తెలంగాణ

telangana

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. 26 మందిపై కేసు.. నలుగురు అదుపులోకి..

By

Published : Sep 18, 2022, 9:58 PM IST

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. 26 మందిపై కేసు.. నలుగురు అదుపులోకి..

NIA Searches in PFI case: తెలుగు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు కలకలం రేపాయి. పాపులర్​ ఫ్రంట్​ ఆఫ్​ ఇండియా కేసులో.. తెలుగు రాష్ట్రాల్లో 40 చోట్ల అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఉగ్రమూలాలు ఉన్నాయనే కోణంలో దేశవ్యాప్తంగా పీఎఫ్​ఐ శిక్షణా కార్యక్రమాలపై నిఘా పెట్టిన అధికారులు.. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో 26 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. 26 మందిపై కేసు.. నలుగురు అదుపులోకి..

NIA Searches in PFI case: ఉగ్రమూలాలు ఉన్నాయనే అనుమానంతో పాపులర్​ ఫ్రంట్​ ఆఫ్​ ఇండియా సంస్థ శిక్షణా కార్యక్రమాలపై దృష్టి పెట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రంలో 38 చోట్ల సోదాలు చేశారు. హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. హైదరాబాద్​లోని నాలుగు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. సూరారం సాయిబాబా నగర్​లోని జమీయ తలిముల్ఇస్లాం మదరసాలో సోదాలు నిర్వహించారు. కంప్యూటర్ హార్డ్​డిస్క్​లు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఉపాధ్యాయుడిని పీఎఫ్ఐ సభ్యుడిగా గుర్తించి.. అతడి సెల్​ఫోన్​ స్వాధీనం చేసుకున్నారు.

నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా 23 చోట్ల జల్లెడ పట్టారు. నగరంలోని కంఠేశ్వర్​కు చెందిన ఓ వ్యక్తిని.. ఈ నెల 19న విచారణకు హాజరుకావాలని నోటీసులు అందించారు. ఎడపల్లి మండలం ఎమ్మెస్సీ ఫారంలో ఓ యువకుడి ఇంట్లో సోదాలు చేపట్టి.. రెండు చరవాణులు, పాస్​పోర్టు, బ్యాంకు ఖాతా పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోనూ దాడులు జరిగాయి. ఆదిలాబాద్ పట్టణం శాంతినగర్ కాలనీలో ఓ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్​ నుంచి వచ్చి కొంతకాలంగా నివాసం ఉంటున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిర్మల్​ జిల్లాలోనూ రెండుచోట్ల విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. భైంసాలోని మదీనా కాలనీలో కొందరి ఇళ్లలో సోదాలు నిర్వహించి పీఎఫ్​ఐ సంస్థ శిక్షణ కార్యక్రమాలపై ఆరా తీశారు.

జగిత్యాల జిల్లాలో భారీ భద్రత నడుమ ఏడుచోట్ల ఏకకాలంలో ఎన్​ఐఏ సోదాలు జరిపింది. టవర్ సర్కిల్​లోని కేర్​ మెడికల్​లో తనిఖీలు చేపట్టేందుకు నాలుగు వాహనాల్లో అధికారులు వచ్చారు. దుకాణం తాళాలు పగులకొడుతుండగా మహిళలు అడ్డుకున్నారు. స్థానిక పోలీసుల సహకారంతో యజమానిని పిలిపించి తాళం తెరిపించారు. అనంతరం దుకాణంలోని సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించారు. అనుమానితుల ఇళ్లలోనూ తనిఖీలు చేశారు. వారి నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్​లోనూ ఓ ప్రాంతంలో సోదాలు నిర్వహించారు. ఉగ్రమూలాలు ఉన్నాయనే ఆధారాలతో సోదాలు చేపట్టడం కలకలం రేపింది.

ఏపీలోని ఆ రెండు జిల్లాల్లోనూ..: ఇక ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోనూ జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంనకు చెందిన ఇలియాస్.. అతడి మిత్రుల ఇళ్లలో సోదాలు చేశారు. తనిఖీల కోసం వచ్చిన అధికారులను ఇలియాస్ బంధువులు, మిత్రులు అడ్డుకోగా.. పోలీసులు వారికి నచ్చజెప్పారు. ఎన్​ఐఏ అధికారులు అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేసి సెల్​ఫోన్​, డైరీ స్వాధీనం చేసుకున్నారు. ఇలియాస్ రెండు నెలలుగా కనిపించడం లేదని కుటుంబసభ్యులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

నంద్యాలలో సోషల్ డెమాక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యుల నివాసాల్లో ఎన్​ఐఏ తనిఖీలు నిర్వహించింది. సోదాలకు వ్యతిరేకంగా.. కొందరు ఆందోళనకారులు నినాదాలు చేయగా.. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

పీఎఫ్​ఐ కేసులో భాగంగా జరిపిన తనిఖీల్లో పలు కీలక దస్త్రాలు, ఎలక్ట్రానిక్​ పరికరాలతో పాటు రూ.8 లక్షల 31 వేలు స్వాధీనం చేసుకున్నామని ఎన్​ఐఏ అధికారులు వెల్లడించారు. ఉగ్రవాద కార్యకలాపాలకు క్యాంపులు పెట్టి శిక్షణ ఇవ్వడం, మత కలహాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు గుర్తించారు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని ప్రకటించిన అధికారులు.. మరో 26 మందిపై కేసు నమోదు చేశామని తెలిపారు.

ఇవీ చూడండి..

పీఎఫ్ఐ కేసులో నిజామాబాద్‌, భైంసా, జగిత్యాలలో ఎన్‌ఐఏ సోదాలు

ఆటో డ్రైవర్ జాక్​పాట్.. టికెట్ కొన్న ఒక్కరోజుకే రూ.25 కోట్లు.. విదేశాలకు వెళ్లే ముందే..

ABOUT THE AUTHOR

...view details