పీఎఫ్ఐ కేసులో నిజామాబాద్‌, భైంసా, జగిత్యాలలో ఎన్‌ఐఏ సోదాలు

author img

By

Published : Sep 18, 2022, 7:19 AM IST

Updated : Sep 18, 2022, 10:22 AM IST

nia

07:17 September 18

పీఎఫ్ఐ కేసులో నిజామాబాద్‌లో ఎన్‌ఐఏ సోదాలు

పీఎఫ్ఐ కేసులో నిజామాబాద్‌, భైంసా, జగిత్యాలలో ఎన్‌ఐఏ సోదాలు

NIA searches in PFI case: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా - పీఎఫ్​ఐ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ - ఎన్​ఐఏ తమ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇవాళ తెల్లవారుజామున నిజామాబాద్​తో పాటు నిర్మల్ జిల్లా భైంసా, జగిత్యాల పట్టణంలో సుమారు 20 ప్రదేశాల్లో సోదాలు చేపట్టింది. ఈ కేసులో అరెస్టైన వారితో పాటు పలువురు అనుమానితుల ఇళ్లలోనూ ఎన్​ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. దాడుల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

మరోవైపు నిర్మల్ జిల్లా భైంసాలో కూడా ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. భైంసాలోని మదీనా కాలనీలోని పలు ఇళ్లలో దర్యాప్తు అధికారులు తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్​లో సోదాల అనంతరం అక్కడ లభించిన సమాచారంతో ఇక్కడకు వచ్చినట్లు తెలుస్తోంది. భైంసాలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా శిక్షణా కార్యక్రమాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

తెల్లవారుజామున నిజామాబాద్​లో దాడుల అనంతరం మరో టీమ్ జగిత్యాల చేరుకుంది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నారు. ముందుగా టవర్ సర్కిల్‌లోని కేర్‌ మెడికల్​ షాప్​కు వచ్చి దుకాణం తాళాలు పగులకొడుతుండగా స్థానిక మహిళలు అడ్డుకున్నారు. దీంతో అధికారులు యజమానిని పిలిపించి తనిఖీ నిర్వహించారు. దుకాణంలోని సీసీ ఫుటేజిని పరిశీలించారు. వాటి సాయంతో మరికొందరి ఇళ్లలో సోదాలు జరిపారు. అనుమానితుల ఇళ్లలో అధికారులు పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

నిజామాబాద్ జిల్లాలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా-పీఎఫ్​ఐ పేరులో ఓ సంస్థ కార్యకలాపాలపై ఫిర్యాదులు రావడంతో జిల్లా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కరాటే, లీగల్ అవేర్‌నెస్ శిక్షణ పేరుతో వీరికి సంఘవిద్రోహ కార్యకలాపాలలో శిక్షణ ఇచ్చినట్లు గుర్తించారు. మత ఘర్షణలు జరిగిన సమయంలో ఎలా వ్యవహరించాలి, భౌతిక దాడులు ఎలా చేయాలనే దానిపై శిక్షణ ఇచ్చినట్లు గుర్తించారు. వీరికి పలు ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నాయన్న సమాచారంతో కేసును ఎన్​ఐఏకి అప్పగించారు.

ఇవీ చదవండి:

Last Updated :Sep 18, 2022, 10:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.