తెలంగాణ

telangana

మద్దతు మాయం .. మిల్లర్లు, వ్యాపారుల మాయాజాలం

By

Published : Apr 10, 2022, 8:12 AM IST

Updated : Apr 10, 2022, 8:35 AM IST

FARMERS PROTEST: ధాన్యం రైతులు దోపిడీకి గురవుతున్నారు. కనీస మద్దతు ధర కాగితాలకే పరిమితమైంది. కేంద్రం బియ్యం తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఆందోళనలు చేస్తుంటే... సందట్లో సడేమియా అన్నట్లు మిల్లర్లు, వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారు.

FARMERS PROTEST
రైతుల ఆందోళన

సూర్యాపేటలో శనివారం మిల్లర్లు, వ్యాపారులు ఒక్కసారిగా ధాన్యం కొనుగోలు ధరను తగ్గించడంతో రైతులు ఆందోళన చేపట్టారు. ఎట్టకేలకు కలెక్టర్‌ వచ్చి పరిస్థితిని సర్దుబాటు చేయాల్సి వచ్చింది. ప్రస్తుత యాసంగిలో ఉమ్మడి నిజామాబాద్‌, నల్గొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ధాన్యం విక్రయానికి వచ్చాయి. ఆ జిల్లాల్లో పండే ధాన్యం అత్యధికం సన్న రకమే. వీటికి డిమాండ్‌ ఉండడంతో అధిక మొత్తం ధాన్యాన్ని వ్యాపారులే కొంటారు. కనీస మద్దతు ధర కన్నా ఎక్కువ మొత్తానికి కొనుగోలు చేసిన సందర్భాలూ ఉన్నాయి.

గత కొద్ది రోజులుగా ఆ రెండు జిల్లాల్లో మిల్లర్లు క్వింటా ధాన్యం రూ. 1,300 - 1,500 మధ్య కొనుగోలు చేస్తున్నారు. సూర్యాపేట మార్కెట్‌లో శుక్రవారం క్వింటా రూ. 1,850 - 1,900కు కొనుగోలు చేశారు. శనివారం ధరను అమాంతం రూ. 1,250గా నిర్ణయించటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర రూ. 1,960 ఉన్న ఈ సీజన్లో ఒక్క క్వింటా కొన్న దాఖలాలు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

త్వరలో మరింత దిగుబడి

ఈ నెల మూడో వారం నుంచి ఇతర జిల్లాల్లోనూ వరికోతలు ఊపందుకుంటాయి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో మిల్లర్లు, వ్యాపారులతో సంప్రదింపులు జరుపుతున్న ప్రభుత్వం తన నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. ధాన్యం కొనుగోలుకు వీలుగా నిర్ణయం తీసుకున్నా అందుకు అవసరమైనవి సమకూర్చుకోవటానికి మరింత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈసారి సుమారు 70 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు.

సన్నాలు, విత్తనాలు, రైతుల అవసరాలకు పోను కనీసం 40 లక్షల టన్నుల వరకు మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉంది. అదంతా కొనాలంటే పది కోట్ల వరకు గోనె సంచులు కావాలి. ప్రస్తుతం 15 నుంచి 20 శాతం సంచులే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. మిగిలిన సంచులను సమకూర్చుకోవటంపై కూడా అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు.

రీ టెండర్‌ చేయించిన కలెక్టర్‌

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారులు శనివారం ధాన్యం ధరను అమాంతం తగ్గించడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కరోజులోనే ధరను క్వింటాకు రూ.1250కి తగ్గించేయడమేంటని ఆందోళనకు దిగారు. తొలుత కొద్దిమంది రైతులు మార్కెట్‌ కార్యదర్శి ఛాంబర్‌కు వచ్చి ఆందోళన చేశారు. రూ. వంద అదనంగా పెంచుతామని చెప్పడంతో వారు వెళ్లిపోయారు. తర్వాత మరికొందరు రైతులు కార్యదర్శి ఛాంబర్‌కు వచ్చి మద్దతు ధర ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కార్యాలయం ఎదుట బైఠాయించారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పినా ధర్నా విరమించలేదు. కాంటాలు, యంత్రాలను రైతులు ధ్వంసం చేశారు. హమాలీలు, దడువాయిలపై ఆగ్రహం వ్యక్తం చేసి మార్కెట్‌ నుంచి బయటికి పంపేశారు. సూర్యాపేట కలెక్టర్‌ బి.వినయ్‌కృష్ణారెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ మోహన్‌రావు అక్కడికి చేరుకుని మిల్లర్లు, రైతులతో చర్చించారు. అనంతరం.. ధరలు తక్కువగా వచ్చాయని, రీటెండర్‌కు కాల్‌ చేయాలని కలెక్టర్‌ ఆదేశించడంతో రైతులు ధర్నాను విరమించారు. రీటెండర్‌లో ధాన్యం ధర క్వింటాకు రూ.1400కు తగ్గకుండా చూడాలని, తేమ శాతం తక్కువ ఉన్న ధాన్యానికి మంచి ధర ఇవ్వాలని వ్యాపారులను కలెక్టర్‌ ఆదేశించారు. రీ టెండర్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆయన మార్కెట్‌లోనే ఉన్నారు.

ఇదీ చదవండి: Minister Gangula Kamalakar: 'కేంద్రం ధాన్యం కొనే వరకు పోరాటం ఆగదు'

Last Updated : Apr 10, 2022, 8:35 AM IST

ABOUT THE AUTHOR

...view details