KTR Speech at Rajanna Sircilla District : తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాల వారిని కడుపులో పెట్టుకొని చూసుకుంటోందని మంత్రి కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్... పనికివచ్చే సర్కార్‌నే గుర్తు పెట్టుకోవాలని ప్రజలను కోరారు. గతంలో సిరిసిల్లకు వస్తే చుక్క నీరు కనిపించక పోయేదని.. కానీ ఇప్పుడు పాపికొండలు, కోనసీమను తలదన్నే విధంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. మరోవైపు మధ్యమానేరులో మత్స్య సంపదను పెంచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వివరించారు.
పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తమ ప్రాంతాన్ని మెచ్చుకొంటుంటే.. తన గుండె సంతోషంతో నిండిపోతుందని కేటీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే టాటాలు, బిర్లాలే కాదు.. తాతల నాటి కులవృత్తులు కూడా బతకాలన్నది.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశమని అన్నారు. సిరిసిల్లతో పాటు జిల్లా మండల కేంద్రాల్లోనూ నీరా కేఫ్‌లు (Neera Cafe) ఏర్పాటు చేయాలని శ్రీనివాస్ గౌడ్‌ను కోరుతున్నానని చెప్పారు. గీత కార్మికులు చెట్టుపై నుంచి పడి గాయాలపాలు కాకుండా సేఫ్టీ మోకులు అందజేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఉమ్మడి రాష్ట్రంలో గౌడ వృత్తిదారులకు ఎన్నో వేధింపులు ఉండేవని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అలాంటివి ఏమీ లేవని పేర్కొన్నారు. గీతకార్మికుల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని.. వారికి సేఫ్టీ మోకులు అందజేస్తామని వివరించారు. ఇందులో భాగంగానే నీరా కేఫ్‌లు ఏర్పాటు చేస్తున్నామని.. అంతేకాకుండా మరిన్ని ఉపాధి సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ట్యాంక్‌బండ్‌పై రూ.3 కోట్లతో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని శ్రీనివాస్‌గౌడ్ తెలియజేశారు.
అంతకుముందుకేటీఆర్.. సిరిసిల్లలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మధ్యమానేరు జలాశయంలో బోటింగ్ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మధ్యమానేరు జలాశయ అందాన్ని వీక్షిద్దామంటూ.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు.. కలెక్టర్ అనురాగ్‌జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్‌లను... తన బోటులోకి ఎక్కించుకొని కేటీఆర్ చక్కర్లు కొట్టారు.