తెలంగాణ

telangana

BANDI SANJAY PADAYATRA: ఈటల రాజేందర్​ గెలుపు ఖాయం: బండి

By

Published : Sep 1, 2021, 9:41 PM IST

Updated : Sep 1, 2021, 10:27 PM IST

హుజూరాబాద్​లో ఈటల రాజేందర్​ గెలుపు ఖాయమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో పర్యటించారు.

BANDI SANJAY
బండి సంజయ్​

తెలంగాణకు ప్రధాని ఆవాస్‌ యోజన కింద 70 వేల ఇళ్లు ఇచ్చామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. గ్రామీణ సడక్‌ యోజన కింద చేవెళ్ల-మల్కాపూర్‌ వరకు రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. తెలంగాణ అభివృద్ధి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. తెరాస నాయకులు 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారని.. ఎక్కడ ఇచ్చారో చెప్పాలని డిమాండ్​ చేశారు. పీజీ, పీహెచ్​డీ చేసి ఉద్యోగం కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని చెప్పారు.

రైతుల భూములు గుంజుకుంటున్నారని ఆరోపించారు. రైతులు కన్నీరు పెడుతున్నారని బండి సంజయ్​ ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడిని సీఎం చేస్తానని చేయలేదు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని ఇవ్వలేదు. అంబేడ్కర్​ విగ్రహం పెడతామని పెట్టలేదని బండి గుర్తు చేశారు. అంబేడ్కర్ పుట్టిన స్థలం, చదుకువున్న స్థలం, దీక్షాభూమిని పంచతీర్థం పేరుతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. చేవెళ్ల అభివృద్ధి బస్టాండ్​ను చూస్తే తెలుస్తుందన్నారు. కేసీఆర్​ తలకాయ కిందికి.. కాళ్లు పైకి పట్టినా హుజూరాబాద్​లో ఈటల రాజేందర్​ గెలుపు ఖాయమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు.

దిల్లీలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తుంటే జెండాలు ఎగరేసుడేందోనని ఎద్దేవా చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ డిజైన్, రి డిజైన్ చేసినా చేవెళ్లకు నీళ్లు రాలేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్​ ఫామ్ హౌస్​లో పడుకునుడే తప్ప... చేసిందేమీ లేదన్నారు. హిందూ దేవుళ్లను కించపరిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. ఇవాళ దిల్లీకి వెళ్లిన కేసీఆర్ మళ్లీ ఎన్ని కోతలు కొస్తాడో చూడాలన్నారు. దిల్లీ వెళ్లి వంగివంగి దండాలు పెట్టి.. మోదీ శభాష్ కేసీఆర్ అని మెచ్చుకున్నారని ప్రచారం చేసుకుంటాడని ఎద్దేవా చేశారు. మోదీ కేసీఆర్​ను ఎప్పుడైనా శభాష్ అని అంటాడా అని బండి ప్రశ్నించారు.

రంగారెడ్డి జిల్లాకు రూ.1040 కోట్లు ఇచ్చాం. చేవెళ్లకు 280 కోట్లు ఇచ్చాం. తెలంగాణకు ప్రధాని ఆవాస్‌ యోజన కింద 70 వేల ఇళ్లు ఇచ్చాం. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాం. గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద రేషన్‌ బియ్యం ఇచ్చాం. కంపా పథకం కింద హరితహారం కార్యక్రమానికి నిధులు ఇచ్చాం. కమ్యూనిటీ హాళ్లు, రైతు వేదికల నిర్మాణానికి నిధులు ఇచ్చాం. రోడ్లు, వీధి లైట్లు, నీళ్లు, మురుగునీటి కాలువలకు నిధులు మంజూరు చేశారు. చివరికి శ్మశానవాటికకు కూడా నిధులు ఇచ్చాం. గ్రామీణ సడక్‌ యోజన కింద చేవెళ్ల-మల్కాపూర్‌ వరకు రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు.

-బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఈటల రాజేందర్​ గెలుపు ఖాయం: బండి సంజయ్​

ఇదీ చదవండి: KRMB MEETING: కేఆర్ఎంబీ సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్

Last Updated : Sep 1, 2021, 10:27 PM IST

ABOUT THE AUTHOR

...view details