తెలంగాణ

telangana

'గౌరవెల్లి నిర్వాసితులు ప్రతిపక్షాల మాయలో పడొద్దు'

By

Published : Jun 15, 2022, 4:11 PM IST

Gauravelli Project Issue: గౌరవెల్లి నిర్వాసితులు ప్రతిపక్షాల మాయలో పడొద్దని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు సూచించారు. ప్రాజెక్ట్ నిర్వాసితుల ఆందోళనపై మంత్రి స్పందించారు. భూ నిర్వాసితులకు ప్రభుత్వం ఎప్పుడు అన్యాయం చేయదని భరోసా ఇచ్చారు.

Harish
Harish

Gauravelli Project Issue: గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు న్యాయబద్ధంగా చెల్లించాల్సిన పరిహారం... 98 శాతం మందికి ఇచ్చేశామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు వెల్లడించారు. కాంగ్రెస్‌, భాజపా నేతల అత్యుత్సాహం వల్లే... హుస్నాబాద్‌లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యానించారు. ఇంజినీర్లు ట్రయల్‌ రన్‌ నిర్వహించేందుకు వెళితే ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. వారిపై దాడి చేయడంతోనే పోలీసులు కలుగజేసుకున్నారని తెలిపారు. భూ నిర్వాసితులతో ఎన్నిసార్లైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్న హరీశ్‌.. వారికి అన్యాయం చేయబోమని స్పష్టం చేశారు.

హుస్నాబాద్ రైతులకు నీళ్లు రావొద్దని ప్రతిపక్షాల కుట్ర చేస్తున్నాయి. కాంగ్రెస్, భాజపాలు రాజకీయ లబ్దికి ప్రయత్నిస్తున్నాయి. నాడు మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌ను అడ్డుకున్నారు. గౌరవెల్లి నిర్వాసితులు ప్రతిపక్షాల మాయలో పడొద్దు. 2013 చట్టం ప్రకారం ప్రతి నిర్వాసితుడికి న్యాయం చేస్తాం. 3,816 ఎకరాల భూ సేకరణ పూర్తి, 84 ఎకరాలే మిగిలింది. గౌరవెల్లి నిర్వాసితులకు ఎకరానికి రూ.15 లక్షల పరిహారం ఇస్తున్నాం. ఆర్‌అండ్ ఆర్ ప్యాకేజీకి 937 కుటుంబాలను గుర్తించాం. -- మంత్రి హరీశ్‌రావు

ముఖ్యమంత్రి కేసీఆర్​కు, ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును తట్టుకోలేక కాంగ్రెస్, భాజపా ఇలాంటి పనులు చేస్తున్నారని హరీశ్​రావు ఆరోపించారు. కోర్టులో కేసులు పెట్టి, నిర్వాసితులను రెచ్చగొడుతున్నారన్నారు. పోలీసులు, బాధితులకు పెనుగులాటలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయని అందుకు విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు. భూనిర్వాసితులకు ప్రభుత్వం ఎప్పుడు ఇబ్బంది చేయలేదని... భూనిర్వాసితులు కాంగ్రెస్, భాజపా వలలో పడవద్దని మంత్రి కోరారు.

'గౌరవెల్లి నిర్వాసితులు ప్రతిపక్షాల మాయలో పడొద్దు'

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details