తెలంగాణ

telangana

ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్​

By

Published : May 24, 2021, 3:20 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని సామాజిక వైద్యశాలను పెద్దపల్లి జిల్లా కలెక్టర్​ సంగీత సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి పరిస్థితులు, కరోనా కేసుల పెరుగుదల తదితర వివరాలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

collector sudden visit
ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్​

పెద్దపల్లి జిల్లా మంథనిలోని ప్రభుత్వ సామాజిక వైద్యశాలను ఈ రోజు మధ్యాహ్నం జిల్లా పాలనాధికారి సంగీత సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులతో కలిసి వైద్యశాలలో కలియ తిరుగుతూ పరిశీలించారు. కొవిడ్ నియంత్రణలో భాగంగా అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. స్థానిక కరోనా పరిస్థితులు, రోజు కరోనా కేసులు ఎన్ని నమోదు అవుతున్నాయి, సరిపడా మందులు ఉన్నాయా తదితర విషయాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి పరిసరాల్లో చెత్తాచెదారం తొలగించి వెంటనే శుభ్రం చేయాలని వైద్యులకు సూచించారు.

కరోనా నియంత్రణలో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని అన్ని ఆస్పత్రులను పరిశీలిస్తున్నామని… అందులో భాగంగానే మంథనికి రావడం జరిగిందని కలెక్టర్​ తెలిపారు. వైద్యశాలలో వసతులన్నీ బాగున్నాయని అన్నారు. ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలు, వీఆర్ఏ, పంచాయతీ సెక్రెటరీ ప్రత్యేకంగా ఒక టీమ్​గా ఏర్పడి.. క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి కరోనా వ్యాధి గురించి వివరాలు తెలుసుకుని వైద్యం అందిస్తు, జాగ్రత్తలు చెబుతున్నారని పేర్కొన్నారు.

పెద్దపల్లి జిల్లాలో మొదటి విడతలో రెండు లక్షల 20 వేల ఇళ్లు పరిశీలించామని, రెండో సర్వే ప్రారంభించామని పాలనాధికారి చెప్పారు. జిల్లాలో ఐసోలేషన్ సెంటర్లను పెద్దపల్లి, గోదావరిఖని, మంథని, ధర్మారంలో ప్రారంభించామని… కరోనా వ్యాధిగ్రస్తులు ఇళ్లలో ఇబ్బంది కలిగిన వారు ఆ కేంద్రాలను ఉపయోగించుకోవచ్చని సూచించారు. ఏవైనా గ్రామాల్లో ఎక్కువగా కరోనా కేసులు ఉంటే… అక్కడే ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేసి వైద్యసేవలు అందిస్తామని వెల్లడించారు.

పెద్దపల్లి జిల్లాలో బ్లాక్ ఫంగస్​ కేసు ఒకటి నమోదైందని, తగు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్​ వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యశాలలో పని చేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది, కార్మికులు జీతాలు సరిగా ఇవ్వడం లేదని కలెక్టర్​కు విన్నవించుకున్నారు. వెంటనే ఆమె సూపరింటెండెంట్​తో మాట్లాడి సమస్యలు పరిష్కారం చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:ఎంజీఎంలో రెమిడెసివిర్‌ ఇంజెక్షన్ల అక్రమాలపై విచారణకు ఆదేశం

ABOUT THE AUTHOR

...view details