తెలంగాణ

telangana

చదువుల తల్లీ.. సీట్లు అనుగ్రహించవేమి!

By

Published : Mar 29, 2021, 8:59 AM IST

ఆర్జీయూకేటీ (రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ)లో సీటొస్తే మంచి భవిష్యత్తు సొంతమైనట్లే. ఇదీ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉన్న భావన. ఇందుకు తగ్గట్టుగా ఇందులో ప్రవేశాలకు పోటీ తీవ్రంగా ఉంటోంది.

basara, rjukt
http://10.10.50.85:6060//finalout4/telangana-nle/thumbnail/29-March-2021/11197725_112_11197725_1616986644287.png

ఆర్జీయూకేటీ సంస్థకు ఏపీలో 4 క్యాంపస్‌లు ఉండగా.. తెలంగాణలో నిర్మల్‌ జిల్లా బాసరలో ఒకే ప్రాంగణం ఉంది. గ్రామీణ విద్యార్థులకు వరంలాంటి ఈ విద్యాలయంలో సీట్లు పెంచడంతో పాటు అనుబంధంగా మరిన్ని ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి వినతులు వస్తున్నాయి. తాజాగా ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి శాసనసభలో ప్రస్తావించగా.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిశీలిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఈ క్రమంలో సీట్ల పెంపు, నూతన ప్రాంగణం ఏర్పాటుపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పదో తరగతి మార్కుల ఆధారంగా 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సు (ఇంటర్‌+బీటెక్‌)లో ప్రవేశాలు కల్పించే ఈ సంస్థ (బాసర)లో 1500 సీట్లు ఉండగా.. గత ఏడాది 40,158 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో సీటుకు సగటున 27 మంది పోటీపడ్డారు. ఈ 40 వేల మందిలో 10 జీపీఏ సాధించినవారే 9 వేల మందికి పైగా ఉన్నారు. ప్రవేశాల సంఖ్య పరిమితంగా ఉండటంతో పది జీపీఏ వచ్చిన సుమారు 7,500 మంది విద్యార్థులకు విద్యాలయంలో సీటు లభించలేదు.

కార్యరూపం దాల్చని వనపర్తి ప్రాంగణం

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఒంగోలు, శ్రీకాకుళంలో రెండు ప్రాంగణాలు ఏర్పాటుచేశారు. తెలంగాణలో మరో ప్రాంగణాన్ని వనపర్తిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా కార్యరూపం దాల్చలేదు. బాసర ప్రాంగణంలో 2000 మంది విద్యార్థులకు అవసరమైన వసతులు ఉన్నాయి. ఈ క్రమంలో ఇక్కడ మరో 500 సీట్లు పెంచితే గ్రామీణ విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు.

ఇదీ చూడండి:యాదాద్రి ఆలయంలో మరో 32 మంది సిబ్బందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details