తెలంగాణ

telangana

సమస్యలకు కేరాఫ్ అడ్రస్​​గా మారిన తెలంగాణ యూనివర్సిటీ

By

Published : Apr 3, 2023, 2:24 PM IST

Telangana University

girls hostel Problems in telangana university : తెలంగాణ విశ్వవిద్యాలయం సమస్యలకు మారుపేరుగా మారింది. వర్సిటీ ఏర్పాటై దశాబ్ధంన్నర గడిచినా వెతలు తీరడం లేదు. బాలికల వసతి గృహంలో విద్యార్థినిల సమస్యలు అంతకంతకూ అధికమవుతున్నాయి. వసతి కోసం గతంలో విద్యార్థినిలే ఆందోళన చేసినా.. పరిష్కారం మాత్రం చూపడం లేదు. వసతుల లేమితో పాటు ఇరుకు గదుల్లో విద్యార్థినిలు కాలం వెల్లదీయాల్సి వస్తోంది. కనీస మరమ్మతులు చేయడంతో పాటు ఫ్యాన్లు బిగించాలని, వైఫై సౌకర్యం కల్పించాలని విద్యార్థినిలు కోరుతున్నారు.

girls hostel Problems in telangana university : తెలంగాణ యూనివర్సిటీలో వసతుల సమస్య తలనొప్పిగా మారింది. అమ్మాయిల సంఖ్యకు అనుగుణంగా వర్సిటీలో వసతులు కల్పించడంలో అధికారులు చేతులు ఎత్తేశారు. ఒక్కొక్క గదిలో పది మంది విద్యార్థినిలను ఉంచడంతో ఇరుకు గదుల్లో ఉండలేక చెప్పుకోలేని బాధ అనుభవిస్తున్నారు.

350 మంది ఉండాల్సిన హాస్టల్​లో 600 విద్యార్థినిలు..:నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం 2006లో రెండు పీజీ కోర్సులతో ప్రారంభమై ప్రస్తుతం 30 కోర్సులతో 2 వేల మంది విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. ఇందుకు గానూ మూడు వసతి గృహాలను నిర్మించారు. అబ్బాయిలకు రెండు ఉండగా.. అమ్మాయిలకు ఒక్కటే హాస్టల్ అందుబాటులో ఉంది. 350 మంది విద్యార్థినిలు ఉండే వసతి గృహంలో ప్రస్తుతం 600 మంది వసతి పొందుతున్నారు. ఒక్కో గదిలో పది నుంచి 12 మంది సర్దుకోవాల్సి వస్తుంది. పరిమితికి మించి అమ్మాయిలు హాస్టల్లో ఉంటున్నారు. మరో హాస్టల్ బాలికల కోసం నిర్మించాలని ప్రతిపాదన ఉన్నా.. అధికారులు దృష్టి సారించడం లేదు. యూనివర్సిటీలో అన్ని వసతులు ఉంటాయని అనుకొని వస్తే అన్నీ సమస్యలే ఉన్నాయని కొత్తగా చేరిన విద్యార్థినిలు పేర్కొంటున్నారు.

నాణ్యమైన భోజనం అందించట్లేదు:బాలికల వసతి గృహం కోసం ఎన్నో రోజుల నుంచి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులు గతంలో ఆందోళన చేశారు. సంఖ్య పెరిగినప్పటి నుంచీ అదనపు వసతి గృహం కోసం విద్యార్థినిల నుంచి డిమాండ్ ఉన్నా ప్రతిపాదనల దశకే అధికారులు పరిమితం చేస్తున్నారు. ప్రతిపాదనలు పంపామంటూ.. నిర్మిస్తామంటూ కాలయాపన చేస్తున్నారు. కనీసం నాణ్యమైన భోజనం అందించడం లేదని విద్యార్థినిలు పేర్కొంటున్నారు. వసతి గృహ తనిఖీకి వార్డెన్ ఇటువైపు కూడా రావడం లేదని అమ్మాయిలు ఆరోపిస్తున్నారు. నూతన వసతి గృహం నిర్మించేంత వరకైనా ప్రస్తుత హాస్టల్ ను బాగుపరచాలని.. కిటికీలు, తలుపులు బాగు చేయాలని, గదుల్లో ఫ్యాన్స్ సౌకర్యం, వైఫై సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

"తెలంగాణ యూనివర్సిటీలో ఒకటే బాలికల హాస్టల్​ ఉంది. ఇందులో సుమారు 600 నుంచి 800 మంది విద్యార్థినిలం ఉంటున్నాం. ఒక్కో రూమ్​లో 6, 7 మంది ఉంటున్నాం. మంచి ఆహారం లేనందున ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కచ్చితంగా ఇంకో హాస్టల్​ నిర్మించమని కోరుతున్నాం. చిన్న చిన్న సమస్యలు చాలానే ఉన్నాయి. ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరించమని కోరుతున్నాం."- జయంతి, విద్యార్థిని

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details