తెలంగాణ

telangana

Telangana Chilli Farmers Problems : దయనీయంగా రైతు బతుకు.. తగ్గిపోతున్న మిర్చి సాగు

By

Published : Feb 9, 2022, 1:21 PM IST

Telangana Chilli Farmers Problems : వరుస నష్టాల్లో తెలంగాణ మిర్చి రైతు అల్లాడిపోతున్నాడు. ఓ వైపు ప్రకృతి వైపరీత్యాలు.. మరోవైపు తెగుళ్లు, చీడలు.. ఇంకోవైపు అధిక వ్యయం వంటి కారణాలతో అడుగడుగునా నష్టాల పాలవుతున్నాడు. ఇన్ని కష్టాలు తట్టుకుని పంట సాగుచేస్తే.. కనీసం గిట్టుబాటు ధర కూడా లేకపోవడంతో కుంగిపోతున్నాడు. ఈ గోస తమ వల్ల కావడం లేదని.. ఇక నష్టాలు తట్టుకుని అప్పులు చేసే స్తోమత లేదని.. ఇంతకుముందు వందల ఎకరాల్లో మిర్చి సాగు చేసిన రైతు.. ఇప్పుడు సాగును తగ్గించాడు.

Telangana Chilli Farmers Problems
Telangana Chilli Farmers Problems

Telangana Chilli Farmers Problems

Telangana Chilli Farmers Problems : రాష్ట్రంలో మిరపరైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, అధిక వ్యయం వంటి కారణాలతో.. మిర్చి రైతులు నష్టాలపాలవుతున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో పదేళ్ల కిందట వందల ఎకరాల్లో సాగైన మిర్చి.. వరుస నష్టాలతో ప్రస్తుతం వందెకరాల లోపే పండిస్తున్నారు. ప్రభుత్వం తమకు రాయితీలిచ్చి నష్టాల నుంచి గట్టెక్కించాలని మిర్చి రైతులు కోరుతున్నారు.

దిగుబడి లేదు.. ధర లేదు..

Chilli Farmers Problems in Telangana : నిజామాబాద్ జిల్లాలో బోధన్ డివిజన్‌లో మిరప పంటను ఎక్కువగా సాగుచేస్తుంటారు. భూములు అనుకూలంగా ఉండటంతో పదేళ్ల కింద ఇక్కడి రైతులు వందల ఎకరాల్లో మిర్చి సాగు చేసేవారు. స్థానికంగా మార్కెట్ లేకపోవడంతో.. కాలక్రమేణా సాగుశాతం తగ్గింది. ప్రస్తుతం ఆ పరిస్థితి మరింత దిగజారింది. తెగుళ్లు సోకి మిరప పంటకు దెబ్బతినడం, పెట్టుబడులు పెరగడంతో.. సరైన దిగుబడులు లేక రైతులు నష్టాల పాలవుతున్నారు. గతంలో ఇచ్చిన రాయితీలు ప్రభుత్వం రద్దు చేయడంతో మరింత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఉద్యానశాఖ ద్వారా మిరప విత్తనం ప్రభుత్వం నుంచి లభించడం లేదు. గుంటూరు తదితర ప్రాంతాల నుంచి రైతులే ఎక్కువ ఖర్చు పెట్టి తెచ్చుకోవాల్సి వస్తోంది. పురుగు మందులు, కూలీలు రవాణా వంటి ఖర్చులతో కలిపి ఒక ఎకరం మిరపసాగుకు దాదాపు లక్ష వరకు ఖర్చు చేస్తున్నారు. దీనికి తోడు గిట్టుబాటు ధర లేక చేసిన కష్టానికి ఫలితం లేకుండా పోతోందని.. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇలా అయితే కష్టం..

Chilli Farmers Problems in Nizamabad : 'అంతకు ముందు 10 ఎకరాల్లో మిర్చి పంట వేసేవాళ్లం. తెగుళ్లు, చీడలు, వాతావరణంలో మార్పుల వల్ల ఇప్పుడు దిగుబడి ఎక్కువ రావడం లేదు. అందుకే ఇప్పుడు కేవలం 2,3 ఎకరాల్లో మాత్రమే పంట సాగు చేస్తున్నాం. మిర్చి సాగు చేయాలంటే భయమేస్తోంది. కూలీల రేటు కూడా దారుణంగా పెరిగింది. సరే అని.. అంత కష్టపడి పంట పండిస్తే గిట్టుబాట ధర కూడా లభించడం లేదు. అందుకే మిర్చి సాగు తగ్గిపోతోంది. మాకు ప్రభుత్వం సాయం చేస్తే మేం కాస్త తక్కువ నష్టపోతాయి.'

- మిర్చి రైతులు

మమ్మల్ని గట్టెక్కించండి..

Mirchi Farmers in Bodhan : పంటకు తెగుళ్లు, గిట్టుబాటు ధర లేకపోవడం, అధిక పెట్టుబడులు వంటి కారణాల వల్ల రైతులు క్రమంగా మిరపపంట విస్తీర్ణం తగ్గించారు. బోధన్‌ మండలంలోని మావందిఖుర్దు, మావందికలాన్, బండారుపల్లి, రెంజల్ మండలం నీలా, కందకుర్తి మిర్చి పంట సాగుకు పేరుగాంచిన గ్రామాలు కాగా.. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లోనే కొద్దోగొప్పో సాగవుతోంది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మిర్చి సాగు పెరుగుతుందని రైతులు అంటున్నారు. ఉద్యానశాఖ దృష్టి సారించి ఇక్కడి రైతులకు విత్తన రాయితీతోపాటు ఇతర ప్రోత్సాహకాలు అందిస్తే నష్టాలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details