తెలంగాణ

telangana

నత్తనడకన నిర్మాణం.. ఆ పల్లెవాసులకు శాపం

By

Published : Nov 8, 2021, 5:21 AM IST

ఆ గ్రామస్థులు చేనుకు పోవాలంటే నిత్యం ప్రాణసంకటమే. పొలానికి వెళ్లిన వ్యక్తి ఇంటికి వచ్చేదాకా అనుమానమే. ఊరికి చేలకు మధ్య ఉన్న వాగు మీద వంతెన నిర్మాణం మూడేళ్లుగా నత్తనడకన సాగడం పల్లెవాసులకు శాపంగా మారింది. దినదినగండంగా బతుకులీడుస్తున్న సంగారెడ్డి జిల్లాలోని రైతుల వ్యథపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

pipad pally village
pipad pally village

నత్తనడకన నిర్మాణం.. ఆ పల్లెవాసులకు శాపం

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పీపడ్‌పల్లి గ్రామానికి వ్యవసాయ భూములకు మధ్య వాగు ఉంది. ఏటి అవతల గ్రామానికి చెందిన 500 ఎకరాల సాగు భూమి ఉంది. గతంలో ఈ వాగులో పెద్దగా నీళ్లు లేకపోవడం వల్ల రైతులకు ఇబ్బందులు ఉండేవి కావు. సింగూర్ ప్రాజెక్టు నిర్మాణం తర్వాత బ్యాక్ వాటర్ చేరడం వల్ల అన్నదాతలకు సమస్యలు మొదలయ్యాయి.

ప్రాణాలు అరచేత పట్టుకొని..

రైతులు చేన్లకు పోవాలంటే వంద మీటర్ల వెడల్పుతో ఉండే ఈ వాగును ప్రాణాలు అరచేత పట్టుకొని దాటాల్సిందే. థర్మాకోల్ తెప్పలపై మహిళలు, చిన్నారులు భయం భయంగా వాగు దాటి సాహస ప్రయాణమే చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో రైతులు నీళ్లలో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటీవల కాశీనాథ్ అనే రైతు నీటిలో మునిగి చనిపోయాడు.

ఎన్నో వ్యయ ప్రయాసలు..

వాగు దాటేందుకు రైతులే సొంతంగా ఐదు వేలు ఖర్చుచేసి థర్మకోల్ షీట్లు, కర్రలు, తాళ్లతో తెప్పలు తయారీ చేసి ఉపయోగిస్తున్నారు. వర్షాకాలంలో వరద వస్తే తెప్పలు కొట్టుకుపోవడం మరింత భారంగా మారుతోంది. వాహనాలపై వెళ్లాలంటే చుట్టూ తిరిగి 23 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే. పంట ఉత్పత్తులను ఇంటికి చేర్చాలన్నా ఎన్నో వ్యయ ప్రయాసలు పడాల్సివస్తోంది.

2018లో వంతెన నిర్మాణానికి పునాది.. కానీ..

దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించేలా 2018లో వంతెన నిర్మాణానికి పునాది పడింది. గుత్తేదారు నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వంతో వంతెన నిర్మాణం పిల్లర్ల దశను దాటలేదు. ఈ వంతెన పూర్తయితే పీపడ్‌పల్లి సహా చుట్టూ 12 ఊర్ల జనానికి ప్రయోజనం. మెదక్‌ వెళ్లేందుకు 15 కిలోమీటర్ల దూర భారమూ తగ్గుతుంది.

తమ ప్రాణాలు పోతున్నా అధికారుల్లో చలనం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా త్వరితగతిన వంతెన నిర్మాణం పూర్తిచేసి కష్టాలు తీర్చాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.

ఇదీచూడండి:Revanth Comments: ప్రజలను దోచుకోవడంలో కేసీఆర్, మోదీ ఇద్దరూ ఇద్దరే

ABOUT THE AUTHOR

...view details