తెలంగాణ

telangana

సంగారెడ్డి జిల్లాలో పేదల భూములపై క్రషర్​ వ్యాపారుల కబంధహస్తం

By

Published : Apr 5, 2023, 2:23 PM IST

Illegal crushers in sangareddy district: రెక్కాడితే కానీ డొక్కాడని పేదలు, కాయకష్టం చేసుకుని బతికే బడుగు జీవులకు ప్రభుత్వం జీవనోపాధి కోసం వ్యవసాయ భూమిని కేటాయించింది. సాక్షాత్తు అప్పటి ప్రధానమంత్రే వారికి పట్టాలు అందించారు. ఆ భూమిలో రాళ్లు, రప్పలు ఉన్నా.. నెలల తరబడి శ్రమించి, ఆ భూములను సాగుకు అనుకూలంగా మార్చుకున్నారు. పేద కుటుంబాలకు భరోసాగా ఉన్న ఆ భూములపై క్రషర్ యజమానుల కళ్లు పడడంతో ఆ భూములు వాళ్ల చెరలో చిక్కాయి.

క్రషర్
క్రషర్

సంగారెడ్డి జిల్లాలో పేదల భూములపై క్రషర్​ వ్యాపారుల కబంధహస్తం

Illegal crushers in sangareddy district: సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎర్థనూర్ గ్రామంలో సర్వే నెంబర్లు 231, 259 పరిధిలో 800 ఎకరాలకు పైగా భూమి ఉంది. ఇందులో సగం ప్రభుత్వ భూమి. ఈ భూమిలో కొంత భాగాన్ని భూమిలేని నిరుపేదలు దశాబ్దాలుగా సాగు చేసుకుని జీవిస్తున్నారు. వీరితో పాటు గ్రామంలోని నిరుపేదలకు అధికారులు ప్రభుత్వం ఈ భూమిని కేటాయించింది. 2005లో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ చేతుల మీదుగా ఈ భూమి కేటాయింపు పత్రాల్ని లబ్ధిదారులకు అందించారు. నాటి నుంచి తమకు కేటాయించిన భూముల్లో లబ్దిదారులు పంటలు పండిస్తున్నారు.

ఈ భూముల చుట్టూ బండలు, కొండలు ఉండటంతో క్రషర్ వ్యాపారులు ఈ సర్వే నెంబర్ల పరిధిలోని కొంత పట్టా భూములు కొనుగోలు చేశారు. తాము కోనుగోలు చేసిన పట్టా భూముల్లో క్రషర్ ఏర్పాటుకు అనుమతులు తీసుకున్నారు. అయితే... క్వారీ తవ్వకాలు, క్రషర్ల ఏర్పాటంతా అసైన్డ్ భూముల్లోనే సాగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు.

క్రషర్ వ్యాపారులు సంవత్సరానికి 2 నుంచి 6లక్షల రూపాయల వరకు లీజు చెల్లిస్తామంటూ 231, 259 సర్వే నెంబర్ల పరిధిలోని కొంతమంది అసైన్డ్ రైతులకు ఆశ చూపారు. కొంతమంది డబ్బు తీసుకుని లీజు ఒప్పందాలు చేసుకోగా... చాలా మంది రైతులు తిరస్కరించారు. లీజుకు ఇచ్చిన వారికి కూడా నామమాత్రంగానే లీజు చెల్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. రైతులు తమ భూముల్లో తవ్వకాలు జరగకుండా అడ్డుకోవడంతో.. క్రషర్ల యజమానులు రాత్రి వేళల్లో దొంగచాటుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని విమర్శిస్తున్నారు. పెద్దపెద్ద యంత్రాలతో, భారీ పేలుళ్లతో తెల్లవారే సరికి తవ్వకాలు జరిపి.. గోతులు తవ్వారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సర్వే నెంబర్ల పరిధిలో కొంతమంది రైతులు మూడునాలుగు తరాలుగా సాగు చేసుకుంటున్నారు. దీంతో వారి పేర్లు కాస్రా పహాణీలో నమోదై ఉన్నాయి. అలా కాస్రా పహాణీలో పేర్లున్న అసైన్డ్ రైతులు తమ భూములను అమ్ముకునేందుకు వీలుంది. దీన్ని అవకాశంగా తీసుకున్న క్రషర్ల వ్యాపారులు.. ఆ రైతులకు తెలియకుండానే వారి పేరుతో ఉన్నతాధికారుల నుంచి నిరభ్యంతర పత్రాలు పొందారన్న ఆరోపణలు వస్తున్నాయి.

లీజు రిజిస్ట్రేషన్ పేరుతో భూములను క్రషర్ల యజమానులు తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారి రైతులు ఆరోపిస్తున్నారు. ఇటీవల భూమి యజమాని చనిపోవడంతో.. పేరు మార్పించుకునేందుకు కుటుంబ సభ్యులు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

క్రషర్ల నిర్వాహకులు ఈ సర్వే నెంబర్ల పరిధిలోని చెరువులు, కుంటలను సైతం ధ్వసం చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే... రైతులకు కేటాయించిన భూములను క్రషర్లకు కేటాయించ లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అధికారులు స్పందించి, క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చెయ్యాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details