ఎక్కడంటే

Bathukamma After Diwali In Sitampeta: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకల సందడి అంతా ఇంతా కాదు. దసరా పండుగ రోజుల్లో జరిగే ఈ వేడుకకు ఊరూ వాడా కోలాహలంగా మారుతుంది. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో అదరగొడతారు. ఎంగిలి పూల బతకమ్మతో మొదలై, 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ పండుగ.. సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఆఖరి రోజు బతుకమ్మలను చెరువుల్లోనూ, కుంటల్లోనూ నిమజ్జనం చేయడంతో పండుగ పరిసమాప్తమవుతుంది.

అయితే హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం సీతంపేట నేతకాని సామాజిక వర్గం వారు మాత్రం అందరిలా కాకుండా దీపావళికి ఈ ఉత్సవాల్ని జరుపుకున్నారు. సీతంపేటలోని నేతకాని సామాజిక వర్గానికి చెందినవారికి శతాబ్దాలుగా దీపావళికి బతుకమ్మ వేడుకల్ని జరపటం ఆచారంగా వస్తుంది. దీపావళి నాడు కేదారేశ్వర వ్రతం చేయడంతో ఈ ఉత్సవం మొదలవుతుంది. ఇందులో భాగంగానే.. రెండోరోజున గ్రామస్తులంతా చెరువు నుంచి తీసుకొచ్చిన మట్టితో తయారు చేసిన ఎద్దుల ప్రతిమలు, నాగళ్లు తయారు చేసి.. పిండి వంటలను వాటికి అలంకరించి భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు కోలాటాలు ఆడుతూ బాణాసంచా కాల్చి నృత్యాలు చేస్తూ సందడి చేశారు. తరతరాలుగా ఇలానే ఉత్సవాలను నిర్వహిస్తున్నామని.. ఇలా చేయటం వల్ల తమ గ్రామమంతా ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. మగవాళ్లు సైతం మహిళలతో కలసి బతుకమ్మలాడటం ఇక్కడి విశేషం. బతుకమ్మ ఆటపాటల అనంతరం ఇళ్లలో పూజలు చేయడంతో పండుగ పరిసమాప్తమవుతుంది.

ABOUT THE AUTHOR

...view details