తెలంగాణ

telangana

తెరాస దాడిని ఖండించిన భాజపా నేతలు.. మా కార్యకర్తలు బరిలోకి దిగితే తట్టుకోలేరు

By

Published : Nov 18, 2022, 4:48 PM IST

BJP Leaders fires on TRS Activists Attack : ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి ఘటనపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, డి.కె.అరుణ, ఈటల రాజేందర్, బూర నర్సయ్యగౌడ్, చింత రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనే సత్తాలేక దాడులకు దిగారని ఆరోపించారు. తెరాస కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండించారు. ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోకుంటే కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.

BJP
BJP

BJP Leaders fires on TRS Activists Attack : భాజపా ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడితో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అర్వింద్ ఇంటిపై తెరాస కార్యకర్తల దాడిని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, చింతల రామచంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. దాడిని ఖండిస్తూ భాజపా పార్టీ తెలంగాణ భవన్‌ ముట్టడికి పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. అలాగే ఈ దాడిని నిరసిస్తూ భాజపానేతలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.

మా కార్యకర్తలు బరిలోకి దిగితే తట్టుకోలేరు : ఎంపీ ధర్మపురి అర్వింద్‌ నివాసంపై తెరాస కార్యకర్తల దాడిపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనే దమ్ము లేక భౌతిక దాడులకు దిగి రౌడీయిజం చేస్తారా అని ఆయన మండిపడ్డారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ములేని వాళ్లు ప్రశ్నించే గొంతును నొక్కాలనుకుంటున్నారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. గడీల గూండా దాడులకు భయపడతామనుకుంటున్నారా అని ప్రశ్నించారు. భాజపా సహనాన్ని చేతగానితనం అనుకోవద్దన్న ఆయన.. తమ కార్యకర్తలు బరిలోకి దిగితే తట్టుకోలేరని హెచ్చరించారు. ప్రజలే తెరాస గూండాలకు కర్రుకాల్చి వాతపెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అర్వింద్‌ కుటుంబానికి తెరాస నుంచి ప్రాణహాని ఉంది : ఎంపీ అర్వింద్‌ ఇంటిపై తెరాస కార్యకర్తల దాడిని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ తీవ్రంగా ఖండించారు. తెరాస గూండాలు దాడి చేయడం సిగ్గుచేటని డీకే అరుణ మండిపడ్డారు. భాజపా కార్యకర్తలు ధర్నా ఆలోచన చేస్తేనే పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఏ కేసులు నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఈ దాడికి కారణమైన ఎమ్మెల్సీ కవితపైనా పోలీసులు కేసు నమోదు చేయాలని అరుణ డిమాండ్ చేశారు. ధర్మపురి అర్వింద్‌ కుటుంబానికి తెరాస నుంచి ప్రాణహాని ఉందని ఆమె పేర్కొన్నారు. ఇంట్లో ఎంపీ లేరని తెలిసి కూడా ఈ విధంగా దాడికి పాల్పడటం దేనికి సంకేతమని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో దాడులు సహించరానివని ఈటల రాజేందర్ మండిపడ్డారు. తెరాస నాయకులు దాడులను ప్రోత్సహించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెరాస చేస్తున్న దాడుల రాజకీయం ఎల్లకాలం చెల్లదని వ్యాఖ్యానించారు.

చర్యలు తీసుకోకుంటే కోర్టును ఆశ్రయిస్తాం: రాజకీయాల్లో విమర్శలను.. ప్రతి విమర్శలతోనే ఎదుర్కోవాలని బూర నర్యయ్య అన్నారు. అంతేకానీ నేతలు ఇంట్లో లేని సమయంలో ఇలాంటి దాడులకు పాల్పడటం సరైంది కాదన్నారు. ఇలాంటి దాడులకు స్పందించి భాజపా శ్రేణులు ప్రతిదాడులకు దిగితే తెరాస తట్టుకోగలదా అని ప్రశ్నించారు. హింసను ప్రేరేపించే విధంగా రాజకీయాలు చేయడం తెరాసకు తగదని హితవు పలికారు. ఒక ఎంపీని చంపుతామని బెదిరించడం సరైనదేనా అని చింతల రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవిత, తెరాస కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోకుంటే కోర్టును ఆశ్రయిస్తామని రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details